Wednesday 10 July 2013

వానాకాలపు ఆరోగ్యం

 
 
               వర్షాకాలం మొదలైంది. దీని వల్ల పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత బాగా తగ్గాయి. అయితే, వానలతో పాటు అనుకోకుండా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని రావడం సహజం. ఋతుపవనాలతో వచ్చిపడ్డ ఈ అనారోగ్యాలు ఎవరికైనా ఇబ్బందికరమే. అలాంటి ఆరోగ్య సమస్యలు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
సర్వసాధారణంగా వర్షాలతో పాటు వైరల్‌ జర్వాలు, జలుబు, మలేరియా, టైఫాయిడ్‌, హెపటైటిస్‌ ఏ, లెప్టోస్పైరోసిస్‌, డయేరియా, చికున్‌గున్యా లాంటివి వస్తుంటాయి.
జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరం
వర్షాకాలంలో తేమ వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ పరిస్థితుల్లో జలుబు రావడం సర్వసాధారణం. తడిసిన దుస్తుల్లో ఎక్కువ సేపు ఉండడం వల్ల, ఎయిర్‌ కండిషనర్ల నుంచి వచ్చే తేమ గాలిలోనే చాలా సేపు ఉండడం వల్ల జలుబు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
ఇలా చేయండి:
- ఆఫీసుకు వెళుతూ మధ్యలో వర్షం పడితే, తడిసిపోయే ప్రమాదం ఉంది గనక, ఎందుకైనా మంచిదని ఆఫీసు సొరుగులో విడిగా ఓ జత దుస్తులు దాచి పెట్టుకోండి.
- ఏ.సి.లు కట్టిపెట్టి, కిటికీలు తీసి పెట్టండి.
- సర్వసాధారణంగా ఒకరి నుంచి మరొకరికి జలుబు వ్యాపిస్తుంది. కాబట్టి, తరచుగా చేతులు కడుక్కోండి. జలుబు చేసిన వాళ్ళకు కాస్తంత దూరంగా ఉండండి.
- తాజా కాయగూరలు, పండ్లు తినడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోండి.
మలేరియా
వర్షాకాలంలో సాధారణంగా వచ్చే అనారోగ్యాల్లో మలేరియా ఒకటి. మురికి నీళ్ళలో కొన్ని రకాలైన దోమలు పెరుగుతాయి కాబట్టి, వాటి నుంచి మలేరియా వస్తుంది. మలేరియా వచ్చినప్పుడు జ్వరం, ఒళ్ళు నొప్పులు, చలి, చెమట పట్టడం లాంటి లక్షణాలు ఉంటాయి. మలేరియాను గనక అశ్రద్ధ చేస్తే అది కామెర్లు, తీవ్ర రక్తహీనత, చివరకు కాలేయం, మూత్ర పిండాల వైఫల్యానికి కూడా దారి తీయవచ్చు.
ఇలా చేయండి:
- నిల్వ ఉన్న నీళ్ళు దోమలు వృద్ధి చెందడానికి అనువైనవి. కాబట్టి, మీ చుట్టుపక్కల ఎక్కడా నీళ్ళు నిల్వ ఉండకుండా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- మీరు గనక ఇంట్లో బకెట్లలో నీళ్ళు గనక నిల్వ చేసుకోవాల్సి ఉంటే, వాటిపైన తప్పనిసరిగా మూతలు పెట్టుకోండి. అలాగే, మీ ఇంటి కిటికీలకు దోమ తెరలు, ఫైబర్‌ గ్లాస్‌ మెష్‌లు,కీటకాలను పారదోలే అయస్కాంతపు తెరల లాంటివి అమర్చుకోవాలి. ఒంటికి దోమల మందు రాసుకోవాలి.
టైఫాయిడ్‌:
అయిదు రోజులకు మించి విడవకుండా జ్వరం ఉన్నా, దానితో పాటు తలనొప్పి, డయేరియా, పొత్తికడుపులో నొప్పి లాంటివి కూడా తోడై, రెండో వారానికల్లా ఒంటిపై దద్దుర్లు వచ్చినా అది టైఫాయిడ్‌ లక్షణమని గుర్తించాలి. కలుషితమైన ఆహారం, నీళ్ళ ద్వారా టైఫాయిడ్‌ వస్తుంది. టైఫాయిడ్‌ రాకుండా ఉండాలంటే, వీలైనంత వరకు బయటి తిండ్లు తినకూడదు. అలాగే, ఇప్పుడు టైఫాయిడ్‌ టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
హెపటైటిస్‌-ఏ
ఈ వైరల్‌ వ్యాధి కూడా కలుషిత ఆహారం, నీళ్ళ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆకలి మందగించడం, కడుపంతా వికారంగా ఉండడం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయి. కళ్ళు పసుపుపచ్చగా తయా రవుతాయి. అలాగే, చర్మం, గోళ్ళు కూడా పచ్చ బడతాయి. హెపటైటిస్‌-ఏ రాకుండా ఉండాలంటే, ఇంటి పట్టునే భోజనం చేయడం, మంచి నీళ్ళు తాగడం లాంటివి తప్పనిసరిగా పాటించాలి.
లెప్టోస్పైరోసిస్‌
మురికి నీళ్ళలో నడవడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఎక్కువ. అలా వచ్చే అనారోగ్యాల్లో 'లెప్టోస్పైరోసిస్‌'. ముఖ్యంగా చర్మానికి గనక గాయాలు అయ్యుంటే, థఈ వ్యాధి సోకే అవకాశాలు హెచ్చు. బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఈ వ్యాధి ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తీవ్రమైన జ్వరం, చలి, విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కడుపులో వికారం, వాంతులు, డయేరియా, పొత్తి కడుపులో నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే, మురికి నీళ్ళలో కాళ్ళు పెట్టకపోవడమే మార్గం. అలాగే, బయట నుంచి ఇంటికి చేరగానే స్నానం చేయాలి. ఒంటి మీద ఏమైనా గాయాలు ఉంటే, బయటకు వెళ్ళినప్పుడు వాటిని కప్పుకొని వెళ్ళడం మంచిది.
డయేరియా
బ్యాక్టీరియా, పరాన్నజీవుల ఫలితంగా ఆహారం కలుషితమై, డయేరియా పాలబడితే, సాధారణంగా 'ఫుడ్‌ పాయిజనింగ్‌' అంటారు. ఇలా విరేచనాలు అవుతూ, ఇబ్బందికరంగా మారినప్పుడు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ద్రవాహారానికి కట్టుబడాలి. డయేరియాతో పాటు వాంతులు వచ్చేలా ఉంటే, కొద్దిపాటి ద్రవాహారాన్ని కొద్ది కొద్దిగా తరచూ తీసుకోవాలి. కడుపులో పోట్లు రాకుండా చూసుకోవడం కోసం ఘనాహారాన్ని తరువాత క్రమంగా తీసుకోవాలి.
చికున్‌గున్యా జ్వరం
ఇది కూడా వైరస్‌ ద్వారానే వస్తుంది. 'ఈడెస్‌ ఈజిప్టి' అనే దోమ కాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ దోమ పగటి పూటే కుడుతుంది. ఈ దోమకాటు వల్ల తీవ్రంగా కీళ్ళ నొప్పులు, జ్వరం, దద్దుర్లు వస్తాయి. కొన్నిసార్లు కీళ్ళనొప్పులు అలా ఉండిపోతాయి. సమస్య ఏమిటంటే, చికున్‌గున్యాకు ప్రత్యేకమైన యాంటీ వైరల్‌ ఔషధాలు కానీ, టీకాలు కానీ లేవు. కాబట్టి, ఈ అనారోగ్యాన్ని ఎంత తొందరగా కనిపెట్టి, సరైన చికిత్స తీసుకుంటే, అంత తొందరగా ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించవచ్చు. చికున్‌గున్యా జ్వరం బారినపడ్డ వారికి వారి వారి లక్షణాలను బట్టి చికిత్స చేయడమే మార్గం.

Courtesy With: Praja Sekthi 

No comments:

Post a Comment