Sunday 16 September 2012

ప్రధానిగా కొనసాగించలేని వాస్తు శాస్త్రం



  • అశాస్త్రీయ ఆచారాలు - 18
దేవెగౌడ 1-6-1996లో భారత ప్రధాని అయ్యారు. ఆయన నివసించడానికి అధికారులు ఒక భవనాన్ని చూసి, దానికి అన్ని హంగులూ ఏర్పాటు చేసి, ఆయనకూ, ఆయన కుటుంబసభ్యులకూ చూపించారు. ఆయన తన వాస్తు పండితుణ్ణి సంప్రదించారు. ఆ పండితుడు, ఆ భవనం దేవెగౌడ కుటుంబానికి అశుభం కలిగిస్తుందని చెప్పాడు. అంతే! దేవెగౌడ మరో భవనాన్ని చూడమని అధికారులను ఆదేశించారు. వారు మరో భవనాన్ని చూశారు. దేవెగౌడ వాస్తు పండితుడు ఆ భవనాన్ని సందర్శించి, అనేక వాస్తు మార్పులు సూచించారు. మొదటిది ఆ ఇంటి ముందు ఉన్న రెండు మెట్ల స్థానంలో మూడు మెట్లు ఉండాలన్నాడు. అప్పటివరకు ఉన్న మెట్ల ఎత్తు ఒక్కొక్కటీ ఆరంగుళాలు. వాటిని తీసి మూడు మెట్లు కడితే ఒక్కో మెట్టు ఎత్తు నాలుగంగుళాలే అవుతుంది. అది ఎక్కి దిగేవారికి ఇబ్బందికరం అవుతుంది. అందుకని అధికారులు రెండోమెట్టు కిందిభాగంలో నేలమీద ఒక రాయిని పరిచి 'అది మూడోమెట్టు' అన్నారు. రెండో వాస్తు మార్పుగా ఇంటిముందు తులసికోట ఉండాలనీ, దాని చుట్టూ వినాయకుడు, లక్ష్మి, రాధాకృష్ణుల చిత్రాలు టైల్స్‌ మీద చిత్రీకరించి ఉండాలనీ ఆ వాస్తువాది చెప్పాడు. కష్టపడి తులసి కోటను అధికారులు సంపాదించారు. గణేశుడు, లక్ష్మీ విగ్రహాలు కూడా దొరికాయి. కానీ రాధాకృష్ణుల బొమ్మ దొరకలేదు. గణేశ, లక్ష్మీ బొమ్మలతో పాటు వేరే దేవుని బొమ్మ ఉన్న సిరామిక్‌ టైలు అతికించబోయారు. కానీ, వాస్తు పండితుడు వేరే బొమ్మను అతికించడానికి అంగీకరించలేదు. చివరకు వారం, పదిరోజులు ఢిల్లీ అంతా గాలించి రాధాకృష్ణులున్న టైల్‌ను సంపాదించారు. వెంటనే తులసికోటకు చుట్టూ వినాయకుడు, లక్ష్మి, రాధాకృష్ణుల బొమ్మలున్న సిరామిక్‌ టైల్స్‌ను అతికించారు. వాస్తువాది సంతృప్తి చెందాడు. దేవెగౌడ కుటుంబం ఆ భవనంలోకి గృహ ప్రవేశం చేసింది. ఫలితం! ప్రధాని పదవిని చేపట్టిన 11 నెలలలోపే అంటే 13-4-1997న దేవెగౌడ ప్రధాని పదవి నుండి దిగిపోవలసి వచ్చింది! ఇదీ వాస్తు బండారం..!!

No comments:

Post a Comment