Sunday 23 March 2014

ఈ దధీచి ఎముకనే సృష్టిస్తున్నాడు




      దధీచి అనే మహర్షి తన వెన్నెముకనే వజ్రాయుధంగా చేసి ఇంద్రుడికి ఇచ్చాడంటారు. కానీ బిక్రమ్‌ జిత్‌ బసు ఎముకనే సృష్టించి జనారోగ్యరంగానికి ఒక గొప్ప ఆయుధంగా అందిస్తున్నాడు. నిజమైన ఎముకలా పనిచేసే ఈ ఎముక వైద్యరంగంలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ.
        అక్కడికి వెడితే జనసందోహంతో కోలాహలంగా ఉండే బెంగళూరులో ఉన్నామనిపించదు. అది చాలా చల్లగానే కాక, నిశ్శబ్దంగా కూడా ఉంది. అందులో ఒక వ్యక్తి తన వృత్తికి సంబంధించిన పరికరాల మధ్య పచార్లు చేస్తున్నారు. అవి మరేవో కావు, జీవకణాలు, ఒక మైక్రోస్కోప్‌, ఒక ఆవిరి పాత్ర, పరికరాలను శుభ్రంగా ఉంచడానికి ఒక అతినీలలోహిత కిరణాల చాంబర్‌, రిఫ్రిజరేటింగ్‌ యూనిట్లు. అవన్నీ బయోలజీతో ముడిపడిన వన్న సంగతి తెలుస్తూనే ఉంది. బయోలజీ పని జీవపదార్థాన్ని శోధించడమే. 'ఇది మీకు ఒక మెడికల్‌ లేబరేటరీగా కనిపిస్తోంది కదూ?' అన్నాడు, ముసిముసిగా నవ్వుకుంటూ. ఆయన పేరు బిక్రమ్‌జిత్‌ బసు. వయసు 40 ఏళ్లు. ఆయన ఒక ఇంకుబేటర్‌ తెరిచారు. అది అప్పుడే పుట్టిన శిశువును ఉంచిందని అనుకునేరు, కాదు. అందులో 37 డిగ్రీల సెల్సియెస్‌ వద్ద మానవజీవకణాలు పెరుగుతున్నాయి. మానవశరీర ఉష్ణోగ్రత అదే.
ఆయనది 'విద్యుత్‌' భాష
2013లో యువశాస్త్రవేత్తలకు ఇచ్చే శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు ను అందుకున్న బసు, 114 ఏళ్ల చరిత్ర ఉన్న బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సులో మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. వైద్యరంగంలో ఒక నూతనశకాన్ని ఆవిష్కరించబోయే ప్రయత్నంలో ఆయన మునిగి తేలుతున్నారు. అది: కృత్రిమ వాతావరణంలో జీవకణాలను అభివృద్ధి చేయడం. అందుకు ఆయన ఉపయోగించే ప్రధాన సాధనం, విద్యుత్తు. మనదేశంలో ఆ రంగంలో కృషి చేస్తున్నవారు చాలా తక్కువ. వారిలోనూ బసు ముందడుగులో ఉన్నారు. ఆయన గురించి ఇంకో విశేషం ఏమిటంటే, ఆయన 12వ తరగతివరకు తన మాతృభాష అయిన బెంగాలీ మాధ్యమంలోనే చదువుకున్నారు.
చిన్నపాటి రెండు గదులు మాత్రం ఉన్న ఆ లేబరేటరీలో డీప్‌ ఫ్రీజర్‌ పరిమాణంలోని ఒక త్రీడీ ప్రింటర్‌ ఉంది. అది సరదాగా ఎవరో ఒక మోడల్‌ కారు తయారుచేయడానికి ఉద్దేశించిందా అన్నట్టుగా ఉంది. అందులో మాగెట్లు, బ్యాటరీలు, ఒక గ్యాస్‌ సిలెండర్‌ ఉన్నాయి. ఇవన్నీ కృత్రిమ పరికరాల తయారీకి సంబంధించిన ఇంజనీరింగ్‌ సామగ్రే. ఈ చిన్న లేబరేటరీలోనే బసు విద్యార్థులతో కలసి తన ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. తను ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థేకాక, తనింతకుముందు పనిచేసిన కాన్పూర్‌ ఐఐటి, ఆమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీ ఆయన ప్రయోగాలను స్పాస్సర్‌ చేస్తున్నాయి.
ఇంతకీ బసు ప్రయోగాలు ఎలాంటివంటే, ఆయన జీవరహితపదార్థం మీద జీవకణాలను అభివృద్ధి చేస్తూ, వాటితో కొత్త ఎముకల ప్రోటో టైపులు అంటే, మాతృకలు తయారుచేస్తున్నారు. ఇంతేకాదు, ఇదే పద్ధతిలో గుండె, నరాలకు సంబంధించిన జీవకణాలను కూడా ఉత్పత్తిచేసే పనిలో ఉన్నారు. ఆయన పరిశోధనలన్నింటికీ కీలకం విద్యుత్తు. అది కూడా అతి తక్కువ విద్యుత్‌ ప్రసారం. ఇటువంటి విద్యుత్తుతో పనిచేయించడానికి ఎంతో నైపుణ్యం కూడా ఉండాలి. జీవకణాలతో మాట్లాడడానికి బసు ఉపయోగించే భాష ఈ తరహా విద్యుత్తే. జీవకణాలు ఎలా పెరగాలో విద్యుత్తే బోధిస్తుందనడం కొత్త విషయం ఏమీ కాదు. జీవులన్నింటిలోనూ నిరంతరం మంద్రస్థాయిలో విద్యుత్తు ప్రవహిస్తూనే ఉంటుంది. వోల్టేజిలలో మార్పులు చేసి కళ్లు వెనుక వైపు, గుండె మరో చోట ఉండే కప్పలను సైంటిస్టులు ఎన్నో దశాబ్దాలుగా సృష్టిస్తూనే ఉన్నారు.
బసు చేస్తున్నది ఏమిటంటే, కృత్రిమ పరిసరాలలో విద్యుత్తును ఉపయోగించి ఎముకలను, గుండె, నరాలకు చెందిన జీవకణాలను, చివరికి స్టెమ్‌ కణాలను (ఇవి ఇతర రకాల కణాలను కూడా అభివృద్ధి చేస్తాయి) కూడా పెరిగేలా చేయడం. ఇదంత తేలిక కాదు. అపరిచిత పరిసరాలలో జీవకణాలను పెంచడానికి ఎప్పుడు, ఎంత విద్యుత్తును ప్రసరింపజేయాలో బయో ఇంజనీర్‌కు కచ్చితంగా తెలిసి ఉండాలి. కణవిభజన దెబ్బతినకుండానూ, కణాలు చనిపోకుండానూ చూడాలి. 'రెండు కణాలు మాట్లాడుకునేటప్పుడు, మనం ఉపయోగించే పదార్థం అందుకు వెసులుబాటు కలిగించేదిగా ఉండాలి' అంటారు బసు.
నిజమైన ఎముకలా...
ఉదాహరణకు, బసు బృందం మనిషి ఎముకలను తలపించే హైడ్రోగ్జ్యాపటైట్‌ అనే మిశ్రమాన్ని ఎముకల అభివృద్ధిలో ఉపయోగిస్తుంది. ఎముకకు ఉండే మరో స్వభావం ఏమిటంటే, నడవడం వంటి మెకానికల్‌ ఒత్తిడి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం. హైడ్రోగ్జ్యాపటైట్‌ స్ఫటికాలను, టైటానియం, సిల్వర్‌ వంటి రకరకాల సామగ్రితో పులియబెట్టడంలో బసు లేబరేటరీ నైపుణ్యం సంపాదించింది. ఈ ఎముకల నిర్మాణానికి వాడే పదార్థాలనుంచి వివిధ ఆకృతులు అల్లడానికి త్రీడీ ప్రింటర్‌ ఉపయోగిస్తారు. ఈ కృత్రిమ ఎముక నిజమైన ఎముకలా పనిచేయాలంటే, అది విద్యుద్వావహకంగానూ, కఠినంగా ఉంటూనే వంగే విధంగానూ, బరువులు మోసేదిగానూ ఉండాలి. అదే సమయంలో, కొత్త ఎముక కణాలను ఉత్పత్తి చేసుకోగలిగేలానూ, సూక్ష్మజీవుల దాడిని నిరోధించేదిగానూ ఉండాలి. కృత్రిమంగా సృష్టించిన జీవసామగ్రి విజయవంతంగా పనిచేయాలంటే, వాటిని శరీరం తనలో ఇముడ్చుకోగలిగేలా ఉండాలి. ఇలాంటి కృత్రిమ సామగ్రిని శరీరంలో అమర్చినప్పుడు ప్రధానంగా ఎదురయ్యే సమస్య, ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా బ్యాక్టీరియా ద్వారా. ఈ బ్యాక్టీరియా అభివృద్ధిని నిరోధించడానికి బసు బృందం ప్రకృతిలోని మరో శక్తిని రంగంలోకి దింపింది. అది, మేగటిజం. ఈ రకంగా తయారుచేసిన ఎముకను ఇప్పటికే ఎలుకలపై ప్రయోగించి చూశారు. ఒక ఎలుక తొడ ఎముకలో డ్రిల్లింగ్‌ చేసి రెండు మిల్లీ మీటర్ల వ్యాసార్థం ఉన్న చిన్నపాటి సిలిండర్‌ లాంటి కృత్రిమ ఎముకను అందులోకి చొప్పించారు. అది పాత ఎముకలానే పనిచేయడం ప్రారంభించింది. తదుపరి అడుగు, ఇతర జీవులపై, ముఖ్యంగా మనుషులపై ప్రయోగాలు జరపడమే. అయితే అందుకు మరింత పరిశోధన జరగాలి. అలాగే, అనుమతులు వగైరాలు అవసరమవుతాయి. ఆ దశకు చేరేది 2015 తర్వాతే.
బసు ఇంకో సమస్యను కూడా ఎదుర్కోవాలి. పశ్చిమదేశాల్లో బసు నిర్వహించే లేబరేటరీలాంటివి ఆసుపత్రులకు అనుబంధంగా ఉంటాయి. మనదేశంలో అలా కాదు. ఇక్కడ అంతా కంపార్ట్‌మెంటల్‌ పద్ధతిలో ఉంటుంది. ఇది మా శాఖకాదు, అంటూ ఎవరికి వారు గిరిగీసుకుని కూర్చుంటారు. కనుక ఓ వైపు అసుపత్రులను, ఇంకోవైపు కంపెనీలను బసు సంప్రదించుకుంటూ ఉండాలి. మనదేశంలో ఆసుపత్రులపైన డాక్టర్లపైన కేసుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌, హోమీ బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటివి ఏవో కొన్ని మాత్రమే ఇందుకు మినహాయింపు. అయితే ఇవి క్యాన్సర్‌ చికిత్సలోనే స్పెషలైజ్‌ చేస్తున్నాయి. టాటా ఆసుపత్రిలో బసుకు మద్దతుదారుగా ఉన్న ఆర్థోపెడిక్‌ ఆంకాలజీ చీఫ్‌ అజరు పురి పదేళ్ల క్రితం తక్కువ ధరకు లభించే ఒక మెటాలిక్‌ పరికరాన్ని అభివృద్ధి చేశారు. బోన్‌ క్యాన్సర్‌ ఉన్నప్పుడు ఏ రోగికైనా శస్త్రచికిత్స జరిపి ఏదైనా అవయవాన్ని తొలగించినప్పుడు దాని స్థానంలో పురి అభివృద్ధి చేసిన పరికరాన్ని అమర్చవచ్చు. అయితే ఈ పరికరం పూర్తిగా యాంత్రికం కనుక దీని ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. బసు అభివృద్ధి చేసే ఎముక స్వతాహా పెరగగలగడమే కాక, దాని ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉంటుంది.
జనోపయోగంగా...
హైదరాబాద్‌లోని ఎక్సెల్‌ మ్యాట్రిక్స్‌ బయొలాజికల్‌ డివైసెస్‌ సహా వివిధ కంపెనీలు బసు ప్రయోగాలకు ప్రస్తుతం మద్దతు ఇస్తున్నాయి. బసు మాటల్లో ఎంతో ఆశాభావం, పట్టుదల వ్యక్తమవుతుంటాయి. 'ఈ పరిశోధననంతటినీ జనానికి ఉపయోగపడే పరికరాలుగా మార్చడమే నా లక్ష్యం' అంటారాయన. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సులో కొత్తగా ఒక బయోమెటీరియల్స్‌ విభాగాన్ని ప్రారంభించాలని కూడా ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం దానిని పరిశీలిస్తోంది.
దధీచి అనే మహర్షి తన వెన్నెముకనే వజ్రాయుధంగా చేసి ఇంద్రుడికి ఇచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి. బసు కొత్త ఎముకనే సృష్టించి మానవాళి ఆరోగ్యానికి గొప్ప ఆయుధాన్ని ఇవ్వబోతున్నారు. 

No comments:

Post a Comment