Wednesday 25 June 2014

వాస్తులో వాస్తవం లేదు
      ఈ మధ్య వాస్తును చాలామంది పాటిస్తున్నారు. వాస్తు శాస్త్రము నిజానికి ఓ విజ్ఞానశాస్త్ర భాగమా?
- ఎల్‌. శ్వేత, మందమర్రి, ఆదిలాబాద్‌
        వాస్తులో వాస్తవమేమీ లేదనీ, సందర్భానుసారంగా, అవకాశానుగు ణంగా దానిని వాడుకుంటున్నారనీ, దానికి ఏమాత్రం శాస్త్రీయ ప్రతిపత్తి లేదనీ ఇదే పత్రికలో పలు వ్యాసాల ద్వారా నా మిత్రుడు కె.ఎల్‌. కాంతారావుగారు వివరించి ఉన్నారు.
             ఈ దేశంలో మరే దేశంలోనూ లేనన్ని మూఢనమ్మకాలున్నాయి. మత ఛాందసత్వం, మతతత్వ రాజకీయాలు ఈ మూఢనమ్మకాలకు కావలసినంత సంపోషణనిస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక, సాంస్కృతిక సమస్యలకు పరిష్కారాలను చూపడంలో కావాలనే నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్న పాలక వర్గాలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి, వారిని నిరంతరం ఊహల ప్రపంచంలో ఉంచడానికి, వారి సమస్యల పరిష్కారం వాస్తవ జగత్తులోను, పోరాట స్థలాల్లోను కాకుండా మిథ్యా పేటికల్లో చూపడానికి ఓ పథకం ప్రకారం పనిచేస్తున్నాయి. విజ్ఞానశాస్త్ర బీజాలు మనసులో పడకముందే మూఢనమ్మకాల వటవృక్షపు వేళ్లను నరనరాన విస్తరించే మూర్ఖపు వ్యవస్థల్ని ఉసిగొల్పుతున్నాయి. అందువల్లే విజ్ఞానశాస్త్రం, చదువుసంధ్యలు అందించే శాస్త్రీయత స్థానంలో మూఢనమ్మకాల పర్వతాలు పేరుకుపోయాయి. ఇక చదువరులు, అధికారులు, పాలకులు, సాధారణ ప్రజలు శాస్త్రీయ దృక్పథం ప్రాధాన్యాన్ని ఎలా గుర్తించగలరు?
వాస్తును ప్రచారం చేసేవారు విజ్ఞానశాస్త్రపు వాదనల సమయంలో గాలి, వెలుతురు, దుమ్ము, ధూళి, భవనపు సౌష్టవత, కట్టడపు బలం వగైరా అంశాలను నొక్కి చెప్పడానికే వాస్తు నిపుణులైన మహర్షులు వాస్తును రూపొందించారు కానీ, అందులో అశాస్త్రీయత ఏమీ లేదని వాదిస్తారు. మరో మాటలో చెప్పాలంటే ఆధునిక సివిల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఆర్కిటెక్చర్‌కు మౌలిక లేదా వ్యావహారిక వైజ్ఞానిక రూపమే వాస్తు శాస్త్రం అన్న పిక్చర్‌ ఇస్తారు. వాస్తు కూడా సివిల్‌ ఇంజనీరింగే అయినట్లయితే వాస్తు పండితుల దగ్గరికి వెళ్లకుండా ఓ నమ్మదగిన సివిల్‌ ఇంజినీరును సంప్రదించాలి.
          వాస్తు చుట్టూ వైజ్ఞానిక విషయాలు దాదాపు శూన్యం. ఇంట్లో జ్వరం వచ్చినా, అల్లుడికి అమెరికాలో ఉద్యోగం ఊడినా, ఫలాని కళాశాలలో కొడుకుకి మార్కులు తక్కువ వచ్చినా, కూతురు పెళ్లి కావడానికి ఆలస్యం అవుతున్నా, భార్యాభర్తల మధ్య రోజూ వాగ్వివాదాలు, ఘర్షణలు ఉంటున్నా, పదవి ఊడిపోతుందేమోనన్న భయం ఉన్నా, పాలనా దక్షత లేక తన పరిపాలనలో ఎపుడూ సమస్యలు వస్తున్నా ఆ సమస్యల్ని సహేతుకంగా, వాస్తవ ప్రపంచంలో సామాజిక కోణాల్లోంచి చూడకుండా ఇంటిగోడల మూలల్లోను, తలుపు సందుల్లోను, కిటికీ ఊచల్లోను, తలుపుల సంఖ్యలోను, పెరటి చెట్లలోను, తోటల్లోను, ఇంటిపైనున్న బరువులలోను పరిష్కారాలను వెదికే కుహనా శాస్త్రమే వాస్తు.
       భౌతికవాదుల ప్రకారం భూమికి ఉన్న అయస్కాంత దిశ తప్ప మరే విషయంలోను ఓ నిర్దిష్ట ప్రాంతీయ దిశలను బట్టి తేడాలు ఉండవు. మా ఇంటికి తూర్పున చెట్టు ఉంటే అది పక్కింటి వాళ్లకు పడమర ఉన్నట్లు అర్థం. మా ఇంట్లో బోరుబావి ఈశాన్యంలో ఉంటే అదే బోరు బావి నుంచి అడపా దడపా నీళ్లు పొందుతున్న పక్కింటి వాళ్లకు ఆగేయంలో ఉన్నట్టు అర్థం.

Curtsey with : PRAJA SEKTHI 

No comments:

Post a Comment