Wednesday 19 December 2012

ఎవరి వాస్తు వారిదే..!

  • వాస్తు.. వాస్తవాలు..
               అది విజయవాడ పక్కనే ఉన్న సీతానగరంలోని చినజియ్యర్‌ ఆశ్రమం. దానిలో ఆరోజున వాస్తుపై వాస్తు వాదులకూ, వాస్తు వ్యతిరేకులకూ చర్చ జరగబోతోంది. ''సత్యాన్వేషణ మండలి' బాధ్యులు పుట్టా సురేంద్రబాబు ఏర్పాటు చేసిన ఆ చర్చకు చిన జియ్యర్‌స్వామి అనుమతించారు. ఆ చర్చకు వాస్తువాదులూ, వాస్తు వ్యతిరేకులూ, ఆహుతులందరూ వచ్చారు. సురేంద్రబాబు పరిచయవాక్యాల అనంతరం చర్చ మొదలైంది. మొదటగా వాస్తువాది రామయ్య (పేరు మార్చబడింది) మాట్లాడుతూ ''అన్ని సమస్యలకూ కారణం వాస్తే. అన్నిటికీ పరిష్కారం వాస్తే. నా పరిశోధనలో తేలిందేమిటంటే వాస్తు విరుద్ధమైన ఇళ్ళల్లో నివసించడమే అనారోగ్యం, దరిద్రం, ఉద్యోగ బాధలు మొదలైన అన్ని ఈతి బాధలకూ మూలకారణం. కొందరు చెబుతున్నట్లుగా ఎక్కడో ఆకాశంలో ఉన్న గ్రహాలకు మన జీవితాలను శాసించే శక్తి ఉందనడం అర్ధరహితం'' అన్నాడు. వెంటనే మరో వాస్తువాది నరసింహం (పేరు మార్చబడింది) లేచి ''రామయ్య చెప్పేదే అర్ధరహితం. మానవులను ఎండ, వాన, చలి నుండి కాపాడునదే గృహముగానీ మానవుల కష్టసుఖములన్నిటికీ వాస్తే మూలకారణమనటం అర్ధరహితమైన వాదన'' అన్నాడు. వెంటనే మరో వాస్తువాది వెంకట్రావు లేచి ''మానవుని యొక్క దశను ఇంటియొక్క దిశయే నిర్ణయిస్తుందని మా గురువు రామయ్య 30 సంవత్సరాల పరిశోధనలో అనేక వందల ఇళ్ళల్లో నిరూపించారు. ఉదాహరణకు ఈశాన్యం పెరగకపోతే దిఙ్మూఢం (దింగ్మూఢం) అని శాస్త్రం చెబుతోంది. ''దింగ్మూఢం కులనా శస్వాత్‌'' అని ప్రాచీన గ్రంథాలు కూడా ఘోషిస్తున్నాయి. అంటే ''ఈశాన్యం పెరగకపోతే వంశ నాశనం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మా గురువు సూచనను అనుసరించి ఈశాన్య మూలన స్థలాన్ని పెంచుకున్నవారు అనేకమంది సుఖాలను అనుభవిస్తున్నారు. అదీ వాస్తుశాస్త్ర మహిమ'' అన్నాడు. వెంటనే మరో వాస్తువాది ప్రకాశరావు లేచాడు. వాస్తు వ్యతిరేకులకు అవకాశమీయకుండా వాస్తువాదులే ఒకరి వాదననొకరు ఖండించుకోవడం వాస్తు వ్యతిరేకులకు వింతగానూ, ఆనందంగానూ ఉంది. ప్రకాశరావు మాట్లాడుతూ ''మానవులు నివసించే స్థలం ఏమూలన పెరిగినా శోకమే మిగులుతుందని 'శోకో విషమ బాహుకే' అనే శాస్త్ర ప్రమాణం చెబుతోంది. అంతేకాదు. మా గురువు నరసింహం పరిశోధనల్లో రుజువైంది కూడా అదే. ఈశాన్యం పెరగడం కోసం పక్కింటివారి స్థలాన్ని ఆక్రమించుకొని, తగవులపాలై, కోర్టులకెక్కి, ఆర్థికంగా నాశనమైన వారెందరో వున్నారు. కాబట్టి ''దింగ్మూఢం కులనాశస్యాత్‌ అనేది వాస్తు విరుద్ధం'' అన్నాడు. అలా వాదనలు పెరిగి, పెరిగి వాస్తువాదులే ఒకరినొకరు వ్యక్తిగతంగా నిందించుకొనేంత వరకూ పరిస్థితి మళ్ళింది. చర్చ రసాభాసగా మారింది. దీనితో వాస్తు వ్యతిరేకులు ఒక్కమాట కూడా మాట్లాడకుండానే 'వాస్తు అనేది పరస్పర విరుద్ధాంశాలతో కూడినదని'' ఆహుతులు అర్థంచేసుకోడమే ఆనాటి 'వాస్తు సంవాద' ఫలితం..!

కె.ఎల్‌.కాంతారావు,
జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment