Wednesday 1 August 2012

యాంటిబయాటిక్స్‌ విఫలం.. ప్రత్యామ్నాయాలు..

అనుకోకుండా 1928లో గుర్తించిన 'పెన్సిలిన్‌' అంటురోగాల (ఇన్‌ఫెక్సువస్‌ డిసీజెస్‌) చికిత్సను సులువుగా మార్చింది. కానీ, దీనిని పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన నాలుగు సంవత్సరాలలోనే 'స్టాఫిలోకోకస్‌ ఆరియన్‌' అనే బ్యాక్టీరియాలో పెన్సిలిన్‌కు నిరోధకశక్తి వచ్చిందని 1947లోనే గుర్తించారు. అప్పటి నుంచి అంటురోగాల చికిత్సకు కొత్త కొత్త మందులను రూపొందించే పరిశోధనలు తీవ్రమయ్యాయి. దీనితో ఈ కొత్త మందులకు కూడా రోగక్రిముల నిరోధకశక్తి వేగంగా పెరుగుతోంది. అయితే, ప్రపంచ వాణిజ్యసంస్థ వల్ల మేధో సంపత్తి హక్కుల సమస్య తీవ్రంగా ముందుకొచ్చిన తర్వాత కొత్తమందుల రూపకల్పన పరిశోధనల వేగం తగ్గిపోయింది. ఇదే సమయంలో మందుల కంపెనీలు కూడా అధికలాభాలను తెచ్చే దీర్ఘకాలిక రోగాల చికిత్స మందులపైనే పరిశోధనలను కేంద్రీకరిస్తున్నాయి. అంటురోగ చికిత్సకవసరమైన కొత్త మందుల పరిశోధనలకు ప్రాధాన్యతనివ్వడం లేదు. ఫలితంగా, ఎప్పుడో నియంత్రణలోకి వచ్చాయని భావిస్తున్న సాధారణ అంటురోగాలు, ముఖ్యంగా క్షయ (టిబి), మలేరియా వంటివి తిరిగి పుంజుకుంటున్నాయి. నయం కావడం లేదు. ఇవి మరణ కారకాలగానూ మారుతున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకునే అవసరం వచ్చింది. కొత్తమందుల పరిశోధనలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరమూ ఏర్పడింది. మందుల పరిశోధనలో మన దేశానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని పరిరక్షించుకుంటూనే చౌక మందుల ఉత్పత్తి, సరఫరాలకు నాయకత్వం వహించాల్సిన అవసరం వుంది. ఈ నేపథ్యంలో 'చికిత్సలో యాంటిబయాటిక్స్‌ విఫలం.., ప్రత్యామ్నాయాల'ను క్లుప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
యాంటిబయాటిక్‌ (సూక్ష్మజీవ నాశని) మందు నిరోధకశక్తి పరిణామాత్మకంగా వస్తుంది. ఈ మందు కలియక వల్లనే సూక్ష్మజీవిలో నిరోధకశక్తి రూపొందాలనే నియమమేమీలేదు. బ్యాక్టీరియాలో సహజంగానే మందుల్ని తట్టుకునేశక్తి ఉండవచ్చు. లేదా పర్యావరణ వత్తిళ్ల వల్ల ఈ శక్తి కలగవచ్చు. నిరోధకశక్తిని కలిగించే ఈ జన్యువులు అదే జాతికి చెందిన మందు పనిచేసే బ్యాక్టీరియాలో ప్రవేశించినప్పుడు, ఆ బ్యాక్టీరియాకు కూడా మందుల నిరోధకశక్తి కలుగుతుంది.పెన్సిలిన్‌ చికిత్స కనుగొనక ముందే బ్యాక్టీరియాలో పెన్సిలిన్‌ నిరోధకశక్తి ఉన్నట్లు గుర్తించారు. జన్యువులలో సహజంగా వచ్చే మార్పులు లేదా సహజంగానే ప్రకృతిలో ఉత్పత్తయ్యే 'బ్యాక్టీరియా నాశిని' వల్ల ఈ నిరోధకశక్తి కలగవచ్చు. వైద్యం, ఇతర రంగాలలో విస్తారంగా వాడబడుతున్న యాంటిబయాటిక్‌ మందులు కూడా నిరోధకశక్తిని వ్యాపింపజేస్తున్నాయి. ముఖ్యంగా, విచక్షణారహితంగా యాంటి బయాటిక్‌ మందులను వాడినప్పుడు సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తిని పెంచుతాయి. చికిత్సలో ఒకే ఒక డోసు మందును వాడినప్పుడు నిరోధకశక్తి ఉద్భవించే అవకాశం ఎక్కువగా ఉంది. వైద్యులు సూచించిన మోతాదు సరిగ్గాలేకున్నా లేక సూచించిన మోతాదులోనే మందును వాడకపోయినా నిరోధకశక్తి రావచ్చు. ముఖ్యంగా తక్కువ మోతాదులో దీర్ఘకాలం వాడే యాంటిబయాటిక్‌ మందులు నిరోధకశక్తిని పెంచుతాయి. మామూలుగా అవసరమైన మోతాదులో 72 గంటలు (3 రోజులు) వాడితే నిరోధకశక్తి రాదని వైద్యశాస్త్రం భావిస్తుంది.
జంతువుల పాత్ర..
కోళ్లు, ఇతర పశువులు, జంతుజాలాలకు దాణాతో కలిపి మందులు వాడినప్పుడు, ఆ మందులు వాటి జీర్ణకోశంలోకి ప్రవేశిస్తాయి. ఆ జీవాల్లోని సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తిని కలిగిస్తాయి. జీవాల శరీరంలో అవశేషాలుగా మిగిలిపోతాయి. వీటి ఉత్పత్తులను ఆహారంగా తీసుకున్నప్పుడు మన శరీరంలోకి మందు ప్రవేశించి, మనలో నిరోధశక్తిని కలిగించవచ్చు. అయితే, జీవాల ఆహారంలో వాడే యాంటిబయాటిక్స్‌ మందులపై నియంత్రణ అమెరికాలాంటి దేశాల్లో కూడా లేదు. ఫలితంగా ఈ జీవాల ఉత్పత్తుల్ని వాడినప్పుడు మానవుల్లో నిరోధకశక్తి కలుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ అన్నిరకాల పశుదాణాల్లో యాంటిబయాటిక్స్‌ మందుల్ని ఎదుగుదల వేగానికి వాడరాదని, ఆపేయాలని సూచించింది.

దీనితో ఇప్పుడు అసలు యాంటిబయాటిక్స్‌ కలపని ఆహారంతో పెరిగిన పశు ఉత్పత్తులు ఇపుడు ప్రత్యేకంగా మార్కెట్‌లోకి వస్తున్నాయి.
అమెరికాలో వినియోగపడే యాంటిబయాటిక్స్‌లో 70 శాతం పశుదాణాలో కలపబడుతున్నాయి. ఫలితంగా, వీటికి నిరంతరం చికిత్సకన్నా తక్కువ మోతాదులో ఈ యాంటిబయాటిక్స్‌ అందుతున్నాయి. ఇది వాటి సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తిని వేగంగా పెంచుతుంది. ఈ విధంగా యాంటిబయాటిక్స్‌ను వాడటం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య, మొత్తం మీద తగ్గనప్పటికీ, వాటి మిశ్రమ స్వభావంలో మార్పులొస్తున్నాయని పలు సందర్భాలలో గమనించారు. ఈ పదార్థాలను మనం తిన్నప్పుడు ఈ మందు అవశేషాలు మన శరీరంలో ప్రవేశిస్తాయి. తద్వారా మన జీర్ణకోశ సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తి పెరుగుతుంది. ఈ అనుభవాల నేపథ్యంలో, పౌల్ట్రీ, పశుపోషణలో వాడే దాణాలో యాంటిబయాటిక్స్‌ వినియోగాన్ని నియంత్రిస్తూ జాగ్రత్త వహించాలి.
మన దేశంలో పశువుల పాల ఉత్పత్తిని పెంచడానికి ఆక్సిటోసిన్‌ అనే మందును అక్రమంగా ఇంజెక్షన్‌ రూపంలో వాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీని వినియోగం మన దేశంలో నిషేధించినప్పటికీ అనైతికంగా ఇది కొనసాగుతుంది. పాలనా యంత్రాంగం దీన్ని నివారించలేకపోతుంది. ఇది మన ఆరోగ్యంపై దుష్ప్రభావాల్ని కలిగి ఉంది.
నిరోధకశక్తి ఆవిర్భావం...
సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తి కింది పద్ధతుల్లో ఆవిర్భవించవచ్చు.
* ప్రకృతి ఒత్తిళ్ల వల్ల వచ్చే మార్పులు బ్యాక్టీరియా జన్యువుల్ని మార్చుతాయి. తద్వారా నిరోధకశక్తి గల జన్యువులు రూపొందుతాయి. ఈ జన్యువులు మందు పనిచేసే ఇతర బ్యాక్టీరియాల్లోకి ప్రవేశించి, ఆ కణాలలో నిరోధకశక్తిని కలిగిస్తాయి.
* జన్యుమార్పిడి (జీన్‌ ట్రాన్సఫర్‌): మందులకు ప్రభావితం కాగల సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తి కలిగున్న సూక్ష్మజీవుల జన్యువు ప్రవేశం ద్వారా నిరోధకశక్తి పొందవచ్చు.
* ప్రత్యేక ఎంజైమ్‌: దీని ఉత్పత్తి వల్ల మందులకు నిరోధకశక్తి ఏర్పడవచ్చు.
* సూక్ష్మజీవుల్లోకి మందులు ప్రవేశించే కణ స్థావరాలలో జరిగే మార్పుల వల్ల మందు పనిచేయకపోవచ్చు.
* జీవక్రియ (మెటబాలిజం) మార్గంలో జరిగే మార్పుల వల్ల కూడా నిరోధకశక్తి ఏర్పడవచ్చు.
* సూక్ష్మజీవుల కణాల్లోకి మందు ప్రవేశానికే అడ్డంకులు ఏర్పడవచ్చు.
మీకు తెలుసా..?
* 'సూక్ష్మజీవి నాశిని - యాంటిబయాటిక్‌' :ఇది గ్రీకు పదం నుండి వచ్చింది. 'యాంటి' అంటే 'ఎదుర్కొనేది'. 'బయాస్‌' అంటే 'జీవం'. యాంటిబయాటిక్‌ అంటే జీవాన్ని ఎదుర్కొనేది.
* ప్రకృతిలో సహజంగా మందు పనిచేయగల, చేయని సూక్ష్మజీవులు కలిసి ఉంటాయి. కానీ, మందు పనిచేసే సూక్ష్మజీవులే అధికంగా ఉంటాయి.
* మొదటి యాంటిబయాటిక్‌ 'పెన్సిలిన్‌' సర్‌ అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ 1928లో కనుగొన్నారు.
* బ్యాక్టీరియా సంక్రమణ రోగాల చికిత్సకు వాడే మందును యాంటి బ్యాక్టీరియల్స్‌ అంటారు.
* క్షయ (టిబి), అతిసార, సిఫిలిస్‌, మెదడువాపు వ్యాధులు బాక్టీరియాల వల్ల వస్తాయి.
* అన్ని బ్యాక్టీరియాలు జబ్బుల్ని కలిగించవు. కొన్నే కలిగిస్తాయి. మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాలూ ఉన్నాయి.
* యాంపిసిల్లిన్‌, ఎమోక్జో సిల్లిన్‌, బెంజైల్‌ పెన్సిలిన్‌ మందులు పెన్సిలిన్‌ జాతికి సంబంధించినవి. ఇవి ఎన్నో రకాల సంక్రమణ జబ్బుల చికిత్సకు ఉపయోగపడతాయి.
* వైరస్‌ జబ్బులకు యాంటిబయాటిక్‌ మందులు పనిచేయవు.
* సాధారణ జలుబు, తుమ్ములు వంటివి వైరస్‌ల వల్లే వస్తాయి. వీటికీ యాంటి బయాటిక్‌ మందులు పనిచేయవు. వారంరోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి.
డాక్టర్‌ మాదాబ్‌ కె.ఛటోపాధ్యాయ
సిసిఎంబి, హైదరాబాద్‌.

No comments:

Post a Comment