Monday 6 April 2015

ఏప్రిల్‌ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
Posted on: Mon 06 Apr 22:38:06.764362 2015
                      మన ఆరోగ్య సంరక్షణలో పోషకాహారానికి ఉన్న ప్రాధాన్యత కొత్తగా చెప్పనవసరం లేదు. ఆహారం విషయంలో పోషక విలువలు ఎంతముఖ్యమో పరిశుభ్రత అంతే ముఖ్యం. పరిశుభ్రత లోపించిన లేదా కల్తీచేయబడిన ఆహార పదార్థాల వలన విరేచనాలు మొదలు కొని క్యాన్సర్‌ల వరకు 200 రకాల వ్యాధులు వస్తాయి. అపరిశుభ్రమైన నీరు, ఆహారం వలన వచ్చే విరేచనాలతో యేటా ప్రపంచ వ్యాపితంగా 22 లక్షల మంది ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. ఇందులో ప్రధాన వాటా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలదే! దీర్ఘకాలిక పోషకాహార లోపానికి, వ్యాధులకు అపరిశుభ్రమైన ఆహారం కూడా ఒక ముఖ్య కారణం. ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మొదలుకొని ఈ సంవత్సరమంతా ''పొలం నుంచి పళ్లెం వరకు ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచండి'' అనే నినాదంతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు.
ఆహారసంబంధ వ్యాధులు -కారణాలు..
ఆహార పదార్థాలలో బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవులు వంటివి చేరడం వల్ల, లేదా హానికారక రసాయనాలు కలవడంవల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయి. ఆహారం కలుషితమయినప్పుడు తలెత్తే వాంతులు, విరోచనాలు శరీరం విషతుల్యం కావడం వంటి తక్షణ సమస్యలే కాకుండా దీర్ఘకాలం పాటు కలుషిత ఆహారాన్ని తింటే ఊపిరితిత్తులు, నాడీమండల, శ్వాసకోశవ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్లు తలెత్తుతాయి.
ఏవి ప్రమాదకరమైన ఆహారాలు?
సరిగా ఉడికించని మాంసపు ఉత్పత్తులు, శుభ్రపరచని పండ్లు, కూరగాయలు, సముద్ర విషపదార్థాలతో కలుషితమైన చేపలు వంటివి.
కల్తీకి గురయ్యే ఆహారపదార్థాలు : పాలు, నెయ్యి, వంటనూనెలు, మసాలా పొడులు, గోధుమపిండి, టీ పొడి, కాఫీపొడి, మిరి యాలు, పసుపు, చక్కెర, బెల్లం, కందిపప్పు, తేనె మొదలగునవి.
ఆహారం ఇలా కలుషితం అవుతుంది..
పొలంలో పండించిన దగ్గర నుండి (శాకాహారం) లేదా ఫారాలలో పెంచేదశ నుండి (మాంసాహారం) -వాటిని సేకరించ డం, శుద్ధి చేయడం, ప్యాకింగ్‌ చేయడం, రవాణా చేయడం, నిల్వ వుంచడం, వండి వడ్డించే వరకు వివిధ దశలలో ఆహారం ఎక్కడైనా కలుషితం అయ్యే అవకాశం వుంది.
మితిమీరి వాడుతున్న ఎరువులు, పురుగుమందులు, జంతువుల ఆహారంలో కలుపుతున్న ఔషధాల వలన.
హోటళ్లలో, దుకాణాలలో పదార్థాల తయారీలో, నిల్వ ఉంచడంలో తగిన పరిశుభ్రత, ఇతర జాగ్రత్తలు పాటించనందున.
ఆహారం దీర్ఘకాలం నిల్వఉండడానికి, పండ్లు త్వరగా పండడానికి, మంచి రంగులో కనిపించడానికి కలిపే రసాయనాల వలన.
పదార్థాల పరిమాణం పెంచేందుకు చేసే కల్తీ కారణంగా.
ఆహార పరిశుభ్రత - అందరిబాధ్యత..
ప్రభుత్వాలు: పట్టిష్టమైన చట్టాలు రూపొందించి అమలు చేయాలి. దేశంలో వివిధ ప్రాంతాలలో తలెత్తుతున్న ఆహార సంబంధ వ్యాధులను గుర్తించడానికి ప్రాంతీయ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటుచేయాలి. తగిన సంఖ్యలో ఆహార తనిఖీ అధికారులను నియమించాలి. వారు పారదర్శకంగా బాధ్యతలు నిర్వహించేలా చూడాలి. ఆహార పదార్థాల తయారీ, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, రవాణా, విక్రయం వంటి దశలలో పాటించ వలసిన జాగ్రత్తలను, నిబంధనలను స్పష్టంగా స్థానిక భాషలో తెలియచేయాలి. అవి పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు తమ ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, కల్తీలను గుర్తించి నివారించు కోవడానికి కావలసిన అవగాహన కల్పిం చాలి. ఇందుకు జన విజ్ఞానవేదిక వంటి సైన్సు ప్రచార సంస్థలు, పౌర సంఘాలు, వినియోగ దారుల సంఘాల సహకారం తీసుకోవచ్చు.
పౌర సంఘాలు : తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలను డిమాండ్‌ చేయాలి. ప్రజలకు అవగాహన కలగచేయాలి.
విద్యాసంస్థలు : తమ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆహార పరిరక్షణపై అవగాహన కలిగించాలి.
ప్రజలు : ఆహార పరిశుభ్రతకు తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలను డిమాండ్‌ చేయాలి. ఆహార సంబంధ వ్యాధులపై అవగాహన పెంచుకుని పరిశుభ్రత పాటించాలి. ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు వాడేటప్పుడు లేబుల్‌పై ఉన్న సూచ నలను పాటించాలి. కల్తీని గుర్తించి ఆహార తనిఖీ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
- జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ కమిటీ

No comments:

Post a Comment