Thursday 27 March 2014

చిప్స్‌, కోక్‌, క్యాడ్‌బరీస్‌     
                 మన సమాజంలో అతి తక్కువ ఆలోచించేది పిల్లల గురించి. అదేమిటి, తల్లిదండ్రులు ఇవాళా, రేపూ తాము అపురూపంగా కని పెంచుతున్న ఒకరిద్దరు పిల్లల్ని గురించి తప్ప మరేమీ ఆలోచించటం లేదే- అలాంటి పిల్లల గురించి ఎవరూ ఆలోచించట లేదనటం పొరపాటు కదా అనుకుంటున్నారా? తల్లిదండ్రులు తమ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తారు. దాని గురించి కాదు మేం మాట్లాడేది. ఒక సమాజంగా, పోనీ ఒక సమూహంగా పిల్లల హక్కుల గురించి, వారి బాల్యానందాల గురించి, వారు మోస్తున్న బరువుల గురించి, మరీ ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవటం చాలా తక్కువ. ప్రస్తుత పౌరుల గురించి పట్టించుకోటానికి తీరికలేని ప్రభుత్వాలు భావి పౌరుల గురించి నిర్లక్ష్యంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? వారికి ఓటుహక్కు కూడా లేదాయె-
కానీ అప్పుడప్పుడూ, ఏ బాలల దినోత్సవం రోజునో, ఐక్యరాజ్యసమితి పంపిన నివేదికలో, ఆదేశాలో, ఒప్పందాలో చూసినప్పుడో ప్రభుత్వానికి పిల్లలు గుర్తొస్తారు. ఏదో ఒక రూలు వాళ్ళ గురించి పాస్‌ చేసి చేతులు దులుపుకుని ''అబ్బా చివరికి పిల్లలు కూడా మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ పిల్లలు పాడుగాను'' అనుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. ఈ మధ్య ప్రభుత్వం నిద్రలేచి చేసిన ఒక ఆలోచన ఏమిటంటే, పాఠశాలల్లో గానీ పాఠశాలల పరిసర ప్రాంతాల్లోగాని చెత్త ఆహార పదార్థాన్ని (జంక్‌ఫుడ్‌ అని ముద్దుగా పిలుస్తారు ఇంగ్లీషులో) అమ్మకుండా నిషేధించాలని. పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టే పనికిమాలిన చిరుతిండ్లుగా ప్రభుత్వం కొన్ని పదార్థాల్ని బాగానే గుర్తించింది. చిప్స్‌, బాగా నూనెలో వేయించిన రకరకాల పదార్థాలు, కోకా కోలా వంటి పానీయాలు, చాక్లెట్లు, బర్గర్లు, సమోసాల వంటి వాటిని పాఠశాల లోపల నడిపే క్యాంటిన్లలో గానీ, పాఠశాలకు యాభై మీటర్ల దూరంలో ఉన్న దుకాణాలలోగాని అమ్మకూడదని ప్రభుత్వం చాలా స్పష్టంగానే చెప్పింది. పిల్లలు ఈ పిచ్చి తిళ్ళు తినకుండా ఆరోగ్యంవంతమైన ఆహారం తినేలా ప్రోత్సహించాలనీ, దానికి అన్ని పాఠశాలలకీ వర్తించే విద్యా పాలసీగా రూపొందించాలనీ ప్రభుత్వం అనుకుంటోంది. అనుకోవటం, చెప్పటం, కాగితాల మీద రాసి సంబంధిత శాఖలలకు పంపటం ఇవన్నీ చాలా తేలిక. ఎవరికి తెలియని విషయాలు గనుక కానీ అమలు చేయటం ఈ వ్యాపార ప్రపంచంలో ఎంత కష్టమో రోజూ టి.వి చూసే వారందరికీ తెలుసు. ఆరోగ్యం సంగతలా ఉంచండి. పేద పిల్లల కోసం పెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఎలా విఫలమైందో మనకు తెలుసు. ఇది ఆ పిల్లల కోసం కాదు.
యాభై సంవత్సరాల వయసు దాటిన వారందరికీ ఒక రుచికరమైన జ్ఞాపకం ఉంటుంది. స్కూల్ల్లో పొద్దున రీసెస్‌ బెల్‌ కొట్టగానే, మధ్యాహ్నం 'లంచ్‌బెల్లు' కొట్టగానే, సాయంత్ర 'ఇంటిబెల్లు' కొట్టగానే స్కూలు గేటు బైటకి పరిగెత్తేవాళ్ళం. అక్కడ బుట్టలో రకరకాల చిరుతిళ్ళు పెట్టుకుని ఒక ముసలమ్మో, ఒక ముసలయ్యో, లేదా చలాకీగా ఉండే కుర్రవాళ్ళో పిల్లల కోసం రెడీగా ఉండేవాళ్ళు వేరుశనక్కాయలు, జీడిలు, ఉప్పు శనగలు, నిమ్మతొనలు, బఠానీల వంటి పాటితోపాటు సీజన్‌ని బట్టి దొరికే జామకాయలు, తేగలు, ఉప్పు, కారం రాసిన మామిడికాయ ముక్కలు, ఉసిరి కాయలు - అబ్బా రాస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి- పిల్లలు ఆ బుట్టల చుట్టూ మూగి ఏదో ఒకటి కొనుక్కొని మళ్ళీ బెల్లు కొట్టే లోపల వాటిని నమిలేసి ఆ రుచితో రెట్టించిన ఉత్సాహంతో క్లాసులకు వెళ్ళే వాళ్ళు. కొనుక్కోటానికి డబ్బులేని వాళ్ళకు స్నేహితులు పిసరంత పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ దృశ్యాలు దాదాపు అదృశ్యమై పోయాయి. ఆ ముసలమ్మలు ఇప్పుడు దేవాలయాల ముందు అడుక్కోవటం తప్ప గత్యంతరం లేని పరిస్థితిలోకి నెట్టబడ్డారు. సరే వాళ్ళ సంగతి మనం ఆర్చగలిగేది, తీర్చగలిగేది కాదు. పిల్లల సంగతి ఆలోచిద్దాం.
ఇప్పుడు పిల్లల దగ్గర డబ్బులు దండిగానే ఉంటున్నాయి. చిరుతిళ్ళ కోసం ఆశపడకపోతే వాళ్ళు పిల్లలే కాదు. మరి ఇంత అందమైన, ఆకర్షణీయమైన, చురుకైన 'బాల్యం' అనే మార్కెట్‌ని చూస్తూ చూస్తూ మల్టీ నేషనల్‌ కంపెనీలు ఒదులుకుంటాయా? టి.విల్లో పూర్వం ఆడవాళ్ళ శరీరాలను ఆకర్షణీయంగా చూపి అమ్ముకునే వస్తువుల ప్రకటనలే ఉండేవి. ఇప్పుడు ప్రకటనల నిండా పిల్లలే. అది బట్టల సబ్బయినా, పియర్స్‌ సబ్బయినా, పిల్లలే కనపడి ముచ్చట గొలుపుతారు. ఇక చిప్స్‌, చాక్లెట్లు, నూడిల్స్‌ వంటి వాటి సంగతి చెప్పేదేముంది. అందమైన పిల్లలు వాటిని తింటుంటే, వారి ఆనందం చూస్తుంటే పెద్దల కడుపు నిండుతుంది. పిల్లల కోరిక పెరుగుతుంది. అర్జంట్‌గా చాక్లెట్ల ఆకలి, చిప్స్‌ ఆకలి, కోక్‌ దాహం కలిగి వాటిని తీర్చుకుంటారు. ఈ చిప్స్‌, ఇంకా అలాంటి పదార్థాల్లో ఎమ్‌ఎస్‌జి కలుపుతారు. దాంతో ఇక పిల్లలు ఆ రుచికి బానిసలవుతారు. పెద్దలూ మినహాయింపు కాదు. ఎమ్‌ఎస్‌జి ఎడక్టివ్‌- దాని రుచి మరిగితే ఒదిలించుకోవటం కష్టం. ఇట్లాంటి ఆహార పదార్థాలు విచ్చలవిడిగా మార్కెట్‌లోకి ఒదిలి, వాటిని ఇంత బాగా ప్రచారం చేస్తూ పిల్లలు వాటిని తినకూడదని, స్కూళ్ళలో అమ్మగూడదనీ నిషేధించటం కుదిరే పనేనా? అందరికీ సమానమైన, ఒకే విధమైన ప్రాథమిక విద్య గురించిన పాలసీనే లేదు. ఆరోగ్యకరమైన ఆహారం గురించి స్కూలు స్థాయిలో ఒక విద్యా పాలసీ ప్రవేశపెట్టటం సాధ్యమయ్యే పనేనా?
పిల్లలు బడి ఆవరణలో ఇడ్లీలు, దోశెలు కొనుక్కొని తింటారనుకోవటం అమాయకత్వం. వెర్రితనం. వాటిని ఇళ్ళల్లోనే తినటం లేదు. పైగా ప్యాకెట్లలో దొరికే వాటికి లేని ప్రమాదం వీటికి ఉంది. ఈగలు, దోమలు తదితర బాక్టీరియాలు తాకకుండా వీటిని పిల్లలకు సురక్షితంగా అందించగలిగిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఎన్ని పాఠశాలల్లో కనీసపు పారిశుధ్యానికి మనం హామీ ఇవ్వగలం? పిల్లలకేంటి, పెద్దలకేంటి అందరికీ అంగడి సరుకులంటే, నూనె సరుకులంటే మనసు లాగుతుంటుంది. వాటిని ఇళ్ళల్లో తయారు చేసుకునన్నా తింటాం. లేదా ఏ పెళ్ళిళ్ళల్లోనో తింటాం. పిల్లలు కాబట్టి బజార్లోవైనా సరే కొనుక్కుని తినాలనుకుంటారు. పెద్దలను విసిగించి కొనుక్కుతింటారు. ఆరోగ్యం పాడు చేసుకుంటారు. పెద్దలు ఆస్పత్రులు, మందులూ అంటూ మళ్ళీ ఇంకో కొత్త మార్కెట్‌కి బలిపశువులవుతారు.
దీనిని ప్రభుత్వ ఉత్తర్వులు ఆపలేవు. ప్రజలే, తల్లిదండ్రులే ఒక సమూహంగానో, సంఘంగానో ఏర్పడి సమస్య తీవ్రత గురించి ఆలోచించాలి. ఎంత తీవ్రమైన సమస్య కాకపోతే ప్రభుత్వం నామమాత్రంగానైనా దీని గురించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో పడుతుంది. పిల్లలు ఊబకాయంతో ఉండటం, చురుగ్గా లేకపోవటం, తరచు అనారోగ్యాల పాలవటం, చిన్నతనంలోనే మధుమేహం వంటి వ్యాధుల బారిన పడటం, పోషకాహార లోపంతో కంటి చూపు మందగించటం, పళ్ళు పుచ్చిపోవటం ఇంకా సవాలక్ష ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనం - ఔను మనమే కాపాడుకోవాలి. టి.విలలో కనపడే బొమ్మల్లాంటి అందమైన పిల్లల్ని మైమరచి చూసే అమ్మలూ, నాన్నలు, అమ్మమ్మలూ, తాతయ్యలూ ఆలోచించండి. ఆరోగ్యం ఒక హక్కు. మన పిల్లల ఆరోగ్య హక్కును హరించి వేస్తున్న వారి గురించైనా మనం పట్టించుకోమా? ఆదివాసీల భూముల్ని అక్రమ మైనింగుల కోసం లాక్కొంటున్న కంపెనీలు, రైతుల భూముల్ని సెజ్‌ల పేరుతో లాక్కొంటున్న కంపెనీలు - అవన్నీ చాలా పెద్ద విషయాలు, మనకు అనవసరమైన విషయాలు. మనవల్ల కాని విషయాలు. కానీ మనం బతికేదే మన పిల్లల కోసం గదా- ఆ పిల్లల ఆరోగ్యం గురించైనా పట్టించుకుందాం పట్టండి. ఏమో తీగ లాగితే డొంకంతా కదుల్తుందేమో

No comments:

Post a Comment