Saturday 4 October 2014

ఆరోగ్యానికి హాని... అజనమామోటో
                         గతంలో భోజనం చేయడమంటే కేవలం ఇంట్లో వంట చేసుకుని తినడమే. బైటినుంచి పదార్థాలు తెచ్చుకుని తినడమనేది చాలా అరుదుగా జరిగేది. కాని ప్రస్తుతం కాలం మారిపోయింది. ఏ ఇంట్లో చూసినా తినడానికి సిద్ధంగా ఉండే పదార్థాలు (రెడీ టు ఈట్‌) దర్శనమిస్తున్నాయి. అయితే దీనితోపాటు ప్రజల్లో కొంత చైతన్యం కూడా పెరిగింది. గుడ్డిగా ఏదిపడితే అది కొనుక్కుని తినే పరిస్థితిలో ప్రజలు లేరు. తాము తీసుకుంటున్న ఆహార పదార్థాలలో ఏఏ దినుసులు మిళితం చేసి తయారు చేశారనే విషయాన్ని ఆయా ప్యాకెట్ల లేబుల్స్‌పై చూస్తున్నారు. ఈ రకమైన చైతన్యం ఆహార పదార్థాలు రుచిగా ఉండేందుకు అందులో కలిపే అజినామోటోపై విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి.
                అజినామోటో శాస్త్రీయ నామం మోనోసోడియం గ్లూటమేట్‌. ప్యాకెట్లలో లభ్యమయ్యే అనేక రకాల ఆహార పదార్థాలలో దీనిని ఉపయోగిస్తున్నారు. తొలినాళ్లలో కేవలం చైనాకు చెందిన ఆహార పదార్థాలను తయారు చేయడంలో మాత్రమే దీనిని ఉపయోగించేవారు. కాని ప్రస్తుతం అన్ని రకాల ఆహారాల్లోనూ దీనిని వాడుతున్నారు.
               రెడీ టు ఈట్‌ పదార్థాల ప్యాకెట్లపై లేబుల్‌ను నిశితంగా పరిశీలిస్తే అందులో వాడిన దినుసుల జాబితాలో ఖచ్చితంగా అజినామోటో పేరు కూడా కనిపిస్తుంది. నూడుల్స్‌ వంటి పదార్థాల్లోనే కాకుండా చివరకు ఆలు చిప్స్‌ వంటి పదార్థాల్లో కూడా దీని వాడకం కనిపిస్తుంది.
జపాన్‌కు చెందిన అజినామోటో కార్ప్‌ దీనిని తొలిసారిగా 1909లో కనుగొన్నది. ఇది ఆహార పదార్థాలకు మరింత సువాసనాభరితంగా ఉండేట్లు చేస్తుంది. అంతేకాకుండా దీనికి అలవాటుపడేలా చేస్తుంది. అజినామోటో అతి తక్కువ ధరకే లభ్యం కావడమనేది ఆహర పదార్థాలు తయారు చేసే కంపెనీలకు ఒక వరంగా మారింది. దీనిని ఉపయోగించడం వారికి లాభాలను చేకూర్చిపెట్టింది. ప్రస్తుతం దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
అజినామోటో వల్ల కలిగే అనర్థాలను పరిశీలిద్దాం.
                    తలనొప్పి : మోనోసోడియం గ్లూటమేట్‌ ప్రధాన దుష్పరిణామం తలనొప్పి. అయితే ఇది చిన్న సమస్య మాత్రమే. ఈ తలనొప్పి నెమ్మదిగా మైగ్రేన్‌గా రూపాంతం చెంది తరువాత కాలంలో తీవ్ర సమస్యలకు కారణమయ్యే అవకాశాలున్నాయి. తలనొప్పి తీవ్రంగా రావడమే కాకుండా, పదేపదే వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
                నాడీ వ్యవస్థపై ప్రభావం : అజినామోటో వల్ల నాడీ మండల వ్యవస్థ దెబ్బ తింటుంది. నరాలు మొద్దుబారడం, చిటపటమంటున్నట్లు ఉండటం, ముఖంలోనూ, మెడ భాగంలోనూ మంటగా అనిపించడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. మత్తుగా ఉన్న భావన, బలహీనత కనిపిస్తాయి. నరాల క్షీణత కారణంగా సంభవించే పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌, హంటింగ్టన్స్‌, మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌ తదితర వ్యాధులు సోకడానికి అజినామోటో కారణమవుతుంది.
               గుండె జబ్బులు : గుండె కొట్టుకునే క్రమాన్ని అజినా మోటో దెబ్బ తీస్తుంది. ఛాతీ నొప్పి, హఠాత్తుగా గుండె వైఫల్యం చెందడం వంటి సమస్యలకు కారణమవుతుంది.
            మహిళలకు మంచిది కాదు : అజినామోటో వల్ల స్త్రీలలో వంధ్యత్వం కలిగే అవకాశాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గర్భిణీ స్త్రీలు అజినామోటో ఉన్న ఆహారాలను తీసుకోకూడదు. శిశువులకు అజినామోటో ఉన్న ఆహారాలను ఇవ్వకూడదు. ఇటువంటి హెచ్చరికలు ప్యాకెట్లపై ప్రచురించాలని వారు సూచిస్తున్నారు.
             ఇతర సమస్యలు : అధిక రక్తపోటు, ఉదరకోశ సంబంధ రుగ్మతలు, థైరాయిడ్‌ పనితీరు దెబ్బ తినడం, స్థూలకాయం, ఆస్తమా, టైప్‌ 2 మధుమేహం, హార్మోన్లలో అసమతుల్యత, ఆటిజం, ఎలర్జీలు మొదలైన అనేక సమస్యలకు అజినామోటో కూడా కారణమవుతున్నది.
Courtesy with: PRAJA SEKTHY DAILY

No comments:

Post a Comment