Sunday 16 September 2012

జీవవైవిధ్యం.. సుస్థిరాభివృద్ధి..


భూగోళం వేడెక్కుతూ వాతావరణం మారుతున్న నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి ఒక ప్రధాన సమస్యగా మన ముందుకొచ్చింది. ఈ ఒడిదుడుకుల్ని తట్టుకోడానికి, అభివృద్ధిని కొనసాగించుకోడానికి కీలకమైంది జీవవైవిధ్యం. ఇప్పటి పరిస్థితుల్లో ఈ జీవవైవిధ్య పరిరక్షణ అతి ముఖ్యమైంది. సుస్థిరాభివృద్ధికీ, జీవవైవిధ్యానికీ గల అంతర సంబంధాల్ని నిశితంగా గుర్తించాల్సిన అవసరమూ ఉంది. ఈ లక్ష్యాలతోనే హైదరాబాద్‌లో అక్టోబర్‌లో 'జీవవైవిధ్యం-సుస్థిరాభి వృద్ధి' అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరగబోతుంది. ఈ నేపథ్యంలో 'జీవవైవిధ్యం.. సుస్థిరాభివృద్ధి..'లపై ఒక అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతో మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
భూగోళంలో వున్న భిన్న వృక్ష, జంతుజాతులు, ఆ జాతుల్లో వున్న మొత్తం తేడాలన్నింటినీ కలిపి జీవవైవిధ్యంగా పరిగణిస్తున్నాం. జీవావిర్భావం తర్వాత గత 3,500 కోట్ల సంవత్సరాలకుపైగా జరిగిన పరిణామక్రమంలో భాగంగా ఈ వైవిధ్యం రూపుదిద్దుకుంది. నిపుణుల అంచనా ప్రకారం భూగోళంలో భిన్నమైన, గుర్తించగల 100 నుండి 300 లక్షల వృక్ష, జంతుజాలాలు వున్నాయి. కానీ, వీటిలో ఇప్పటి వరకు అధ్యయనం చేసి, గుర్తించగలిగింది సుమారు 14.35లక్షల రకాలు మాత్రమే. వీటిలో అత్యధికంగా 7.51లక్షల రకాలు కీటకజాతి కి చెందినవి. ఆతర్వాత 2.81లక్షల జంతుజాతికి చెందినవి. ఉన్నత వృక్షజాతికి చెందినవి 2.48లక్షల రకాలు గుర్తించబడినవి. ఇక మిగ తావి ప్రోటోజోవా, ఆల్గేలు, ఫంజీ, బ్యాక్టీరియా తదితరాలు. అడవుల్లో కొత్తగా అధ్యయనం చేస్తున్న కీటకజాతుల్లో ఆరింటిలో ఐదు కొత్తరకా లుగానే గుర్తించబడుతున్నాయి. తద్వారా మనం గుర్తించిన జంతు జాలాల కన్నా ఇంకా గుర్తించాల్సినవే చాలా ఎక్కువగా వున్నాయని ఈ ధోరణి తెలుపుతుంది. ఇలా గుర్తించిన రకాలలో కూడా అంతర్గతంగా ఎంతో వైవిధ్యం గుర్తించబడింది. ఉదా: వరి శాస్త్రీయపరంగా ఒకే ఒక మొక్క. కానీ దీనిలో మన దేశంలోనే వేల రకాలు గుర్తించబడ్డాయి. ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొనే జీవప్రక్రియలో భాగంగా ఈ వైవిధ్యం రూపుదిద్దుకుంది. ఇప్పుడు మారుతున్న వాతా వరణ, పర్యావరణ ధోరణిని తట్టుకోవడానికి ఈ వైవిధ్యం ఎంతో ఉప యోగపడుతుంది. ఈ వైవిధ్యమే లేకుంటే భూగోళంలో ఏ చిన్న దుష్ప రిణామం వచ్చినా ఈ రకాలు అంతరించి, మానవ ఆహారలభ్యత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఎదురవుతున్న సవాళ్లు..
పరిణామక్రమంలో, ముఖ్యంగా మారుతున్న వాతావరణ, పర్యావరణ పరిస్థితులవల్ల, ఇతర కారణాల వల్ల కొన్ని జాతులు కొత్తగా పుట్టడం, మరికొన్ని అంతరించిపోవడం మామూలుగా జరిగేవే. గత 20 కోట్ల సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒకటిరెండు కొత్త రకాలు ఏర్పడుతున్నాయి. ప్రతి 10 లక్షల సంవత్సరాల్లో సుమారుగా 3, 4 కొత్త కుటుంబాలు రూపుదిద్దుకున్నాయి. సగటున ఒకోరకం జీవి 20 లక్షల నుండి కోటి సంవత్సరాలు ఉంటుందని అంచనా. అయితే, పెద్దఎత్తున జాతులు అంతరించిపోయిన సందర్భాలూ వున్నాయి. ఉదా: డైనోసార్‌. అతి పెద్ద జంతువు. 60 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఇలానే అంతరించిపోయింది. ఆధునిక కాలంలో మానవ కార్యక్రమాలు భిన్న జీవజాతుల కొనసాగింపును ప్రమాదంలో పడేస్తున్నాయి. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. పెద్దఎత్తున అంతరించిపోతున్న ఈ జంతుజాలాలకు ప్రధానకారణాలు..
. పెరుగుతున్న జనాభా..
మానవ జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రకృతి మీద ఆధారపడ టమూ పెరుగుతోంది. దీనికనుగుణంగా పెరుగుతున్న అవసరాల కోసం ఇతర జంతుజాలాల మీద దాడీ పెరుగుతోంది. గత 600 కోట్ల సంవత్సరాల్లో మానవాభివృద్ధిలో భాగంగా ఎన్నో అడవుల్ని నరికారు. పర్యావరణ పరిస్థితులూ మారాయి. దీంతో స్థానిక వాతా వరణ పరిస్థితులూ మారాయి. ఈ విధమైన కార్యక్రమాలు జీవ వైవిధ్యానికి పెద్ద ప్రమాదంగా కొనసాగుతున్నాయి.
. అధిక వేట..
దీని ఫలితంగా ఎన్నో వందలాది జంతువులు నశించిపోయాయి. మరెన్నో ఆ దిశలో వున్నాయి. ఆహారం, అలంకరణ, సరదా, లాభాల కోసం ఇలా ఎన్నో జంతుజాలాలు నశించిపోయాయి. ఇప్పుడు ఇలాంటి ఎన్నో జంతువుల్ని సంరక్షితశాలల్లో, ముఖ్యంగా జంతు ప్రదర్శనశాల, కృత్రిమంగా పెంచే అడవుల్లోనే చూడగలుగుతున్నాం.
. కనుమరుగు చేయబడుతున్న నివాసస్థలాలు..
అడవుల నరికివేత, గ్రామాల నిర్మాణం, వ్యవసాయభూములుగా మార్పు, మెట్ట భూముల్ని మాగాణీగా మార్చడం జీవవైవిధ్యాన్ని పెద్దఎత్తున దెబ్బతీస్తున్నాయి. ఉష్ణమండల అడవుల్లో 50 శాతం పైగా జీవవైవిధ్యం వుంది. అడవుల నరికివేత జీవవైవిధ్యాన్ని వేగంగా తగిస్తోంది.
. వలస తెచ్చిన జంతుజాలాలు..
మన అవసరాల కోసం ఎన్నో కొత్తరకాల్ని తీసుకొచ్చి స్థానికంగా పెంచుతున్నాం. ఇవి స్థానిక జంతుజాలాల్ని అంతరింపజేస్తున్నాయి. ఇలా ద్వీపకల్పాల్లో పెద్దఎత్తున జీవవైవిధ్యం అంతరించిపోయింది.
. కాలుష్యం.. వాతావరణమార్పులు..
కాలుష్యం, వాతావరణమార్పులు కూడా జీవవైవిధ్యాన్ని అంతరింపజేస్తున్నాయి.
. ఆధునిక ప్రజననం (బ్రీడింగ్‌) పద్ధతులు..
ఈ పద్ధతుల ద్వారా అధిక దిగుబడినివ్వగల కొత్తరకాల్ని రూపొం దించి, సేద్యం చేయడంతో పంటల్లో జీవవైవిధ్యం బాగా తగ్గిపోతుంది. వరి, గోధుమ, జొన్న, సజ్జ, రాగి తదితర ఆహారధాన్యాలు, నూనెగిం జలు, పప్పుధాన్యాలు తదితరాల్లో మనదేశంలోనే ఎంతో వైవిధ్యం వుం డేది. కానీ, ప్రజననం ద్వారా అధిక దిగుబడి వంగడాలు సేద్యంలోకి తెచ్చిన తర్వాత, వీటి జీవవైవిధ్యం బాగా కుదించుకుపోతున్నాయి. ఇప్పుడు పత్తి పైరులో కొన్ని వందల రకాలు మాత్రమే సేద్యం చేయ బడుతున్నాయి. గతంలో వేలాదిరకాలు సేద్యమయ్యేవి. తాజాగా, బిటి పత్తి ప్రవేశపెట్టిన తర్వాత సేద్యమయ్యేవి వందకుపైగా రకాలకే పరి మితమయ్యాయి. ఈ కొత్త రకాలు ఏ కొద్దిపాటి ఒడుదుడుకుల్ని తట్టు కోలేక అంతరించే ప్రమాదమూ ఉంది. ఈ విధంగా జీవవైవిధ్యాన్ని కోల్పోవడం మానవ మనుగడకు, సుస్థిరాభివృద్ధికి ప్రమాదకరం.
జీవవైవిధ్య కేంద్రాలు (బయోడైవర్సిటీ హాట్‌ స్పాట్స్‌)..
ఈ కేంద్రాలు జీవవైవిధ్యానికి నిలయాలు. కేవలం అదే ప్రాంతా నికి చెందిన జాతులతో నిండి, వాటి ఉనికి మానవ కార్యకలాపాల వలన ప్రమాదానికి లోనైతే అటువంటి ప్రాంతాన్ని 'జీవవైవిధ్య కేంద్రాలు'గా పేర్కొంటారు. ప్రపంచ జనాభాలో దాదాపు 20 శాతం ఈ ప్రాంతాల్లో నివసించడం వీటి విశిష్టత. భూ ఉపరితలంపై దాదాపు 12 శాతం మేర ఈ కేంద్రాలున్నాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు (అమెజాన్‌ అడవులు, మలేషియా దీవులు) జీవుల మధ్య వైవిధ్యానికి నిలయాలు. 'నార్మన్‌ మేయర్స్‌' అనే బ్రిటిష్‌ ఆవరణ శాస్త్రవేత్త తొలిసారిగా 1988లో 'హాట్‌స్పాట్స్‌' అనే పదాన్ని వాడాడు. 'వావిలోవ్‌' అనే రష్యన్‌ శాస్త్రవేత్త ప్రపంచవ్యాప్తంగా పలు జీవవైవిధ్య కేంద్రాలను గుర్తించారు. కనీసం 1500 పుష్పించే మొక్క ల జాతులు ఒక జీవవైవిధ్య కేంద్రంలో ఉండాలని కన్సర్వేషన్‌ ఇంట ర్నేషనల్‌ పేర్కొంది. ఇలా 25 కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. మనదేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రాధాన్యత..

మానవ మనుగడకు, అభివృద్ధికి ఎన్నో జంతుజాలాలను వినియోగించుకుంటున్నాం. ఈ జంతుజాలాల మనుగడ, కొనసాగింపు ఇతర జంతుజాలాలు, పర్యావరణం మీద ఆధారపడి వున్నాయి. ఈ గొలుసులో ఎక్కడ బంధం తెగినా మానవ మనుగడ ప్రమాదంలో పడవచ్చు. ఉదా: పెరుగుతున్న వృక్షజాతి సంతతి తమకవసరమైన నత్రజనిని నేరుగా సేకరించి, వినియోగించుకోలేదు. ప్రకృతిలో ఒకరకం బ్యాక్టీరియా (ఉదా: అజిటో బ్యాక్టర్‌) నత్రజనిని మొక్క వినియోగించుకోగల రూపంలోకి మారుస్తుంది. ఇదేవిధంగా మనం వేసే సేంద్రీయపు ఎరువుల్లోని నత్రజనిని నేరుగా మొక్కలు స్వీకరించలేవు. ఈ ఎరువులు చివికి దానిలోని సేంద్రీయ నత్రజని నైట్రేట్‌ రూపంలోకి మారిన తర్వాతనే మొక్కలు స్వీకరిస్తాయి. ఇదే విధంగా రసాయనిక ఎరువుల్లోని అమైడ్‌ లేక అమ్మోనియా రూపంలోని నత్రజని నేరుగా మొక్కలు వినియోగించుకోలేవు. వీటిని నైట్రేట్‌ రూపంలోకి మారిన తర్వాతనే మొక్కలు వినియోగించుకుంటాయి. ఈ మార్పులో కూడా బ్యాక్టీరియాలు ఇమిడి వున్నాయి. ఈ బ్యాక్టీరియా నేలలో లేకపోతే చెట్లు పెరగడం అసాధ్యం. ఫలితంగా, మానవ మనుగడ ప్రమాదంలో పడుతుంది. నేలల్లో నత్రజనిని చెట్లకు ఉపయుక్తంగా మార్చే బ్యాక్టీరియాల మనుగడ నేలలోని వాతావరణం మీద, ఇతర సూక్ష్మజీవుల మీద ఆధారపడి వుంది. ఇదేవిధంగా, పరపరాగ సంపర్కంలో పుష్పించి, ఫలాల్నిచ్చే ప్రక్రియలో ఎన్నోరకాల కీటకాలు కీలకపాత్ర వహిస్తాయి. ఈ కీటకాలు అంతరించిపోతే మనకు 'ఫలాలు' అందవు. ఆ మొక్కలు కూడా అంతరించిపోతాయి. అంతిమంగా మానవ మనుగుడ ప్రమాదంలో పడుతుంది. అందువల్ల, మానవ మనుగడ కొనసాగింపుకు భూగోళంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం, బాధ్యత నేడు మన ముందున్నది.
మనదేశంలో...
సుసంపన్నమైన జీవవైవిధ్యానికి, తరగని జీవ సంపదకు భారతదేశం నిలయం. పలురకాల ఆవాసాలకు, ఆవరణ వ్యవస్థలకు, వాటి వైవిధ్యానికి మనదేశం పెట్టింది పేరు. ఉష్ణమండల వర్షారణ్యాల నుండి, ఆల్పైన్‌, సమశీతోష్ణ అడవులు, తీరప్రాంత చిత్తడి అడవులు, మడ అడవులు ఇలా ఎంతో వైవిధ్యభరిత జీవావరణ వ్యవస్థల్ని ఇక్కడ చూడవచ్చు. దేశంలో ప్రధానంగా రెండు జీవవైవిధ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వైశాల్యంలో కేవలం 2.4 శాతం ఉన్న మనదేశంలో 7.3 శాతం జీవజాతులు (సుమారుగా 89,451 జాతులు) ఉండటం విశేషం. జీవ భూగోళ ప్రాంతాలు పది ఉన్నాయి. వీటిలో ఎడా రులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, ఉష్ణ, సమశీతోష్ణ అరణ్యాలు, గడ్డి మైదానాలు, నదీపరీవాహక ప్రాం తాలు, అర్చిపెలాగో ద్వీపాలు, మడ (మాంగ్రూస్‌) అడవులు ఇందుకు నిదర్శనాలు. ప్రపంచపు 18 స్థూల వైవిధ్యం ఉన్న దేశాల్లో మనదేశం ఒకటి. క్షీరదాల్లో 7.6 %, పక్షుల్లో 12.6%, సరీసృపాలు 6.2%, ఉభయచరాల్లో 4.4%, చేపల్లో 11.7%, పుష్పించే మొక్కల్లో 11.7% మనదేశంలోనే ఉన్నా యంటే జీవవైవిధ్యపరంగా మనదేశ ప్రాధాన్యతను అంచనా వేయవచ్చు. ఆసియా ఏనుగు, బెంగాల్‌ పులి, ఆసియా సింహం, చిరుత, రైనాసెరాస్‌ వంటి ఎన్నోరకాల ప్రత్యేక జాతులకు మనదేశం ప్రసిద్ధి. ఈ జీవ వైవిధ్య కేంద్రాల్లోనే మనం పండించే అనేకరకాల మొక్కలు ఉద్భవించాయి. రకరకాల పంట మొక్కల ఉద్భవానికి నిలయమైన 12 కేంద్రాల్లో మనదేశం ఒకటి. ఇంతటి గొప్ప జీవవైవిధ్య వనరులు క్రమంగా అదృశ్యం అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అందుకే ముఖ్య వనరుగా, సంపదగా ఉన్న మనదేశ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు ఈ జరగబోయే 'అంతర్జాతీయ జీవవైవిధ్య సమావేశాలు' స్ఫూర్తినిచ్చి, కార్మోన్ముఖులను చేస్తాయని ఆశిద్దాం.
సుస్థిరాభివృద్ధి..
పక్రృతి వనరుల వినియోగంలో భవిష్యత్తుతరాల అభివృద్ధి అవకాశాలను దెబ్బతీయకుండా ఇప్పటి అవసరాలను తీర్చుకోవడమే సుస్థిరాభివృద్ధి. దీనిలో పునరుత్పత్తి పొందలేని వనరుల (ఉదా: ఖనిజాలు) వినియోగం. పునరుత్పత్తి కాగల జీవవైవిధ్య వినియోగం, అనుకూల వాతావరణ పరిస్థితుల కొనసాగింపు ముఖ్యమైనవి.
విజ్ఞానం శాస్త్ర, సాంకేతికాలు అభివృద్ధి ద్వారా వచ్చిన పారిశ్రామిక విప్లవం తర్వాత అభివృద్ధి పేరుతో లేదా యుద్ధాలలో ప్రకృతివనరుల విధ్వంసం పెద్దఎత్తున కొనసాగుతుంది. దీనిని తక్షణ లాభాలకు ప్రాధాన్యత ఇచ్చే కార్పొరేట్‌ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వేగవంతం చేస్తుంది. ఫలితంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి కొనసాగింపు ప్రధాన సమస్యగా ముందుకొచ్చింది.
ఉత్పత్తిలో వినియోగించే సాంకేతికాలు అభివృద్ధి స్వభావాన్ని నిర్ధారిస్తాయి. పునర్వినియోగం (ఖనిజ మూలకం), పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణకు దోహదపడే సాంకేతికాలను హరిత సాంకేతికాలుగా వ్యవహరిస్తున్నాం. ఇవన్నీ సుస్థిరాభివృద్ధికి దోహదపడతాయి. అందువల్ల, సుస్థిరాభివృద్ధిలో జీవవైవిధ్య పరిరక్షణ కీలకపాత్ర వహిస్తుంది. దీనికోసం పర్యావరణ పరిరక్షణ, ముఖ్యంగా భూగోళం వేడెక్కడాన్ని నిలవరించడం, పునరుత్పత్తి కాగల ఇంధనాల వినియోగ పెంపు, కాలుష్యాన్ని నివారించగల సాంకేతికాలు, ఇంధన వినియోగ సామర్థ్యాన్ని పెంచే అన్ని సాంకేతికాలు అవసరమవుతాయి.

గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment