Wednesday 5 December 2012

క్యాన్సర్‌ సవాళ్లు.. పరిష్కారాలు

 
 
       అంటుకున్నా వ్యాపించని రోగాల మరణాలు పెరుగుతున్నాయి. మనదేశంలో సగంపైగా మరణాలు వీటివల్లే కలుగుతున్నాయి. క్యాన్సర్‌, గుండెజబ్బు, మధుమేహం, శ్వాసకు సంబంధించిన వ్యాధులు, మానసిక రోగాలు, గాయాలు ఈ కోవ కిందకొస్తాయి. గాయాలు తప్ప మిగతావి దీర్ఘకాల స్వభావం కలవి. వీటి చికిత్స, యాజమాన్యంలో మందుల అవసరం, ఖర్చు ఎక్కువ. ఇవన్నీ మన జీవనశైలితో ముడిపడి వున్నాయి. అన్ని వయస్సులవారికీ ఇవి వస్తున్నాయి. వీటి బాధితులు రోజురోజుకూ పెరుగుతుండటంతో వీటి నివారణ, గుర్తింపు, చికిత్సలపై కేంద్రీకరణ పెరుగుతుంది. వీటిలో క్యాన్సర్‌ ముఖ్యమైంది. మొత్తం మరణాల్లో దీనివల్ల 20 శాతం మేర వుంటున్నాయి. వీటి చికిత్సకు నిపుణులు, ఆధునిక పరికరాలు అవసరం. శాస్త్రీయపరంగా చూస్తే, వీటి గుర్తింపు, చికిత్స పరిశోధనల్లో ఎంతో ప్రగతి సాధించబడింది. అయితే, ఈ ఫలితాలు అవసరమైన వారందరికీ అందవలసి వుంది. వీటిపై అవగాహన పెంచుకుంటే క్యాన్సర్‌ను నివారించి, జీవనాణ్యతను పెంచుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో, క్యాన్సర్‌ గుర్తింపు, నివారణ, చికిత్సలో అభివృద్ధిని సంక్షిప్తంగా తెలుపుతూ మీముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.

నియంత్రణలేని జీవకణ పునరుత్పత్తి, పెరుగుదల క్యాన్సర్‌కు ప్రధానకారణం. ఇలా ఎందుకవుతుందో ఈనాటికీ సరిగ్గా అర్థం కాలేదు. కానీ, జీవకణాల్లో జరిగే జన్యుమార్పులు (డిఎన్‌ఏ మార్పులు) వీటికి అంతిమకారణాలు. అయితే, వారసత్వంగా వచ్చే క్యాన్సర్‌లు 5 నుండి 10 శాతం మాత్రమే. మిగతా క్యాన్సర్‌లు 90-95 శాతం ఇతర కారణాలవల్ల వస్తున్నాయి. జన్యుకారణం కానివన్నీ పర్యావరణ ప్రభావం వల్ల వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఆహారం, ఊబకాయం వల్ల 30-35 శాతం, అంటురోగక్రిముల వల్ల 15-20 శాతం, రేడియోథార్మిక కిరణాల వల్ల 10 శాతం వరకూ క్యాన్సర్‌ వచ్చే అవకాశం వుంది. పొగాకు తాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. గనుల్లో ముఖ్యంగా బొగ్గు, ఖనిజ తవ్వకాల్లో పనిచేసేవారికి అక్కడి కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తుంది. శుద్ధిచేసిన ఆహారం (ప్రాసెస్డ్‌ ఫుడ్‌) తినడం వల్ల కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

ప్రారంభం..
భౌతిక శ్రమ లేకపోవడం, పర్యావరణ కాలుష్యం వల్ల జీవకణ డిఎన్‌ఏలో మార్పులు వస్తాయి. ఈ డిఎన్‌ఏ మార్పులవల్ల జీవకణ విభజన వేగం పెరుగుతుంది. ఏదో ఒక భాగంలో ఏదో ఒక జీవకణం ఇలా ప్రభావితమై అతివేగంగా పునర్విభజనకు గురై, పెరుగుతుంది. ఈ కణాలు ఇతర కణాల జన్యువులతో కలిసి వాటిని నష్టపర్చవచ్చు లేక అప్పటికే వున్న లోపాలుగల జన్యువులతో కలిసిపోవచ్చు. ఇలా మొదలైన క్యాన్సర్‌ క్రమంగా శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లి, స్థిరపడి అక్కడ క్యాన్సర్‌ను కలిగించవచ్చు.

క్యాన్సర్‌ కారణాలు నిర్దిష్టంగా తెలియవు. కానీ, పొగాకు వినియోగం (దీనిలో వున్న కొన్ని అమైనోఆసిడ్స్‌, నికోటిన్‌, ఇతర రసాయనాలు), రేడియోథార్మిక కిరణాల ప్రభావం, భౌతిక శ్రమ లేకపోవడం, ఊబకాయం, వాతావరణ కాలుష్యం క్యాన్సర్‌ రిస్క్‌ను పెంచుతాయి.
క్యాన్సర్‌లన్నీ ఒకటే కావు. దాదాపు 200ల రకాలు గుర్తించబడ్డాయి. శరీరంలోని ఏ భాగంలోనైనా ఇది రావచ్చు. ఫలితంగా, దీని రోగ లక్షణాలు క్యాన్సర్‌ వచ్చిన శరీరభాగం మీద ఆధారపడి వుంటాయి.

క్యాన్సర్‌ మొదట నెమ్మదిగా ప్రారంభమైనా, ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. అందువల్ల, రోగ లక్షణాలు గుర్తించే స్థాయిలో బయటపడేటప్పటికే రోగం అభివృద్ధి చెందిన దశలో వుంటుంది. అయితే, దీని గుర్తింపుకు ఆధునిక పరీక్షాపద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా స్క్రీనింగ్‌ టెస్ట్‌, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, మెడికల్‌ ఇమేజింగ్‌ (ఎంఆర్‌ఐ వంటివి) తదితరాలు క్యాన్సర్‌ గుర్తింపుకు తోడ్పడుతున్నాయి. ఒకసారి క్యాన్సర్‌ వుందని అనుమానించిన తర్వాత బయాప్సీ పరీక్ష ద్వారా మైక్రోస్కోపులో పరీక్షించి, రోగాన్ని నిర్ధారిస్తారు.

పిలకలు (మెటాస్టాసిస్‌)...
క్యాన్సర్‌ ఇతర శరీరభాగాలకు విస్తరించినప్పుడు ఇవి వస్తాయి. వీటిని 'సెకండరీస్‌' అని కూడా అంటారు. ఇవి కనపడితే వ్యాధి ముదిరినట్లు భావించాలి. క్యాన్సర్‌లో శోషరస నాళ వ్యవస్థ (లింఫ్‌సిస్టమ్‌) లో నోడ్స్‌ ఉబ్బి, శరీర పైభాగంలో కనిపిస్తాయి. కాలేయం, పిత్తాశయం పెరగడాన్ని పొట్టలో గుర్తిస్తారు. నొప్పి, ఎముకలు విరగడం, నరాల జబ్బు రూపంలో బయటపడుతుంది.

జాతీయస్థాయిలో..
జాతీయ క్యాన్సర్‌ నియంత్రణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూ. 731 కోట్ల ఖర్చుతో జూన్‌ 2010 నుండి ప్రారంభించింది. దీనికింద 13 మెడికల్‌ కాలేజీలతో సహా 27 ప్రాంతీయ క్యాన్సర్‌ కేంద్రాలు స్థాపించారు. 57 వైద్య సంస్థలకు, 40 వైద్య కళాశాలలతో సహా క్యాన్సర్‌ శాఖల్ని పటిష్టపరిచేందుకు ఆర్థిక సహాయం అందించబడింది. ఈ పథకాన్ని మధుమేహం, గుండెజబ్బులు, 'బ్రెయిన్‌ స్ట్రోక్‌'లకు సంబంధించిన జాతీయ పథకాల్లో కలిపారు. ఇలా కలిపి రూపొందిన జాతీయ కార్యక్రమం కింద 21 రాష్ట్రాలలో 100 జిల్లాల్లో ముందుగా గుర్తించేందుకు, రోగ నిర్ధారణకు, చికిత్స యాజమాన్యానికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో గర్భసంచి ముఖద్వారం, రొమ్ము, నోటి క్యాన్సర్‌లకు అవకాశం కల్పించారు.
చిహ్నాలు..
- ఊపిరితిత్తుల్లో: తరచుగా దగ్గు, న్యూమోనియా వస్తాయి. అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు ఉమ్మితో రక్తం పడొచ్చు.
- గొంతులో: మింగడంలో ఇబ్బంది, నొప్పి వుంటాయి.
- పురీషనాళంలో (కోలోరెక్టల్‌):మల విసర్జనలో ఇబ్బంది, రక్తం పడొచ్చు.
- రొమ్ములో :గడ్డలు ఏర్పడటం.
- కణితలు:అంతర్గత రక్తస్రావం.
- రక్తహీనత :మలం, మూత్ర విసర్జనలో రక్తం పడటం.
- జీర్ణాశయం :వాంతులు, అజీర్తి వంటి లక్షణాలుంటాయి.
పైన చిహ్నాలు వుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి.

రక్తంలో..
రక్త కణాల ఉత్పత్తి, ధర్మాలను రక్తక్యాన్సర్‌ ప్రభావితం చేస్తుంది. ఇది ప్రధానంగా బోన్‌ మారో (ఎముకల మజ్జ / మూలగ) లో ప్రారంభమవుతుంది. ఇక్కడే రక్తం, రక్తకణాలు ఉత్పత్తవుతాయి. మామూలుగా మజ్జలో వున్న మూలకణాలు అభివృద్ధి అయి, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తయారవుతాయి. ఎక్కువ రక్తక్యాన్సర్‌ల్లో తెల్లరక్త కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దీనితో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇలా అడ్డగోలుగా పెరిగే కణాల్ని క్యాన్సర్‌ కణాలంటారు. ఇవి మిగతాకణాల్ని సరిగా పనిచేయనియ్యవు. ఫలితంగా, రోగ నిరోధకశక్తిని కోల్పోయేలా చేస్తుంది. రక్తాన్ని గడ్డకట్టనీయదు. రక్త క్యాన్సర్‌కు ప్రధానంగా మందులతో (కీమోథెరిపీ పద్ధతిలో) చికిత్స చేస్తారు.
ప్రధానంగా మూడురకాలైన రక్త క్యాన్సర్‌లున్నాయి.
ఇవి: 1) లుకేమియా,
2) లింఫోమా, 3) మైలోమా.
1. లుకేమియా : తీవ్రస్థాయిలో వున్నప్పుడు ప్రభావితమైన తెల్ల రక్తకణాల ఆధారంతో రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
ఎ. లింఫోబ్లాస్టిక్‌ (తెల్లరక్తకణాలు) లుకేమియా: దీనివల్ల సహజంగా వున్న వైరల్‌ అంటు రోగాల్ని ఎదిరించేశక్తిని కోల్పోతుంది. ఇది పిల్లల్లో (15 సంవత్సరా లలోపు) ఎక్కువగా వస్తుంది. ఎక్కువ మందిలో ఇది రెండు నుండి ఐదేళ్లలోపు పిల్లలకి వస్తుంది. దీనికి కారణాలు తెలియదు. మందులతో పిల్లల్లో 85 శాతం మందిలో దీన్ని తగ్గించవచ్చు. అయితే పెద్దవాళ్లల్లో 40 శాతం మందిలోనే తగ్గే అవకాశం వుంది.

బి. మైలాయిడ్‌ సెల్స్‌ (మూలగ) లుకేమియా: ఇది సహజంగా వున్న బ్యాక్టీరియా, పరాన్న జీవుల్ని, కణజాల నష్టాన్ని పరిమితంచేసే శక్తిని కోల్పోయేలా చేస్తుంది. ఈ రకం క్యాన్సర్‌ వచ్చినప్పుడు పాలిపోవడం, అలసిపోవడం, శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. తరచుగా అంటురోగాలు వస్తాయి. అసాధారణంగా, తరచుగా రక్తస్రావం జరుగుతుంది. ఇది ఎక్కువగా 60 ఏళ్లు పైబడినవారిలో, అదీ పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. పొగాకు తాగడం వల్ల ఇది వచ్చే అవకాశం ఎక్కువ.

లింఫోమా : ఈ క్యాన్సర్‌ శోషరస నాళ వ్యవస్థ (లింఫు సిస్టమ్‌) ను ప్రభావితం చేస్తుంది. ఇది రోగ నిరోధకశక్తిలో ఒక భాగం. ఎముకల మజ్జ, తెల్లరక్తకణాలు, లింఫు గ్రంథులు రోగ నిరోధకశక్తిలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. ఇది వస్తే లింఫు గ్రంథులు ఉబ్బుతాయి. ఇదే క్యాన్సర్‌కి చిహ్నం. తెల్లరక్తకణాలు పనిచేయవు. తరచుగా ఇన్ఫెక్షన్స్‌, వ్యాధులు వస్తాయి.

మైలోమా : ప్లాస్మా జీవకణాలకు క్యాన్సర్‌ సోకుతుంది. ఈ జీవకణాలు మామూలుగా రోగ నిరోధకశక్తికి అవసరమైన యాంటీబాడీల్ని తయారుచేస్తాయి. క్యాన్సర్‌ వచ్చినప్పుడు ఈ శక్తిని కోల్పోతాయి. ఎముక మజ్జలో వుండే కణాలు కూడా వేగంగా పునరుత్పత్తి అయ్యి, అక్కడే వుంటాయి. దీనివల్ల ఎముకలు ఉబ్బుతాయి. వెన్నెముకలో, పుర్రెలో, తొంటి ఎముకల్లో, ఉరః పంజరం (రిబ్స్‌) లో, ఇలా ఎక్కడైనా ఎముకల్లో ఏర్పడవచ్చు. దీన్ని ఎముకల క్యాన్సర్‌ అంటారు. దీనివల్ల నొప్పి, రక్తహీనత, ఎముకలు విరిగిపోవడం, శరీరంలో గడ్డలు గడ్డలుగా ఏర్పడటం, అలసిపోవడం, మూత్రపిండాలు దెబ్బతినడం జరుగుతుంది. ఇవన్నీ ఆలస్యంగా బయటపడతాయి.

క్యాన్సర్‌ కణాలను చంపడానికి లేదా పెరగకుండా ఆపేయడానికి ప్రత్యేక రసాయనాలను వాడుతూ చికిత్స చేయడాన్ని 'కీమోథెరిపీ' అంటారు. ఈ రసాయనాలు వేగంగా పెరుగుతూ, పునరుత్పత్తవుతున్న జీవకణాలపై దాడి చేస్తాయి. ఈ సమయంలో మామూలు కణాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తాయి. ఫలితం గా, కొంతకాలం దుష్ప్రభావాల్ని (సైడ్‌ ఎఫెక్ట్స్‌) కలిగిస్తాయి. కీమోథెరిపీ ఆపిన తర్వాత మామూలు కణాలు పునరుజ్జీవం పొందుతాయి. కాబట్టి, ఈ దుష్ప్రభావాలు కొంతకాలమే వుంటాయి. కీమోథెరిపీ శరీరం మొత్తం విస్తరించి, ప్రభావితం చేస్తుంది. అందువల్ల దీన్ని ప్రధానంగా రక్త క్యాన్సర్‌ చికిత్సకు వాడతారు. మిగిలిన క్యాన్సర్‌లలో కూడా, ఇతర శరీరభాగాల్లో ఎక్కడైనా క్యాన్సర్‌ కణాలు వుంటే వాటిని చంపేయడానికి కూడా ఈ చికిత్సను ఉపయోగిస్తారు. రేడియేషన్‌తో పాటు దీన్ని క్యాన్సర్‌ నివారణకు సమన్వయంతో వాడతారు.

దుప్ప్రభావాలు: వెంట్రుకలు రాలిపోతాయి. ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గిపోతారు, నోట్లో, గొంతులో పుండ్లు పడవచ్చు. వాంతులు అవ్వొచ్చు, అవుతాయి, అయ్యేట్లు అన్పించవచ్చు, మల బద్ధకం, డయేరియా, అలసిపోవడం జరుగుతుంది. వేళ్లు, మునివేళ్లూ స్మర్శ జ్ఞానం కోల్పోతాయి. గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిన వచ్చు. పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. కొందరిలో బుద్ధిమాంద్యం కూడా రావచ్చు. వంధ్యత్వం కూడా కలగవచ్చు. వీటిల్లో కొన్నింటిని నియంత్రించడానికి మరికొన్ని మందులు వాడతారు. వీటిల్లో కొన్ని దుష్ప్రభావాలు తాత్కాలికంగా వుంటాయి. మరికొన్ని దీర్ఘకాలం వుంటా యి. కొన్నిసార్లు గుండె, ఊపిరితిత్తులు, నాడీవ్యవస్థ, మూత్రపిండాలు, పునరుత్పత్తి అంగాలలో శాశ్వత మార్పులు రావచ్చు. ఏదేమైనా, క్యాన్సర్‌ చికిత్స తర్వాత వైద్యుని పర్యవేక్షణలో తప్పనిసరిగా వుండాలి.
కీమోథెరిపీలో ఈ దుష్ప్రభావాల్ని కలగకుండా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్దేశించిన కణాలకే (టార్జెటెడ్‌ సెల్స్‌) మందు అందేలా నానో టెక్నాలజీతో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఇతర చికిత్సలు: శస్త్ర చికిత్స, రేడియేషన్‌, కీమోథెరిపీ మూడూ కలిపి సమన్వయంతో వ్యాధికి చికిత్స చేస్తున్నారు. వ్యాధి స్థాయిని బట్టి చికిత్సను ఎంపిక చేస్తారు.

మీకు తెలుసా..?
- జీవకణాల్లో డిఎన్‌ఏ మార్పుల్ని కల్గించే రసాయనాలను 'మ్యూటాజన్స్‌' అంటారు. క్యాన్సర్‌ కలిగించే పదార్థాలను 'కార్సినోజన్స్‌' అంటారు. మ్యూటాజన్స్‌ అన్నీ కార్సినోజన్స్‌ కావు.
- ఎన్నో మ్యూటాజన్స్‌ క్యాన్సర్‌ కారకాలు. కానీ అన్నీ క్యాన్సర్‌ కారకాలూ మ్యూటాజన్స్‌ కావు. ఉదా: ఆల్కాహాల్‌.
- పొగాకులో నైట్రోసామైన్స్‌, పోలిసైక్లిన్‌, యారోమాటిక్స్‌, హైడ్రోకార్బన్‌ వంటి రసాయనాలు వుంటాయి. ఈ రసాయనాల ప్రభావంతో 20 శాతం క్యాన్సర్‌లు వస్తాయి.
- ఆంకాలజీ అంటే కణితులు (క్యాన్సర్‌) గురించిన శాస్త్రము.

No comments:

Post a Comment