Friday 17 August 2012

యాగాలు-ఫలితాలు..


  • అశాస్త్రీయ ఆచారాలు16
'కాంతారావుగారూ! యాగాల వలన ఫలితాలు ఉంటాయా?' తిరుపతి నుండి 1.7.2012న మిత్రుడు రాజయ్య ఫోన్‌ చేశారు.
'యాగాలు అనే ప్రయోగాలు ఇటీవల మన రాష్ట్రంలో మూడుసార్లు జరిగాయి! ప్రకటించిన ఫలితాలేవీ రాలేదు' అన్నాను నేను.
'ఆ ప్రయోగాలు ఎప్పుడు, ఎక్కడ జరిగా యండీ?' మరల ప్రశ్నించారు రాజయ్య.
'చెబుతాను. మొదటిప్రయోగం 24.6. 2009 నుండి మూడురోజులు రాష్ట్రంలోని 1100 దేవాల యాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణయాగాన్ని నిర్వహించారు. యాగం తర్వాత వానలేమీ పడలేదు. ఇది మొదటి ప్రయోగఫలితం. రెండోసారి 2.7.2009 నుండి మూడురోజుల పాటు తిరుపతి, హైదరాబాదుల్లో 'అష్టోత్తర శతకుండాత్మక మహావరుణయాగం' పేరిట నిర్వహించబడింది. అయినా, వానలు కురవలేదు. దీనికి ఋజువు 9.7.2009 నాటి పత్రికల వార్తలు. ఆనాటి 'ఈనాడు' దినపత్రిక 'చినుకమ్మా! రాలమ్మా!' అనే శీర్షికతో వర్షాభావాన్ని వార్తగా ప్రచురించింది.
అలాగే 'డక్కన్‌ క్రానికల్‌' పత్రిక 'ఓన్లీ క్లౌడ్స్‌, నో రెయిన్స్‌' అనే శీర్షికతో ఫొటో సహా వార్తను మొదటిపేజీలో ఇచ్చింది. ఇది రెండోప్రయోగ ఫలితం.
మూడవ ప్రయోగం 2012 ఏప్రిల్‌ 21 నుండి మే 2 వరకు భద్రాచలంలో 'అతిరాత్ర యాగం' పేరు తో జరిపారు. దాని ఫలితం వానలు బాగా వస్తాయనీ, పంటలు బాగా పండుతాయనీ, అతిరాత్రం చివరి రోజున కుంభవృష్టి కురుస్తుందనీ ఒక కరపత్రంలో ప్రకటించారు. ఆ ప్రయోగ ఫలితమేమిటి?
ఈ ఏడాది ఏప్రిల్‌ 25,29 తేదీల్లో బీభత్సంగా గాలివాన కురిసి అరిటి, మామిడి, బొప్పాయి తోటలకు, అలాగే మిరప, వరి పంటలకు అపారనష్టం జరిగిందని (26/4 మరియు 30/4) నాటి పత్రికలన్నీ ఫొటోలతో సహా ప్రచురించాయి. ఇదేనా మంచివాన అంటే? ఇదేనా పంటలు బాగా పండుతాయనే ప్రచారానికి అర్థం? అన్నిటికంటే ముఖ్యంగా అతిరాత్రం చివరిరోజున ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. ఇదేనా కుంభవృష్టి అంటే? కాబట్టి, ఈ ప్రయోగంలో చెప్పిన ఏ ఒక్క ఫలితమూ రాకపోగా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇంతకీ మీరు ఈ యాగాలు, ఫలితా లను గూర్చి ఎందుకడిగారు?' అడిగాను నేను.
'ఏంలేదండీ! ఈ రోజు (జులై) నుండి 5వ తేదీ వరకూ దక్షిణ మండల విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో వరుణయాగం జరుగుతోంది. దాని ఫలితాలను గూర్చి మీ అభిప్రాయం తెలుసుకుందామ'ని జవాబిచ్చారు రాజయ్య.
'రాజయ్యా! నా అభిప్రాయం కాదిక్కడ కావల సినది. తిరుపతిలో 'వరుణ యాగం' అనే మరో ప్రయోగం జరుగుతోంది. దాని ఫలితాల కోసం వేచి ఉందాం' అని ఫోను పెట్టేశాను.
మరునాటి నుండి రాజయ్యకు రోజూ ఫోన్‌ చేస్తూనే ఉన్నాను. ఆయన అందించిన వివరాలే మిటి? 5వ తేదీ యజ్ఞం ముగిస్తే 8 వరకు చినుకు లేదు' 9, 10, 11 తేదీలలో రాత్రిపూట కొద్ది పాటి జల్లులు. 12న మాత్రమే మంచి వర్షం పడింది. 15-7-2012న విస్తారంగా వర్షాలు పడ్డాయని 16-7-2012 నాడు పత్రికలన్నీ మొదటిపేజీ వార్తలు ప్రచురించా యి. ఆ రోజున రాజయ్యకి ఫోను చేసి 'వరుణయాగాలు, అతిరాత్ర యాగాలను గూర్చి మీ అభిప్రా యం ఇప్పుడు చెప్పండి' అన్నాను.
ఆయన 'ప్రయోగ ఫలితాలే నా అభిప్రాయం. మీరు చెప్పిన ప్రకారం ఇటీవలి కాలంలో నాలుగు సార్లు యాగాల ప్రయోగం చేయబడింది. ప్రతిసారీ పండితులుగా చెప్పుకునేవారు చెప్పిన ఫలితాలకు వ్యతిరేక ఫలితాలే వచ్చాయి. వరుణయాగాల వలన వానలు పడలేదు. అతిరాత్రం వలన సువృష్టిగానీ, సస్య సమృద్ధిగానీ జరగలేదు. యాగం చివరిరోజున కుంభవృష్టి కురవలేదు; అసలు వానపడలేదు. కాబ ట్టి పై ప్రయోగాలన్నీ వరుణయాగాల వలన వానలు పడవనీ, అతిరాత్రం వలన మంచి వానలు పడవనీ, పంటలు పండవనీ నిరూపణైంది. అందువల్ల, ఈ ప్రయోగ ఫలితాలను అర్థంచేసుకని, అందరూ యాగాలను నమ్మడం మానుకుంటే చాలు' అన్నారు.
'ప్రయోగాల ద్వారా రుజువైన ఫలితాలను అంద రూ నమ్మేరోజు వస్తుందండీ' అన్నాను నేను. 'అలాగే ఆశిద్దాం' అని ఫోను పెట్టేశారు రాజయ్య.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment