Monday 25 November 2013

సూర్య-చంద్రుల్లో ఏది పెద్దగా కనిపిస్తుంది?


    సూర్యుడు మన భూమి కన్నా మూడు లక్షల రెట్లకన్నా ఎక్కువ పెద్దగా ఉంటాడు. చంద్రుడితో పోలిస్తే సూర్యుడు మరెన్నో లక్షల రెట్లు పెద్దగా ఉంటాడు. ఆ లెక్కన - అంటే చంద్రుడికన్నా ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్న కారణంగా సూర్యబింబం చంద్రబింబంకన్నా ఎంతో ఎంతో పెద్దగా కన్పించాలి. కానీ వాస్తవంలో మాత్రం సూర్యబింబం, చంద్రబింబం - రెండూ ఒకే సైజులో కనిపిస్తాయి. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే...
మన భూమికి చంద్రుడికన్నా సూర్యుడు చాలా దూరంగా ఉన్నాడు. చంద్రుడు మన భూమికి సగటున 2,38,857 మైళ్ళ దూరంలో ఉంటే, సూర్యుడు 9.3 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అంటే మన భూమి నుంచి చంద్రుడికన్నా సూర్యుడు సుమారు 400 రెట్లు ఎక్కువ దూరంలో ఉన్నాడు. మరోపక్క చంద్రుడి వ్యాసం (2,160 మైళ్ళ) కన్నా సూర్యుడి వ్యాసం 400 రెట్లు ఎక్కువగా ఉంది. చంద్రుడికి సూర్యుడికి వ్యాసాల్లో ఉన్న వ్యత్యాసం ఎన్ని రెట్లు ఉందో, భూమి నుంచి చంద్రుడికి - సూర్యుడికి ఉన్న దూరాల్లో వ్యత్యాసం కూడా సరిగ్గా అంతే ఉండడంవల్ల మనకు చంద్రబింబం, సూర్యబింబం రెండూ ఒకే సైజులో కన్పిస్తాయి. భూమి నుంచి చూసినప్పుడు అవి రెండూ ఒకే సైజులో కన్పించడంవల్లనే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి నప్పుడు చంద్రబింబం సూర్యబింబాన్ని పూర్తిగా కప్పేయడం సాధ్యమవుతోంది. ఒకవేళ సూర్యబింబంకన్నా చంద్రబింబం చిన్నగా ఉండే పక్షంలో ఇలాంటిది సాధ్యం కాదు.
ఒకవేళ మన భూమి నుంచి సూర్యుడు మరి కొంచెం దూరంలో ఉన్నా, లేదా సూర్యుడి వ్యాసం ఇప్పుడున్న దానికన్నా ఒకటి-రెండు లక్షల మైళ్ళు తక్కువగా ఉన్నా అప్పుడు కచ్ఛితంగా చంద్రబింబంకన్నా సూర్యబింబం చిన్నగా కన్పించేది.
Courtesy with: Praja Sekthi 
 

No comments:

Post a Comment