Thursday 13 December 2012

అలర్జీలు... అవగాహన...

అలర్జీ వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. ప్రపంచ జనాభాలో 30-40 శాతం దీని బారినపడుతున్నారు. పెద్దల కంటే పిల్లల్లో ఇది ఎక్కువగా వస్తుంది. దీనికి సరైన చికిత్స లేదు. కనిపించే చిహ్నాల ఆధారంగా ఉపశమనం చేయబడుతుంది. పర్యావరణం, వాతావరణ కాలుష్యం, ఆహారంలో వస్తున్న మార్పులు అలర్జీలను పెంచుతున్నాయి. మందుల అలర్జీలు కూడా పెరుగుతున్నాయి. అలర్జీల వల్ల ప్రాణాపాయం లేనప్పటికీ, సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో కష్టాలు, నష్టాలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారిలో వృత్తిపరమైన అలర్జీలతో రోగాలు, నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ప్రపంచ అలర్జీ సంస్థ' 2011లో అలర్జీలపై సమగ్ర సమాచారంతో ఒక నివేదికను తీసుకొచ్చింది. 'ప్రపంచ అలర్జీ సంస్థ' ప్రత్యేక సమావేశాలు హైదరాబాద్‌లో ఈ నెల మొదటివారంలో జరిగాయి. అలర్జీలపై అవగాహన కలిగించుకుంటే వీటి నుండి రక్షించుకోవడానికి వీలవుతుంది. దీనికోసం బాధితుల, బాధిత కుటుంబసభ్యుల, వైద్యుల సమన్వయ పాత్ర ఎంతో అవసరం. వీటికి సంబంధించిన సమాచారాన్ని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
సహజంగా రోగ కారక క్రిములు లేదా హాని కలిగించగల మాంసకృత్తుల అణువులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు శరీర రక్షణ వ్యవస్థ 'ప్రతిరక్షక కణాల (యాంటీబాడీస్‌)' ను ఉత్పత్తి చేసి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ, కొన్ని సందర్భాలలో ఏ రోగ కారక క్రిములు లేదా హాని కలిగించగల మాంసకృత్తుల అణువులు శరీరంలో ప్రవేశించకపోయినా శరీర రక్షణ వ్యవస్థ చురుకుగా మారి, ప్రతిరక్షక కణాలను ఉత్పత్తి చేస్తుంది. దీనితో సహజంగా వుండే రోగ నిరోధకవ్యవస్థ చురుకుగా సహించలేని స్థాయికి మారుతుంది. ఈ స్థితిని అలర్జీగా భావిస్తున్నాం. మరోమాటలో చెప్పాలంటే మన శరీర రక్షణ వ్యవస్థ (దీనిలో తెల్ల రక్తకణాలకు ప్రధానపాత్ర వుంది.) హాని కలిగించగల బయట పదార్థాల నుండి తప్పు సంకేతాల్ని పొందుతూ, అవసరం లేకున్నా ప్రతిరక్షక కణాలను ఉత్పత్తి చేసి, సహించలేని స్థాయికి వెళుతుంది.
అలర్జిన్ల ప్రభావం అందరిలో, అన్ని సమయాల్లో ఒకేవిధంగా వుండదు. ఇది కొద్ది అసహనం నుండి సహించలేని స్థాయిలో వుంటూ మన జీవన విధానాన్నే పరిమితంచేయొచ్చు. అయితే, దీనివల్ల ప్రాణహాని కలగకపోవచ్చు. కానీ, అలర్జీ ఒక పరిధిని దాటినప్పుడు మరణం కూడా సంభవించవచ్చు. అలర్జీకి శాశ్వత చికిత్స లేదు. కానీ, దుష్ప్రభావాల నుండి ఉపశమనం కల్పించవచ్చు.
అలర్జీని కంటితో ప్రతి చిహ్నాల ద్వారా (రెస్పాన్స్‌ సిమ్‌టమ్స్‌) గుర్తించవచ్చు. లేక 'ఇమ్యునోగ్లోబిన్‌ ఇ' పరీక్ష ద్వారా నిర్ధారించుకోవచ్చు. 'ఇమ్యునోగ్లోబిన్‌-ఇ' పరిమాణం అలర్జీ తీవ్రతను సూచిస్తుంది.
ప్రభావ చిహ్నాలు..
మామూలుగా శ్వాసకోశం ప్రభావితం కావచ్చు. ఫలితంగా, ముక్కు నుండి నీరు కారొచ్చు (రైనైటిస్‌). దగ్గు, తుమ్ములు రావొచ్చు. కళ్లు ఎర్రబడి, నీరు కారవచ్చు. అలర్జీ పదార్థాలను తీసుకున్నప్పుడు ఉబ్బసం చిహ్నాలు కనిపిస్తాయి. ఈ సమయంలో శ్వాస నాళాలు సంకోచిస్తాయి. ఊపిరితిత్తుల్లో చీము ఏర్పడుతుంది. ఫలితంగా, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మామూలు కన్నా వేగంగా, బలంగా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో పిల్లి కూతలు కూడా వినిపించవచ్చు.
'సైనస్‌' వల్ల ముక్కులో ద్రవపదార్థం ఏర్పడి, కారుతుంది. తల భారంగా మారుతుంది. నుదురు ఉబ్బి, నొప్పి, శ్వాసపరమైన ఇబ్బంది కలుగుతుంది. కళ్లకలక వచ్చినప్పుడు (కళ్లు కలిగినప్పుడు) కళ్లు ఎర్రగా మారి, మండుతూ, దురదతో, నీరు కారుతూ, పుసులు కడతాయి. అలర్జీతో చెవులు మూసుకుపోయి వినపడకపోవచ్చు. చర్మం మీద దద్దుర్లు, కురుపులు, తామర, గజ్జి రావచ్చు. జీర్ణకోశం ప్రభావిత మైనప్పుడు కడుపులో నొప్పి, ఉబ్బటం, వాంతులు, నీళ్ల విరోచనాలు అవుతాయి.
కారణాలు..
అలర్జీ కారణాలు వ్యక్తిగతమైనవి లేదా బహిర్గతమైనవి కావచ్చు. ఇవి కొంతమేరకే వంశపారంపర్యంగా ఉంటూ, లింగ, ప్రాంత, వయస్సును బట్టి రావచ్చు. ఎక్కువ అలర్జీలు పర్యావరణ ప్రభావంతోనే వస్తాయి.
- దుమ్మూ ధూళి, గాలిలో అధిక తేమ, అల్మరాల్లో, గది మూలల్లో చేరే పురుగుల (మైట్స్‌) దుమ్ము, కందిరీగలు, చీమలు, తేనెటీగలు కుట్టినప్పుడు శరీరంలో ప్రవేశించే విషం వల్ల.
- ఇన్ఫెక్షన్‌ వాతావరణంలో వున్నప్పుడు.
- బాల్యంలో వచ్చిన జబ్బులు.
- పర్యావరణ కాలుష్యం.
- అలర్జీ కలిగించే పదార్థాలు తీసుకున్నప్పుడు లేక అవి మన శరీరాన్ని ప్రభావితం (ఎక్స్‌పోజ్‌) చేసినప్పుడు.
- ఆహార మార్పులు జరిగినప్పుడు.
శరీరానికి సరిపడని ఏ పదార్థాన్ని తిన్నా అలర్జీ వస్తుంది. ముఖ్యంగా వేరుశనగ, గుడ్లు, పాలు కొందరికి సరిపడవు. మరికొందరికి చేపలు, కొన్నిరకాల పండ్లు, కొన్ని రంగులు సరిపడకపోవచ్చు. ఆహారోత్పత్తుల శుద్ధి క్రమంలో వినియోగించే రసాయనాలు అలర్జీల్ని కలిగించవచ్చు.
ఆహారేతర పదార్థాలు - రబ్బరుకు సంబంధించిన వస్తువులు స్వతంత్రంగాగానీ, వేరే పదార్థాలతో కలిసినప్పుడుగానీ అలర్జీ కలుగుతుంది.
చికిత్స..
చికిత్సలో అలర్జీ కారకాన్ని గుర్తించడమే కీలకం. మారుతున్న అంశాల్ని గమనంలో వుంచుకుని, బాధితులే స్వయంగాగానీ లేక వైద్యుని సహాయంతో దీనిని గుర్తించవచ్చు. ఇలా గుర్తించిన తర్వాత దాన్ని పూర్తిగా మానుకోవాలి లేదా తప్పించుకోవాలి. అలర్జీని ఎదుర్కోడానికి ఇదే అత్యుత్తమ మార్గం. ఇది వీలుకానప్పుడు చిహ్నాలను బట్టి వైద్యుని సలహా మేరకు మందుల్ని వాడాలి.
రోగ నిరోధక చికిత్సా పద్ధతి (ఇమ్యునో థెరిపీ)..
అలర్జీ తీవ్రంగా వున్నప్పుడు లేక ఇతరత్రా ఎదుర్కోలేనప్పుడు రోగ నిరోధక చికిత్సా పద్ధతి ని అవలంబిస్తున్నారు. మన దేశంలో ఇప్పుడి ప్పుడే ఈ పద్ధతి ప్రాచుర్యం పొందుతుంది. ఈ చికిత్సలో అలర్జీ కారక పదార్థం కలిగి వున్న ద్రవాన్ని (ఎక్స్‌ట్రాక్ట్‌) ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. నోటితో తీసుకునే మందులు కూడా ఇటీవల తయారవుతున్నాయి. దీని డోసును క్రమంగా పెంచుతూ, దఫ దఫాలుగా ఇస్తారు. దీనివల్ల ఇమ్యూనోగ్లోబిన్‌-జి ఉత్పత్తి అయి, ఆమేర అలర్జీల నుండి రక్షిస్తుంది. ఈ చికిత్స వల్ల దీర్ఘకాల ఉపశమనం కలుగుతుంది.

మన దేశంలో..
- ప్రపంచ అలర్జీ నివే దిక (2011) ప్రకారం మన దేశంలో ఉబ్బసం, ముక్కు కారడం 1964లో వరుసగా 1%, 10%గా వుండేవి. కానీ, ఇటీవల కాలంలో ఉబ్బసం 3%-14 శాతానికి, ముక్కు కారడం 20 శాతానికి పెరిగింది. ఒకటి లేక అంతకన్నా ఎక్కువ అలర్జీలతో బాధపడుతున్నవారు మొత్తం జనాభాలో 20-30% మేర వున్నారు.
- తుమ్మ, ఆముదం, వయ్యారిభామ (పార్థీని యం) జొన్న, తోటకూర తదితర చెట్ల పుప్పొడి కాలుష్యం వల్ల అలర్జీలు వస్తున్నాయి.
- బొద్దింకలు, కందిరీగలు, తేనెటీగలు అలర్జీ కారకాలుగా గుర్తించారు.
- వంటచెరుకుగా కట్టెల్ని వాడటం వల్ల వచ్చే పొగ అలర్జీ కలిగిస్తుంది.
- విస్తరిస్తున్న పరిశ్రమల వల్ల గాలిలో చేరే సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌ వల్ల అలర్జీలు వస్తున్నాయని గుర్తించింది.
- దేశంలో 300 మంది అలర్జీ నిపుణులు అదీ పట్టణ ప్రాంతాల్లోనే వున్నారు.
- నిపుణులనుపెంచడానికి అలర్జీని పాఠ్యాంశంగా చేర్చాలని ఈ నివేదిక సూచించింది.
వృత్తిపరమైనవి..
- భవన నిర్మాణ కార్మికుల్లో సిమెంట్‌ (క్రోమియం, కోబాల్ట్‌) రబ్బరు, చెక్క సంబంధితమైనవి, దుమ్మూ, ధూళి వల్ల అలర్జీలు వస్తాయి.
- గని కార్మికుల్లో దుమ్మూ, ధూళీ, కార్బన్‌ మోనాక్సైడ్‌, తేమ వల్ల శ్వాసకోశ సంబంధ అలర్జీలు ఎక్కువగా వస్తాయి.
- వంటచేసేవాళ్లలో కూరగాయలు, పండ్ల వల్ల వస్తాయి. కట్టర్స్‌, రబ్బరు చేతి తొడుగుల వల్ల, మసాలాలవల్ల వస్తాయి.
- క్షౌరవృత్తిదారులకు హెయిర్‌ డై (రంగు), రబ్బరు, వాసన, మెటల్‌ వల్ల వస్తే, రజక వృత్తిదారుల్లో సబ్బులు, సర్ఫ్‌ల వల్ల అలర్జీలు వస్తాయి.
- వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రంగులు, రసాయనాల వల్ల అలర్జీలు వస్తాయి.
- సేద్యం చేసేవారికి అధికతేమ, ఎరువులు, సస్యరక్షణ మందులు, రబ్బరు తదితరాల వల్ల అలర్జీలు కలుగుతాయి.
ప్రమాదాంశాలు..
'ప్రపంచ అలర్జీ సంస్థ' అలర్జీ ప్రమాదాల్ని పెంచే అంశాల్ని సవివరంగా గుర్తించింది. సమగ్ర సమాచార పుస్తకాన్ని 2011లో ప్రచురించింది. ఇది నిర్ధారిస్తున్న తీవ్ర ప్రమాదాంశాలు..
- జన్యువులు, పర్యావరణ అంశాల సంయుక్త ప్రభావాలు అలర్జీల్లో ముఖ్యభాగం.
- స్పందించే ఇమ్యునోగ్లోబిన్‌-ఇ ప్రతిరక్షక కణాలు దాదాపు 40 శాతం జనాభాలో వున్నాయని అంచనా.
- వీచే గాలిలో పుప్పొడి కణాలు, బూజు (ఫంగస్‌), మైట్‌ ధూళికణాలు, బొద్దింకలు, తదితర కీటకాలతో అలర్జీ నేరుగా సంబంధం కలిగి వుంటుంది.
- ఉబ్బసం, కళ్లు ఎర్రబడి, ముక్కు నుండి నీరుకారడం, ముక్కు దిబ్బడ, చర్మంపై దద్దుర్లు వ్యాధులకూ అలర్జీ కారకాలకూ దగ్గర సంబంధం వుంది. కాలుష్య ప్రభావం ఈ అలర్జీల్ని మరింత పెంచుతుంది.
- ఇంటా, బయటా వున్న కాలుష్యం శ్వాసకోశ సంబంధమైన అలర్జీల్ని, ఆస్తమా (ఉబ్బసం) ను కలిగిస్తాయి.
- కారకాలను గుర్తించి, దాన్నుండి తప్పించుకుంటే అలర్జీల నుండి రక్షణ పొందవచ్చు.
- అలర్జీ బాధితులకు, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అవినాభావ సంబంధం వుంది. పేద ప్రజలు, పరిసరాల పరిశుభ్రంగా లేని ప్రాంతాల్లో నివసించే వారిలో ఉబ్బసం సంబంధిత అలర్జీ వ్యాధులు ఎక్కువగా వుంటాయి.
- వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం రెండూ కలిస్తే అలర్జీ బాగా పెరుగుతుంది.
- వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల పెద్ద వారు శ్వాస సంబంధ అలర్జీల్ని ఎదుర్కొం టారు. ఒకోసారి వీరు అకస్మాత్తుగా మరణించవచ్చు.
- ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ, ఉరుములు, మెరుపులు వంటి వాతావరణాంశాలు అలర్జీకి దోహదపడే జీవ రసాయనిక మార్పుల్ని ప్రభావితం చేస్తాయి.
- దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సూచనల్ని తప్పకుండా ఇవ్వాలి.
బిటి వల్ల..
జన్యుమార్పిడి సాంకేతికంలో డిఎన్‌ఏ ప్రొటీన్‌ అణువుల మార్పు ప్రధానాంశం. జన్యు మార్పిడి ఆహారాన్ని (ఉదా:బిటి రకం) తిన్నప్పుడు కొత్త ప్రొటీన్‌ లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా అలర్జీలు రాగల ప్రమాదం ఎక్కువగా వుందని ఎలుకల్లో చేసిన ప్రయోగాల్లో నిర్ధారించబడింది.
బిటి పత్తి చేలల్లో పనిచేసే వ్యవసాయ కార్మికులు అలర్జీలకు గురయ్యారు. వీరికి దురద, దద్దుర్లు, పుండ్లు, శ్వాసకోశ సంబంధ అలర్జీలొచ్చాయి. బిటి పత్తి ఆకుల్ని తిన్న పశువులు పారుడు రోగానికి గురయ్యాయి. కొన్ని చనిపోయాయి.

మీకు తెలుసా..?
- అలర్జీలంటే అసహనీయ (సహించ లేని) స్థాయిలోని రోగ నిరోధక వ్యవస్థ వల్ల కలిగే స్థితి.
- అలర్జన్‌ లేక అలర్జిన్‌ : అలర్జీ కలిగించే పదార్థం.
- ఇమ్యునోగ్లోబిన్‌-ఇ : ఇవి ఒక రకమైన అసహనీయ నిరోధకశక్తి రూపొందించుకున్న మస్ట్‌, బాసో ఫిిల్స్‌ తెల్లరక్త కణాలు. వీటి పరిమాణం అలర్జీ తీవ్రతకు చిహ్నం.
- ఇమ్యునోగ్లోబిన్‌-జి : ఇవి మరొక రకమైన ఇమ్యునోగ్లోబిన్‌ ప్రతిరక్షక కణాలు. వీటి ఉత్పత్తి, పరిమాణం 'ఇమ్యునోగ్లోబిన్‌-ఇ' ద్వారా కలిగే అలర్జీని నియంత్రిస్తుంది.

No comments:

Post a Comment