Wednesday 22 August 2012

మూఢనమ్మకాలుంటే నష్టాలేంటి?-1

  • అశాస్త్రీయ ఆచారాలు17
ఇటీవల మా ఇంటికి మా మిత్రుడి కుమారుడు సిద్ధూ వచ్చాడు. అతనితో అతని స్నేహితుడు కిషన్‌ కూడా వచ్చాడు. కొంతసేపటికి సంభాషణ మూఢనమ్మ కాలవైపు మళ్లింది. అప్పుడు వాళ్లకి నేను రాసిన 'మూఢ విశ్వాసాలు-సైన్సు సమాధానాలు' పుస్తకమిచ్చి, 'తీరిగ్గా ఉన్నప్పుడు చదవండయ్యా!' అన్నాను. అదిచూసిన కిషన్‌ ఇలా అన్నాడు. 'అంకుల్‌! మాకిప్పుడు కావల సింది మా సబ్జెక్ట్స్‌లో మంచిమార్కులు. వాటికోసం క్లాసు పుస్తకాలు బాగా చదవాలి. తర్వాత ఇంటర్వ్యూ లలో బాగా సమాధానాలివ్వడానికీ, వృత్తిలో రాణించ డానికీ మంచి వ్యక్తిత్వం కావాలి. దానికోసం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలి. అంతేకానీ, ఇలాంటి విషయాలు మాకెందుకు? మాకు మూఢనమ్మకాలుంటే నష్టమేంటి? ఇవి చదువులోగాని, వృత్తిలోగాని రాణించ డానికి ఏమైనా ఉపయోగపడతాయా?' నేను ఆ ప్రశ్న లకు ముందుగా ఆశ్చర్యపోయినా, తర్వాత ఆనందించి ఇలా అన్నాను. 'కిషన్‌! నీవు ఈ ప్రశ్నలు వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?' అని అడిగాను. 'ఉంది అంకుల్‌! చెప్పండి వింటాను' అన్నాడు కిషన్‌.
'అసలు మూఢనమ్మకాలంటేనే నమ్మినవారినీ, నమ్మనివారినీ మానసికంగా, ఆర్థికంగా నాశనం చేసే వని అర్థంచేసుకో. అనేకసార్లు మూఢనమ్మకాలు ప్రాణాల్నే హరిస్తున్నాయి. వాటిని వివరంగా చెబుతా విను. వాస్తు అనేది ఒక మూఢనమ్మకం. దానిని నమ్మి నవారు లక్షలాదిమంది మనదేశంలో ఉన్నారు. ఆ నమ్మ కంతో వారు ఇళ్ళు కూలగొట్టుకుంటున్నారు. ఆస్తులు నాశనం చేసుకుంటున్నారు. ఉదా: ఒక పత్రికలో పాఠ కుడు వేసిన ప్రశ్న, దానికి వాస్తువాది సమాధానాన్ని 'ప్రజాశక్తి' 7-7-2002న పునర్ముద్రించింది. ప్రశ్న:'అయ్యా! నా ఇంటి ఉత్తర ప్రహరీగోడకు ఉత్తర ఈశాన్యంలో గేటు, ఉత్తర వాయువ్యంలో ఇంకో గేటుంది. నా ఇంటికి తూర్పు ఆగేయంలో లోతైన అండర్‌ గ్రౌండ్‌ సంపు ఉంది. ఆగేయంలో ఎత్తయిన బిల్డింగ్‌ కూడా ఉంది. నైరుతిభాగాన నా స్థలంలో మొయిన్‌ గృహానికి తగలకుండా ఉపగృహం నిర్మించాం. ఆ ఉపగృహానికి అండర్‌గ్రౌండ్‌ సెల్లార్‌ నిర్మించాం. మా పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారిపోయింది. కావునా తాము ఏమార్పులు చెప్పినా చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి చెప్పండి.
సిద్ధాంతి సమాధానం:శ్యామ్‌గారూ! సర్వరోగాలూ ఒకే మనిషికుంటే ఎలా ఉంటుందో అలా మీ ఇంటి అవలక్షణాలు కన్పిస్తున్నాయి. కాబట్టి చాలామార్పులు చేయించుకోవాల్సి ఉంటుంది. తూర్పుఆగేయంలో అండర్‌ గ్రౌండ్‌ సంపుందని చెబుతున్నారు. ఆగేయంలో ఎత్తయిన భవనమూ ఉందన్నారు. ఈ రెండూ అతి భయంకరమైనవి. రోజురోజుకూ శత్రువుల్ని అభివృద్ధి చేస్తాయి. కాబట్టి తూర్పు ఆగేయంలో ఉండే సంపును తీసేసి తూర్పు ఈశాన్యంలో అమర్చుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఆగేయంలో ఎత్తయిన భవనాన్ని కూలగొట్టాలి. నైరుతిలో సెల్లార్‌ చాలా ప్రమాదకారి. కాబట్టి ఆ సెల్లార్‌ను పూడ్చేయాలి. ఇంటికి ఖాళీస్థలాలు ఎటువైపు ఎంతున్నాయో మీరు రాయలేదు. ఖాళీ స్థలాలనుబట్టి ఉచ్ఛనీచాలను నిర్ణ యించగలం. అందువల్ల మీరు వివరంగా మరో లెటరు రాస్తే ఇంకా ఏ ఏమార్పులు చేసుకోవాలో చెబుతాను.
వీటిని పునర్ముద్రించి, ప్రజాశక్తి పత్రిక చివరిలో ఇలా వ్యాఖ్యానించింది.. 'ఏ ఇల్లయినా గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తూ ఆహ్లాదకరంగా ఉండాలి. అలా ఉంటే, అందులో నివాసం ఉండేవారి మనసులు ఉల్లా సంగా ఉంటాయి.అప్పుడే వారి భవిష్యత్తుకూ ఉజ్జ్వల మైన బాటలు వేసుకుంటారు. కానీ వాస్తుతోనే గీత మారుతుందని గుడ్డిగా నమ్మితే అధోగతే!'
అలా వాస్తును గుడ్డిగా నమ్మిన ఒక ధనవంతుడు ఆస్తి పోగొట్టుకున్నాడు. ఆ విషయాన్ని స్వామీ జగదా నంద అనే స్వామీజీ తాను రాసిన 'ఆస్పిషస్‌ వాస్తు' అనే పుస్తకంలో ఇలా వివరించారు.
ఒక ఊళ్ళో రెండు గ్రానైట్‌ఫ్యాక్టరీలు, రెండు పత్తి ప్రాసెసింగ్‌మిల్లులు ఉన్న వ్యాపారి మరింత ధనం సంపాదిద్దామని ఒక వాస్తువాదిని సంప్రదించాడు. అతడు అతనింటికి అనేక మార్పులు సూచించాడు. అన్నీ చేశాడు. దానికి చాలా ఖర్చయి, అప్పులపాల య్యాడు. దీంతో పత్తి మిల్లొకటి అమ్మి, మరొకటి లీజుకీ యాల్సి వచ్చింది. ఆ ధనికుడు వాస్తుతో ఎంత బాధ అనుభవించాడంటే తన ఇంటి ముందు 'ఇచ్చట వాస్తు వాదులకు ప్రవేశంలేద'ని బోర్డుపెట్టాడు.' (పే: 5, 6)
'ఇది నేడు లక్షలాది ప్రజల స్వానుభవం. వాస్తు పేరుతో ప్రజలు ప్రతి ఏడాది రూ15వేల కోట్లు నాశనం చేసుకుంటున్నారని ఒక స్వచ్ఛందసంస్థ అంచనా. ఇప్పు డు చెప్పు. నీవు బాగా చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించినా, వాస్తు అనే మూఢనమ్మకం ఉంటే ఆస్తిని పోగొట్టుకొనే ప్రమాదం లేదా? అలాగే జ్యోతిష్యం విషయం చెప్తాను.' అన్నా.
(ఆ వివరాలు పైవారం తెలుసుకుందాం!)

ఆంధ్రజ్యోతి దినపత్రిక 13.4.2012 నాటి సంచికలో ప్రచురింపబడిన 'నాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పరూ?' అనే శీర్షికతో వచ్చిన ఒక వ్యాసాన్ని చూపించాను. ఆ వ్యాస రచయిత ఎమ్‌.టెక్‌; ఎమ్‌.బి.ఏ. చదివాడు. వయస్సు 36. అతనికి 26వ ఏటి నుంచి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అయినా ఇంకా పెళ్ళికాలేదు. దానికి కారణం అతని మాటల్లోనే విందాం. 'నాకు పెళ్ళి చేసుకోవాలనుంది. అందరిలాగానే బతకాలని ఉంది. అలా బతకటానికి అవసరమైన ఉద్యోగం ఉంది. దాచుకున్న డబ్బు కూడా ఉంది. అయినా నాకు జాతకాల వల్ల పెళ్ళి కావడంలేదు.' అతని తండ్రి జాతకాలు చూస్తాడట. ఆయనకు తన పిల్లవాడికి సరిజోడీ జాతకం గల పిల్ల దొరకలేదట. అదీ అసలు విషయం. ఇలా జాతకాల పిచ్చివల్ల చదువూ, ఉద్యోగం ఉన్న ఎంతోమందికి పెళ్ళికావడం లేదు. ఇదంతా జ్యోతిష్యం అనే మూఢనమ్మకం వల్లనే గదా?
ఇక మూఢ నమ్మకాల వలన ప్రాణాలు పోగొట్టుకున్న అనేకమందికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నీకు వినిపిస్తాను. విను.
(1) గ్రామ దేవతకు తనయుడిని బలిచ్చిన తండ్రి (వార్త 23-11-1999)
కొడుకు వల్ల తమ కుటుంబానికి కీడు ఉందని నమ్మి, మూఢ విశ్వాసంతో కన్న కొడుకునే ఒక తండ్రి బలిచ్చాడట.
(2) మూఢనమ్మకానికి ఒకరి బలి (ఆంధ్రజ్యోతి 23-9-1994)
వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుంటే, స్థానిక ఆర్‌.ఎమ్‌.పి. డాక్టరు భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చినా, రోగి బంధువులు రోగిని భద్రాచలం తీసుకెళ్ళకుండా తమ గ్రామానికి తరలించి భూతవైద్యం చేయించగా పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు.
(3) మంత్రగాడనే నెపంతో హత్య (ఈనాడు 1-7-1996)
చేతబడి చేసి కుటుంబసభ్యులను వేధిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని చంపి శవాన్ని పాతిపెట్టిన సంఘటన గార్ల మండలం పుల్లూరులో జరిగింది.
(4) అమ్మాజీ ముసుగులో కోట్లు శఠగోపం (ప్రజాశక్తి 6-6-2008)
మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటూ ఓ మహిళ అమ్మాజీ పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు దండుకుంది.
(5) గుప్త నిధుల కోసం భర్త హత్య (సాక్షి 29-5-2009) గుప్త నిధులపై ఆశతో ఓ ఇల్లాలు భర్తనే హత్య చేసింది.
(6) వివాహితను కొట్టి చంపిన భూతవైద్యుడు (ఈనాడు 28/2/2002)
ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన ఒక వివాహితను దయ్యం వదిలించే నెపంతో భూతవైద్యుడు, అతని అనుచరులు తీవ్రంగా కొట్టగా ఆమె మరణించింది.
(7) వాస్తుపేరిట లక్షలు ఖర్చు చేస్తున్న సింగరేణి (ఈనాడు 12-3-1998)
సింగరేణిలో ఇటీవలి కాలంలో వాస్తుపేరిట గదుల కిటికీలను, తలుపులను, అవసరమైతే విలువైన కట్టడాలను సైతం కూల్చివేసి లక్షల రూపాయలను దుబారా చేస్తున్నారని పత్రికా వార్త తెలియజేస్తోంది.
(8) 16.2.2007 నాటి ప్రజాశక్తిలోని యీ వార్త విను.
ఓ 29 ఏళ్ళ యువతి ఇల్లు కొనాలనుకుంది. తన జాతకం తీసుకొని ఓ పండితుడనే మోసగాడి దగ్గరకు వెళ్ళింది. అతను 'మనమిద్దరం క్రితం జన్మలో భార్యాభర్తలం. నీవు ఆత్మహత్య చేసుకున్నావు. అందుకే ఇలా మనిద్దర్నీ ఆ దేవుడు కలిపాడు. నీ భర్తకు విడాకులిచ్చి నాతోరా!' అన్నాడు. నా మాట వినకపోతే, నీవు పూర్తిగా నాశనమౌతావు' అని భయపెట్టాడు. ఆమె అతని వల్ల గర్భవతి అయి అబార్షన్‌ చేయించుకుంది. ఇది ఎక్కడో పల్లెటూర్లో జరిగింది కాదు. వారిద్దరూ భారతీయులే. ఆమె తమిళ వనిత. లండన్‌లో జాబ్‌ చేస్తోంది. అతను లండన్‌లో ఒక గుడి పూజారి. ఈ సంఘటన లండన్‌లో జరిగింది.
(9) శృతిమించిన మూఢభక్తి - చితిపేర్చుకొని ఇద్దరు సజీవ దహనం (సాక్షి 24-2-2009)
ఆదిలాబాద్‌ జిల్లా జైనూరు మండలం శివనూర్‌ గోండుగూడకు చెందిన ఇద్దరు శివభక్తులు మహాశివరాత్రికి కొన్నిరోజుల ముందు గ్రామ సమీపంలో గుడిసె వేసుకొని, అక్కడే శివలింగాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేయడం మొదలెట్టారు. మహాశివరాత్రి నాడు శివుడు ప్రత్యక్షమౌతాడనీ, అలా ప్రత్యక్షం కాకపోతే, తామే శివుడి దగ్గరకు వెళ్ళి పునర్జన్మ సాధిస్తామని ఇతర భక్తులతో అనేవారు. ఇందుకు ఉదాహరణ శివలీలామృతం అనే గ్రంథంలో ఉందనీ, అందులో ఒక రుషి శివుణ్ణి పూజిస్తూ సజీవదహనమయ్యాడనీ, తద్వారా పునర్జన్మ సాధించడనీ రాసి ఉన్నట్లు ఇతర భక్తులకు చెప్పేవారు. మహాశివరాత్రినాడు, రాత్రిపూట ఇతర భక్తులను ఇళ్ళకు పంపి, వారు అక్కడే ఉన్న కట్టెలను చితిగా పేర్చుకొని ఆత్మాహుతి చేసుకున్నట్లు అక్కడి ఆనవాళ్ళను బట్టి తెలుస్తోందని పత్రికావార్త తెలియజేస్తోంది.
కిషన్‌! బాగా చదువు, మంచి ఉద్యోగం ఉన్నా, మూఢనమ్మకాల వలన ఎన్ని నష్టాలున్నాయో తెలుసుకున్నావు గదా? మూఢనమ్మకాలున్న వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇతరుల జీవితాలు నాశనం చేస్తాడు. లక్షలాది రూపాయల ధనం నాశనం చేసుకుంటాడు. ఇతరుల ధనం నాశనం చేస్తాడు. అందుకూ మూఢనమ్మకాలకు సంబంధించి సైన్సు చెప్పే సమాధానాలను చదివి, అర్థంచేసుకుని, నీకూ, నీ సమాజానికీ మేలు చేకూరేట్లు నడుచుకోమని కోరాను. అర్థమైందా?' అని ముగించాను.
'అర్థమైంది అంకుల్‌!' అంటూ కిషన్‌ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment