Saturday 11 August 2012

‘మార్స్’లోనూ భారతీయ ముద్ర



హోస్టన్, ఆగస్టు 6: సృష్టికి మూలమైన దైవకణాన్ని కనుగొనే ప్రయత్నంలో నిరుపమాన పాత్ర పోషించిన భారతీయ శాస్తవ్రేత్తలు ఇప్పుడు అమెరికా అంగారకుడిని అందుకోవడంలోనూ నిరుపమాన కృషిని అందించారు. అంగారకుడిపై నీటి ఆనవాళ్ళను నిర్ధారించే లక్ష్యంతో ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్‌ను ఎక్కడ దించాలన్నదానిపై నాసా శాస్తవ్రేత్తలు తర్జనభర్జన పడుతున్న నేపధ్యంలో గేల్ క్రేటర్ స్థల నిర్దేశన చేసింది భారతీయ శాస్తవ్రేత్తే. గేల్ క్రేటర్ ప్రాంతంలో క్యూరియాసిటీ రోవర్‌ను దించితే తదుపరి పరిశోధనలకు మార్గం సుగమం అవుతుందని అలాగే అరుణ గ్రహాన్ని అన్ని కోణాల్లోనూ శోధించడం సాధ్యమవుతుందని సూచించింది భారతీయ శాస్తవ్రేత్త అమితాబ్ ఘోష్. నాసా మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ మిషన్‌లోని సైన్స్ ఆపరేషన్ల విభాగం అధిపతిగా ఘోష్ పనిచేశారు. క్యూరియాసిటీ రోవర్ భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో విజయవంతంగా దిగడం తమకు ఆనందాన్ని, విస్మయాన్ని కలిగించిందని స్పష్టం చేశారు. అసలు ఏమాత్రం పరిచయం లేని అంగారకుడి ఉపరితలంపై రోవర్‌ను దించడం అంటే మామూలు విషయం కాదని, మానవ సాంకేతిక నైపుణ్యానికి అద్భుతమైన మేథస్సుకు అది తార్కాణమేనని ఘోష్ తెలిపారు. గత ఆరేళ్ళుగా మార్స్ మిషన్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విజయం అమితానందాన్ని కలిగించిందని వెల్లడించారు. ఈ ప్రయోగం విఫలమయినట్టయితే ఆ తరువాత ఏమీ ఉండదని ఇప్పుడు విజయవంతం అయింది కాబట్టే ఈ రోవర్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలమన్నది అడుగడుగునా సవాళ్ళను విసిరేదేనని ఆయన వెల్లడించారు. గేల్ క్రేటర్ ప్రాంతంలో ఉన్న ఖనిజాలను, అక్కడ భూమి పొరలను, ఉపరితల తేమను అక్కడి మట్టిని పరిశీలించిన తరువాత ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరిగిందని, ఇది భూమి నుంచి 24 కోట్ల 78 లక్షల 38 వేల 976 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన వెల్లడించారు. తేమకలిగిన ఖనిజాలు చల్లదనం కలిగిన వాతావరణంలోనే ఉంటాయని గేల్ క్రేటర్ ప్రాంతంలో ఆ రకమైన వాతావరణం ఉన్నందునే ఈ పరిశోధనలు మరింత ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. భూమి మీద కూడా అనేక శిలల్లో తేమ ఉండడానికి వాటి పొరల్లో ఈ చల్లదనం ఉండడానికి కారణం నీరేనని అలాంటి నీరే అంగారకుడిపై ఉండడం వల్ల లేదా ఒకప్పుడు ప్రవహించడం వల్ల ఈ రకమైన తేమ ఏర్పడి ఉంటుందని ఘోష్ స్పష్టం చేశారు. ఈప్రాంతంలోని ప్రతిపొర కూడా ఎన్నో అద్భుతాలకు నిలయమే కాబోతోందని ఆ విధంగా కుజ గ్రహానికి సంబంధించి ప్రతి విషయాన్ని ఈ రోవర్ అందించబోతోందని తెలిపారు. అంగారక గ్రహంపై జీవరాశి మనుగడగు ఆస్కారం ఉందా లేదా అనే వౌలిక ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికే క్యూరియాసిటీ రోవర్‌ను పంపారు.
మా సాంకేతిక ప్రగతికి నిదర్శనం: ఒబామా
వాషింగ్టన్: క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా చేరుకోవడాన్ని అమెరికా అద్భుత సాంకేతిక ప్రగతికి నిదర్శనమని అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని సాధించినందుకు నాసా శాస్తవ్రేత్తలను అభినందించిన ఆయన ‘ఈ నిరుపమాన సాంకేతిక విజయం ద్వారా అమెరికా జాతీయ గౌరవాన్ని, ఘనతను సుదూర భవిష్యత్‌కు తీసుకెళ్లారు’ అని అన్నారు. ఇంతవరకూ కనీవినీ ఎరుగని సాంకేతిక సంపత్తితో రూపొందిన ఈ రోవర్ అమెరికా సాధించిన సాంకేతిక నైపుణ్యానికి తలమానికం లాంటిదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా అమెరికా స్థాయి విజయాలు అంత సులభం కాదన్న వాస్తవం ఈ ప్రయోగంతో రుజువైందని వ్యాఖ్యానించారు.
అమెరికా సృజనాత్మకతకు, సాంకేతిక విస్తృతికి ఎవరూ సాటిలేరని, ఎన్ని అవరోధాలు ఎదురైనా తమదే పైచేయి అవుతుందన్న వాస్తవానికి ఈ ప్రయోగ విజయమే నిదర్శనమని వెల్లడించారు. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి శాస్తవ్రేత్తనూ ఆయన ప్రశంసించారు.

No comments:

Post a Comment