Friday 21 September 2012

పాములు గుడ్లు తింటాయా?


పాము పుట్టల్లో గుడ్లు వేస్తారు. పాములు గుడ్లు తింటాయా? నాగస్వరం ఊదితే నాగుపాము పడగ ఆడిస్తుంది కదా? అదెలా? పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి? పాములు ఎందుకు బుసకొడ్తాయి? పాములు ఎలా చూస్తాయి? ఎలా వింటాయి? ఎలా వాసన చూస్తాయి?
- జి. సింధూ (7), హైదరాబాద్‌
గతవారం పాము పగపడుతుందా అన్న ప్రశ్నకు జవాబుగా పాముల్లో ఉన్న విషసర్పాల గురించి, విషరహిత సర్పాల గురించి సూక్ష్మంగా తెలుసు కున్నాం. ఈ వారం ప్రశ్నలు చాలానే ఉన్నాయి కాబట్టి అన్నింటికీ వివరంగా జవాబు చెప్పాలంటే అనకొండలాగా పెద్ద చేంతాడంత జవాబు వచ్చే ప్రమాదం ఉన్నందున అన్ని ప్రశ్నలకు టూకీగానే జవాబు ఇస్తాను.
పాము పుట్టల్లో గుడ్లు వేస్తారు. అవి గుడ్లు తింటాయా?
పుట్టలు పాములవి కాదు. 'చీమలు పెట్టిన పుట్టలు పాముల కెరవైనట్లు..' మనం సుమతీ శతకంలోనే చదువుకున్నాం కదా! కొన్ని నెలలపాటు చాలా శ్రామిక చీమలు ఒక్కొక్క మట్టి రేణువును పోగేసి ఐకమత్యంతో కట్టుకున్న పుట్ట బొరియల్లోకి అనువుగా పాములు భూకబ్జా చేసి పుట్టల్లో ఉంటాయి. ఎండ్రకాయ బొరియల్లోనూ, చీమల పుట్టల్లోను, చెట్ల బొరియల్లోను పాములు నివసిస్తాయి. సాధారణంగా పాములన్నీ మాంసాహారులు (carnivores). ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2700 రకాల పాములున్నా వాటిలో కేవలం ఆరు రకాలు మాత్రమే గుడ్లను తింటాయి. అందులో ఐదు రకాలు ఆఫ్రికాలో ఉంటాయి. కేవలం ఒక రకం మాత్రం భారతదేశంలో ఉన్నట్లు కనుగొన్నారు. దానిపేరు 'ఎలకిస్టోడన్‌ వెస్టర్‌మని(Elachistodon westermanni). ఈ ఆరింటిలో ఏదీ విషసర్పం కాదు. ఎలకిస్టోడన్‌ వెస్టర్‌ మని 1969లోనే దాదాపు అంతరించిపోయింది. కానీ ఈ మధ్య అరుదుగా మహారాష్ట్ర, గుజరాత్‌ అడవుల్లో ఓ పరిశోధకుడు చూసినట్లు వార్తలు వచ్చాయి. అసలు విషయమేమిటంటే మనం నిత్యం చూసే పాములేవీ గుడ్లు తినవు.
నాగస్వరం ఊదితే నాగుపాము పడగ ఆడిస్తుంది కదా! అదెలా?
నాగుపాముకు అస్తిపంజరం దృఢంగా ఉండడం వల్ల తలను బాగా నిక్కజాపి పడగ విప్పుతుంది. ఇతర పాములు కూడా కొద్దిగా తల పైకెత్తి నిటారుగా ఉంచగలవు కానీ, పడగవిప్పవు. నాగుపాముకు ఉన్న రూపం, భయానక వివరణ, పుక్కిటి పురాణ వర్ణన, విష ఫణిగుణం వల్ల కొందరు దాన్ని బుట్టలో పెట్టుకొని వచ్చి పిల్లలకి, పామరులకు, సకల శాస్త్రాలు చదివినా తల, తోక అనక నిలువెల్లా అశాస్త్రీయతను నింపుకొన్న కల్ల మేధావులకు నాగనాట్యం చూపుతారు. నీటిపాము, వానపాము, పసిరిక పాము, ఏలిక పాములకు ఆ ఘనత లేదు. వాటిపైనా ఏ పురాణ పురుషుడూ శయనుడు కాదు. కాబట్టి వాటిని బుట్టలో పెట్టుకొని ఏ గారడీవాడు ఊరి కూడలి వద్ద ప్రదర్శనలు చేయడు. నిజానికి నోట్లో వేలుపెట్టినా పెద్దగా కొరకలేని నీటిపామును బుట్టలో పెట్టి మూత తీసి నాగస్వరం పాముల గారడీవాడు ఊదినట్లుగా ఊదితే ఆ పాము కూడా తల ఆడిస్తుంది. కాబట్టి నాగస్వరానికి అలాగ ఊదితే ఊగడం నాగుపాము అబ్బ సొమ్ము కాదు. పూడుపాము కూడా ఆడగలదు. ఇక్కడ అండర్‌లైన్‌ చేయడానికి కారణం ఉంది. గతవారమే చెప్పుకొన్నట్లు ఏ పామూకూ చెవులు ఉండవు. కళ్లు ఉంటాయి. నాగుపాము గారడీవాడు నాగస్వరం ఊదేప్పుడు గమనించండి. ఆ బూరను అటూ ఇటూ పాముకన్నా జోరుగా ఊపుతూ ఊదుతాడు. పైగా, తల కూడా అటూ యిటూ ఊపుతాడు. దానికితోడు తన కాలి తొడ, మోకాలు దగ్గర కూడా అటూ ఇటూ కదులుతాడు. విడ్డూరంగాను, వింతగాను అతడు తల, బూర ఊపుతుంటే పాము ఆశ్చర్యంగా వాడి బూరను చూస్తూ అటూయిటూ తల ఊపుతుందేగానీ.. 'గానరసం.. ఫణిః' అన్నట్లు నాగస్వరపు మాధుర్యాన్ని గ్రోలుతూ కాదు.
పాములు వాసన చూస్తాయా?
పాములు వాసనను చూడ్డానికి కొద్ది మోతాదులోనే తమ ముక్కుల్ని వాడతాయి. ప్రధానంగా పాములు తమ నాలుక (చీలిక ఉన్న) ద్వారా వాసన చూస్తాయి. అందుకే పదే పదే అవి నాలుకను బయటికి చాచి ఆడిస్తాయి. అపుడు వాతావరణంలో ఉన్న రసాయనిక ద్రవ్యాల్ని ఆస్వాదించి జాకబ్సన్స్‌ అవయవాలు (Jacobson’s organs) అనే నోటిలో ఉన్న శరీరభాగాల ద్వారా మెదడుకు సంకేతాల్ని పంపి వాసనను గ్రహిస్తాయి. పాములు రుచి చూడలేవు. అందుకే అపుడపుడూ అవి తమకేమాత్రం ఉపయోగపడని మెత్తని వృథా పదార్థాల్ని కూడా 'గుడ్డిగా' భోంచేస్తాయి.
పాములెందుకు బుసకొడ్తాయి?
అన్ని పాములూ బుసకొట్టవు. చాలావరకు పాములు చురుకైన (active) జంతువులు. అంటే వాటికి శ్వాసక్రియ చాలా అవసరం. కానీ ముక్కు రంధ్రాలు సన్నగా ఉండడం వల్ల సాధారణ శ్వాసక్రియే (మనలో కొందరిలో గురక - snoring - లాగా) కొంత బుసలాగా అనిపిస్తుంది. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నపుడు‘fight or flight (పోరాడు లేదా పారిపో)్ణ అనే అసంకల్పిత ప్రతీకార చర్య (involuntary reaction) కారణంగా మరింత వేగంగా చేసే శ్వాసక్రియే మనకు బుసలాగా తోస్తుంది.
పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి?
పాములే కాదు పొలుసులు (scales) గట్టి ఫలకాలు (plates) ఉన్న చాలా జంతువులు కుబుసం (moulting) విడుస్తాయి. శరీరం పెరుగుతున్న క్రమంలో మనలాంటి జంతువులకు సాగే లక్షణం చర్మానికి ఉండడం వల్ల దేహం పెద్దదవుతున్నా చర్మానికేమీ కాదు. కానీ బొద్దింకలు, పాములు, మొసళ్లు, తొండలు, కొన్ని తాబేళ్లు, కొన్నిరకాల ఎండ్రకాయలు, రొయ్యలు వంటివాటికి చర్మం సహజ కవచ కుండలాల్లా బిగుతుగా ఉంటుంది. తమ శారీరక ఎదుగుదలకు ఆ చర్మం ప్రతిబంధకంగా ఉన్నపుడు మనం బిగుతుగా ఉన్న పాత చొక్కాలను వదిలేసి, కొత్త చొక్కా వేసుకున్నట్టు అవి పాత చర్మాన్ని విసర్జిస్తాయి. పెరిగే క్రమంలో మెత్తని కొత్త చర్మాన్ని అంతరంగంలో సంత రించుకొంటాయి. ఇలా తమ ఎదుగుదల ఆగే వరకూ అడపాదడపా కుబుసం విడుస్తూ ఎదుగుతాయి.

No comments:

Post a Comment