Thursday 1 November 2012

జీవవైవిధ్యం.. సంరక్షణ.. కార్యక్రమాలు ..



'జీవవైవిధ్యం.. సుస్థిరాభివృద్ధి' ప్రధాన లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సులను నిర్వహించింది. ఇవి అక్టోబర్‌ 19వ తేదీన ముగిశాయి. జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తూ సుస్థిరాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాల్ని ఈ సదస్సులు రూపొందిస్తాయని సహజంగా అందరూ ఆశించారు. రెండేళ్ల క్రితమే ''వ్యూహాత్మక జీవవైవిధ్య ప్రణాళిక''లో భాగంగా 'ఐచి' జీవవైవిధ్య లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందుతాయనీ ఆకాంక్షించారు. కానీ, దీనికి విరుద్ధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వున్న జీవవైవిధ్యాన్ని వాణిజ్య అవసరాలకు ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై కేంద్రీకరించడంతో అసలు జీవవైవిధ్య పరిరక్షణ కార్యక్రమ రూపకల్పనకు ప్రాధాన్యత లభించలేదు. జీవవైవిధ్య పరిరక్షణలో ఇమిడి వున్న సామాజిక, ఆర్థికాంశాలపై నిర్దిష్టమైన నిర్ణయాలూ తీసుకోలేదు. కానీ, 2015 నాటికి ఇప్పటికే ఇస్తున్న గ్రాంట్లను రెట్టింపు చేసి, ఆ తర్వాత కనీసం అదే స్థాయిలో కొనసాగించాలని నిర్ణయించారు. ఇది ఆహ్వానించదగ్గది. ఈ నేపథ్యంలో జీవవైవిధ్య సంరక్షణకు, సుస్థిర వినియోగానికి ఇప్పటికే రూపొందించిన లక్ష్యాలను, మన దేశంలో అమలవుతున్న విధానాల్ని సంక్షిప్తంగా తెలుపుతూ 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో మీ ముందుకొచ్చింది
ఈ వారం 'విజ్ఞానవీచిక'.

భూగోళంలో ప్రకృతి ప్రసాదించిన అపారమైన సంపద జీవవైవిధ్యం. ఇది వెల కట్టలేనిది. భూగోళంలో వున్న జీవాలన్నీ పరస్పరం ఆధారపడుతూ సుస్థిరతను ఆపాదిస్తున్నాయి. కానీ, మానవ కార్యక్రమాల వల్ల ఈ స్థిరత్వం దెబ్బతింటుంది. కోల్పోయిన జీవవైవిధ్యాన్ని వీలున్న మేర పునరుద్ధరించి, సంరక్షించడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1992లోనే కృషి ప్రారంభమైంది. వున్న వైవిధ్యాన్ని సుస్థిరంగా వినియోగించడం, వచ్చిన ఫలితాల్లో సంబంధితులకు సమ భాగస్వామ్యం కల్పించడం దీని లక్ష్యం. రెండేళ్ల క్రితం జపాన్‌లోని 'నగోయా' పట్టణంలో జన్యువనరుల అందుబాటుకు, వచ్చిన ఫలితాల్లో సమభాగస్వామ్యం అందించడానికి నిర్వహణ నియమాల్ని (ప్రొటోకాల్‌) రూపొందించింది. దీనికోసం వ్యూహాత్మక ప్రణాళికను తయారుచేసింది. దీనిలో ఐదు గమ్యాలతో కూడిన 20 లక్ష్యాలను పొందుపరిచింది. వీటన్నింటినీ సంయుక్తంగా 'ఐచి జీవవైవిధ్య లక్ష్యాలు'గా వ్యవహరిస్తున్నారు.
''ఐచి'' లక్ష్యాలు..
ఈ లక్ష్యాలన్నీ 2020 సంవత్సరంలోపల సాధించడానికి ఉద్దేశించినవి.
గమ్యం ఎ: కోల్పోయిన జీవవైవిధ్యాలకుగల కారణాల్ని గుర్తించి, పునరుద్ధరించే ప్రయత్నాలు :
జీవవైవిధ్య విలువల్ని అందరిచే గుర్తింపజేస్తూ పరిరక్షించి, వినియోగించడానికి కావల్సిన చర్యల్ని గుర్తింపజేయడం. జాతీయ, స్థానిక అభివృద్ధి కార్యక్రమంలో, పేదరిక నిర్మూలన వ్యూహంలో, ప్రణాళికలో భాగంగా జీవవైవిధ్య విలువల్ని చేర్చడం మరో లక్ష్యం. జీవవైవిధ్య స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం ఇంకో లక్ష్యం. జీవవైవిధ్యాన్ని నష్టపరిచే కార్యక్రమాలకు ఇచ్చే ప్రోత్సాహకాల్ని ఎత్తివేయడం లేదా సంరక్షణ, సుస్థిర వినియోగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం ఈ కోవ కిందకు వస్తాయి. ప్రకృతి వనరులను సురక్షితమైన పర్యావరణ పరిధిలో వినియోగించడం కూడా దీనిలో భాగమే.
గమ్యం బి: జీవవైవిధ్యంపై నేరుగా వున్న వత్తిళ్లను తగ్గిస్తూ, సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించడం:
జీవవైవిధ్యానికి అవసరమైన నివాస స్థలాల నష్టాల్ని 2020 నాటికి కనీసం సగానికి తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం. చేపలు, ఇతర అకశేరుకాలు, జంతువులు, జల, వృక్ష సంపదను సుస్థిరంగా లభ్యమయ్యే రీతిలో వినియోగించడం. అస్థిర వినియోగాన్ని నివారించడం. వ్యవసాయంలో ప్రకృతిని పరిరక్షిస్తూ సుస్థిరాభివృద్ధికి దోహదపడడం వంటివన్నీ ఈ కోవ కిందకు వస్తాయి.
గమ్యం సి: పర్యావరణ వ్యవస్థలను, జాతులను, జన్యువైవిధ్యాలను పరిరక్షిస్తూ జీవవైవిధ్య స్థాయిని మెరుగుపరచడం:
కనీసం 15 శాతం భూభాగాన్ని, భూమిపై నీటిని, సముద్రతీర ప్రాంతాల జీవావరణాల్ని, వాటిలోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం వంటివి ఈ కోవ కిందకు వస్తాయి. సేద్యమవుతున్న పంటల రకాల్ని, వీటికి సంబంధించిన అటవీ (వైల్డ్‌) రకాల్ని పరిరక్షించడం కూడా ఇందులో భాగమే.
గమ్యం డి: జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థ సేవల వల్ల కలిగే లాభాలను అందరికీ పెంచడం:
స్థానికులు, పేదలతో సహా అందరి అవసరాలను పరిరక్షించే విధంగా జీవవైవిధ్య వ్యవస్థను, పర్యావరణ సేవలను నిర్వహించడం. సంరక్షణ, పునరుజ్జీవన కార్యక్రమాల ద్వారా కార్బన్‌ నిల్వలను పెంచుతూ జీవవైవిధ్య పరిరక్షణకు, పర్యావరణ మార్పులను తట్టుకొనే శక్తిని కలిగించడం ఈ లక్ష్యాల కిందకే వస్తాయి.
గమ్యం ఇ: భాగస్వామ్య ప్రణాళిక, విజ్ఞాన యాజమాన్యం, సాంకేతిక సామర్థ్యాలను పెంచుతూ జీవవైవిధ్య పరిరక్షణ కార్యక్రమాల్ని పెంచడం:
భాగస్వామ్యంతో పెంపొందించిన జాతీయ, జీవవైవిధ్య వ్యూహానికి తోడ్పడే విధా నాలతో అభివృద్ధిని ప్రారంభించడం. సాంప్రదాయవిజ్ఞానం, ఆవిష్కరణలు, ఆచారాలు జీవవైవిధ్య పరిరక్షణకు, సుస్థిర వినియోగానికి తోడ్పడేలా చేయడం దీని కిందకే వస్తుంది. దీనికి సంబంధించిన విజ్ఞానాన్ని అందరితో పంచుకోవడమూ, వినియోగిం చడమూ దీనిలో భాగమే. 2011-20 కాలానికి సంబంధించిన వ్యూహాత్మక ప్రణాళిక అమలుకు కావాల్సిన వనరులను సేకరించి, వినియోగించడం దీని కిందకే వస్తాయి.
ఇప్పుడేం జరిగింది..?
ఒక్కమాటలో చెప్పాలంటే జీవవైవిధ్య సుస్థిర వినియోగానికి, దీనిలో ఇమిడి వున్న సామాజిక, ఆర్థిక సంబంధాలకు, ముఖ్యంగా దీనిపైనే జీవిస్తున్న పేదలకు సంబంధించి ఏ నిర్దిష్ట కార్యక్రమాన్ని నిర్ణయించలేదు. జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగంపై కేంద్రీకరించి, చర్చించేబదులు వున్న వైవిధ్యాన్ని వ్యాపార అవసరాల కోసం వినియోగించుకునే కృషిపైనే కేంద్రీకరించబడింది. ఫలితంగా, అసలు 'ఐచి లక్ష్యాల' సాధనకు ఆచరణాత్మక కార్యక్రమం రూపొందలేదు. అభివృద్ధి చెందిన దేశాలు 'ఐచి లక్ష్యాల' సాధనకు అవసరమైన నిధుల్ని అందించడానికి ఆసక్తిని చూపలేదు. భారతదేశం, కొన్ని ఆఫ్రికా దేశాలు చొరవచూపి నిధుల్ని ప్రకటించిన తర్వాత మాత్ర మే అభివృద్ధి చెందిన దేశాలు తమ నిధుల కేటాయింపుపై ఒక అంగీకారానికి వచ్చా యి. 2015 నాటికి ఇప్పుడు అందిస్తున్న నిధులను రెట్టింపు చేయడానికి, ఆ తర్వాత కనీసం అదే స్థాయిలో కొనసాగించడానికి అంగీకరించాయి. జీవవైవిధ్య వినియోగంలో ఇమిడి వున్న సామాజిక, ఆర్థిక అంశాలను చర్చించడాన్ని వాయిదా వేశాయి.

కేరళలో..
జీవవైవిధ్య సంరక్షణలో మొదటిస్థానాన ఉంది. దీనికి ప్రక్రియలు 2009లోనే ప్రారంభమైనాయి. రాష్ట్రంలోని మొత్తం 978 గ్రామ పంచాయతీలు, 60 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు ఏర్పడ్డాయి.
ఇప్పటివరకూ 500 జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు 'ప్రజా జీవవైవిధ్య రిజిష్టర్ల'ను తయారుచేశారు. వీటిలో స్థానిక జీవవనరులు, వాటి వైవిధ్యం, సాంప్రదాయ విజ్ఞానానికి సంబంధించిన సమాచారం పేర్కొనబడింది. స్థానిక సంస్థలు ఎంతో బలంగా వున్నప్పటికీ ఈ రిజిష్టర్ల తయారీ అంత తేలిగ్గా జరగలేదు. వీటిని పూర్తి చేయడానికి ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది.
గ్రామపంచాయతీ అధ్యక్షులే గ్రామ జీవవైవిధ్య కమిటీ అధ్యక్షులు. మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ స్థాయిలో.. సంబంధిత ఛైర్మన్‌ లేక మేయర్లు ఆయా జీవవైవిధ్య కమిటీ లకు అధ్యక్షత వహిస్తున్నారు. స్థానిక సంస్థల కార్యదర్శి జీవవైవిధ్య యాజమాన్య కమిటీకి సభ్య కార్యదర్శి. ఈ వ్యవస్థలో స్థానిక సంస్థలకు, జీవవైవిధ్య యాజమాన్య కమిటీలకు మధ్య రాగల వైరుధ్యాల్ని నివారించేందుకు ఈ ఏర్పాటు చేయబడింది.
కమిటీల విధులు..
ప్రజా జీవవైవిధ్య రిజిష్టర్లలో నిక్షిప్తం చేయబడిన విజ్ఞానాన్ని పరిరక్షించడం. ముఖ్యంగా బయట సంస్థలు, వ్యక్తుల నుండి రక్షించడం.
స్థానిక కార్యక్రమాలకు నిధుల సేకరణ, వినియోగం.
స్థానిక జీవవైవిధ్య వారసత్వ కేంద్రాలను గుర్తించే ప్రక్రియలను ప్రారంభించడం. జన్యు సంపద బ్యాంకులను, సాంప్రదాయక విజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి అనువుగా విత్తన కేంద్రాలను నిర్వహించడం.
అన్ని జిల్లాల్లో జిల్లాస్థాయి సమన్వయకర్త నియమించబడ్డాడు. అన్ని జిల్లాల్లో ఐదుగురు జూనియర్‌ పరిశోధకులతో కూడిన బృందం నియమించబడింది. వీరు వృక్షశాస్త్రం, జీవశాస్త్రం, పర్యావరణ విజ్ఞానంలో నైపుణ్యంగల వారు. ప్రతి పరిశోధకుడు కనీసం 15 గ్రామ పంచాయతీలకు బాధ్యత వహిస్తాడు.
అన్ని స్థానిక సంస్థల్లో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలను నిర్వహించడానికి ఒక సమన్వయకర్త వున్నాడు.
ప్రతి వార్డు నుండి ఐదారుగురు సభ్యులను జీవవైవిధ్య సమాచారాన్ని సేకరించడానికి ఎంపిక చేశారు. వీరికి శిక్షణ ఇవ్వబడింది. వీరికోసం ఇంతవరకూ 33 కార్యశాలలు నిర్వహించారు.
ప్రతి ప్రజా జీవవైవిధ్య రిజిష్టర్లను తయారుచేయడానికి స్థానిక సంస్థ రూ. 70 వేలు కేటాయించింది. కొన్ని పంచాయతీలు రూ. లక్ష వరకూ కేటాయించాయి.
గడ్డల (ట్యూమర్స్‌) సమాచారాన్ని వైనాడ్‌లోని ఎడవాకల, ఆక్వా కల్చర్‌, మడ అడవుల జీవవైవిధ్య సమచారాన్ని 'అతోలి' వద్ద, నదీ జీవవైవిధ్యం ఫెన్సింగ్‌పై 'పెరుమన్నా' వద్ద సేకరించబడ్డాయి. ఈ రెండూ కోజికోడ్‌ జిల్లాలో వున్నాయి.

మన రాష్ట్రంలో..
రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు 2006లో ప్రారంభించ బడింది. ఇప్పటివరకూ దాదాపు 150 జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు ఏర్పడ్డాయి. ఐదు జీవవారసత్వ కేంద్రాలు గుర్తించబడ్డాయి. ఇవి తిమ్మమ్మ, మర్రిమాను, వీరాపురం, తిరుమల, శ్రీశైలం, తలపోను, ఔషధ, వృక్ష ప్రాంతాలు. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ వద్ద వ్యవసాయ జీవవైవిధ్య వారసత్వ కేంద్రం ప్రకటన ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే పూర్తవుతుంది.
రెడ్‌ సాండర్స్‌, డి కాలిపర్స్‌, సైకాస్‌, గ్లోరియాజా తదితర వృక్షాలు; పులి, చిరుత, ఏనుగు, పునుగు పిల్లి, రాబందులు, గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్స్‌ తదితరాలు అధికంగా వుండే ప్రాంతాలను గుర్తిస్తున్నారు. వ్యవసాయ ప్రాధాన్యత గల పత్తి, జొన్న, సజ్జ, వరి, ఒంగోలు జాతి గిత్తలు (ఎద్దులు), పుంగనూరు ఆవులు, పొలస చేపలు, బంగినపల్లి మామిడి తదితర ఎన్నో రకాలు రాష్ట్రంలో వున్నాయి.
విధానం..
వాణిజ్య వినియోగానికి అనువైన చెట్లను, జంతువులను, చేపలను గుర్తించడం (బయో ప్రాస్పెక్టింగ్‌). ఉదా: ఒంగోలు జాతి ఎద్దులు, పొలస చేపలు, పుంగనూరు ఆవులు, ఔషధ చెట్లు, అటవీ జాతులు.
మండల, జిల్లా, కార్పొరేషన్ల స్థాయిలో స్థానిక జీవవైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పర్చి, వాటిపై సర్వహక్కుల్నీ ఇవ్వడం. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ప్రజల జీవనానికి అనువుగా వనరులను అందించడం.
ఆహారం, ఆరోగ్య భద్రతకు జీవవైవిధ్యాల్ని ఉపయోగించడం.
అంతరించిపోయే ప్రమాదంగల జాతుల్ని, గుర్తించి పరిరక్షించడం.
సేంద్రీయ వ్యవసాయం.
వాననీటి సేకరణ, పరిరక్షణ.
ప్రధాన పట్టణాల జీవవైవిధ్య వివరాల్ని సేకరించి, నిర్వహించడం.
లాభాల్ని పంచుకునేందుకు వీలుగా విలువైన వనరులకు భౌగోళిక సూచికలను రూపొందించడం.

మనదేశంలో..
అంతర్జాతీయ వేదికల మీద చేస్తున్న ప్రసంగా లకు, దేశంలో అమలుచేస్తున్న విధానాలకు పొంతన వుండడం లేదు. దేశంలో అనుసరిస్తున్న వ్యవసాయ విధానం, విచక్షణారహిత ప్రకృతి వనరుల వినియోగం జీవవైవిధ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. జీవైవిధ్యాన్ని సుస్థిరంగా వినియోగించడానికి దోహదపడే చిన్నకమతాల సేద్యానికి బదులు పెద్దపెద్ద యం త్రాలతో, పెద్ద మొత్తంలో రసాయనాలను వినియోగించి సాగుచేసే కార్పొరేట్‌ సేద్యాన్ని ప్రభుత్వ ప్రోత్సహిస్తుంది. జీవవైవిధ్యాన్ని పూర్తిగా హరించే జన్యు మార్పిడి సాంకేతికాల్ని, ముఖ్యంగా బిటి సాంకేతికాన్ని ప్రోత్సహిస్తోంది. విచక్షణా రహితంగా అడవుల్ని కొల్లగొడుతూ, ఖనిజ వనరుల సేకరణకు అనుమతిస్తోంది. ప్రకృతి వన రుల్ని అక్రమంగా కొల్లగొట్టేవారిపై నామమాత్రపు చర్యల్ని తీసుకుంటుంది. సముద్ర తీరంవెంబడి కాలుష్యాన్ని పెంచుతూ వేడిని విడుదల చేసే థర్మల్‌, అణు విద్యుత్‌ కేంద్రాలకు అనుమతిస్తుంది. సముద్రంలో వేగంగా, లోతుగా వెళ్లి, చేపలను వేటాడే పెద్ద పెద్ద యాంత్రిక పడవలకు అనుమతిస్తుంది. తీరంలో ఓడరేవుల్ని నిర్మిస్తూ మత్స్యకారుల జీవనాన్ని ఛిద్రంచేసే విధానాల్ని అనుసరిస్తుంది. అంతర్జాతీయ వేదిక లపై చేస్తున్న ప్రసంగాలు, అంగీకరించే నిర్ణయాలకు అనుగుణంగా స్థానిక విధానా లను, చట్టాలను మార్చడం లేదు./ ఫలితంగా, జీవవైవిధ్యం వేగంగా క్షీణిస్తుంది. వున్న వైవిధ్యాన్ని వ్యాపార ప్రయోజనాలకు వినియోగించాలన్న దానిపైనే కేంద్రీకరిస్తుంది.

No comments:

Post a Comment