Tuesday 22 October 2013

ఏసీలోకి దుమ్ము ఎలా వస్తుంది?


తలుపులన్నీ మూసి ఉన్నా, గదిలో వాడుతున్న ఎ/సి (ఎయిర్‌ కండిషర్‌) ఫిల్టర్‌కి తరచూ ఎక్కువ దుమ్ము చేరుతూ ఉంటుంది. అది ఎక్కడ నుండి వస్తుంది? గదిని ఎంత నీట్‌గా ఉంచినా అది చేరుతూ ఉంటుంది. ఎందుకని?
- వి.సదాశివమూర్తి, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా
తలుపులన్నీ మూసి ఉన్నా దుమ్ము, ధూళి కణాలు గది లోపలికి చేరలేకపోయేంతగా మూయలేము. నేలకు, తలుపులకు మధ్య ఉన్న సందుల్లోంచి, కిటికీ తలుపులకు, కిటికీ ఫ్రేములకు మధ్య ఉన్న సందుల్లోంచి ఎంతో కొంత దుమ్ము, ధూళి చేరుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం రోజుకు అరడజను సార్లయినా గది తలుపుల్ని తీయకుండా ఉండలేము. మనం బయట నుంచి లోనికి వచ్చేప్పుడు, లోపల్నుంచి బయటికి వెళ్లేప్పుడు తలుపులు తెరుస్తూ, మూస్తూ ఉంటాము. ఆ సమయంలో కొంత దుమ్ము చేరుతుంది. అంతేకాదు మనం మన వృత్తి నుంచి ఇంటికి చేరుకున్నప్పుడు మన బట్టల మీద కూడా అంతో ఇంతో దుమ్ము పేరుకుంటుంది. అలాగే గదిలోకి వెళ్లేప్పుడు ఎసి గాలి విసుర్ల (air currents) లో ఆ దుమ్ము కొద్దిగా గాల్లో కలుస్తుంది. ఇలా ఎన్నో మార్గాల్లో గదిలో దుమ్ము, ధూళి కణాలు చేరతాయి. ఎసి మిషన్‌ ఓ ఆంతరంగిక వాయు చోదక శీతలీకరణ యంత్రం (closed refrigeration air blowing system). గదిలోని గాలిని చల్లని గ్రిడ్‌ గుండా పదే పదే పంపుతూ గదిలోని గాలిని చల్లబరిచే పద్ధతి ఇక్కడ ఉంటుంది. అందుకే గ్రిడ్‌ సందులు దుమ్ము కణాలతో మూసుకుపోకుండా ఆ గ్రిడ్‌కు ముందుగా దుమ్మును ఫిల్టర్‌ జల్లెడ పడుతుంది. నెలకోమారో, రెండుమార్లో ఆ ఫిల్టర్‌ను నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. విద్యుత్‌ ఆదా కావాలంటే సాధ్యమైనంత మేరకు సందులు లేకుండా కిటికీలను, తలుపుల్ని వాడాలి. ఎక్కువసార్లు తలుపులు తెరవకూడదు. తలుపులు, కిటికీలు తెరచి ఉంచి ఎసి మెషిన్లను వాడడం మరింత దుబారాతనం, అవాంఛనీయం.
గమనిక:
మీ సైన్స్‌ సందేహాలను జీవన, ఎందుకని? ఇందుకని? శీర్షిక, ప్రజాశక్తి తెలుగు దినపత్రిక, ఎం.హెచ్‌ భవన్‌, అజామాబాద్‌ ఇండిస్టియల్‌ ఏరియా, ఆర్‌.టి.సి కల్యాణమండపం లేన్‌, హైదరాబాద్‌-500 020 అన్న చిరునామాకు పంపగలరు.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక 

Courtesy with:  PRAJA SEKTHI DAILY 

No comments:

Post a Comment