Wednesday 4 July 2012

జనవిజ్ఞాన వేదిక హిందుమతానికీ హిందూ దేవుళ్లకీ వ్యతిరేకమా?


              జనవిజ్ఞాన వేదిక హిందూ మతానికీ హిందూ దేవుళ్లకీ వ్యతిరేకమా? ఇతర మతాల వారికి అనుకూలమా? ఆ మధ్య రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కొబ్బరికాయలు, పూజాసామగ్రికి ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసిందని, అలా ప్రభుత్వ ఖర్చు మత కార్యక్రమాలకు ఉపయోగించవద్దని జనవిజ్ఞాన వేదిక వారు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. కానీ ప్రతి సంవత్సరం ముస్లిం సోదరుల మక్కాయాత్రకు ప్రభుత్వం రాయితీలు ఇస్తే మీరు ఎందుకు స్పందించడం లేదు? - జి.దినేష్‌కుమార్‌గుప్తా, మలక్‌పేట, హైదరాబాద్‌
              జనవిజ్ఞాన వేదిక ఓ మంచి అభ్యుదయ సంస్థ. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కల్గించడానికి, నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాస్త్రీయ కారణాలను విశ్లేషించి ఆ సమస్యల నివృత్తికి శాస్త్రీయ పరిష్కారమార్గాలను అన్వేషించి ప్రజల్లో ప్రచారం చేసే మంచి సంస్థ. ప్రజల మధ్య సామరస్యాన్ని, సోదర భావాన్ని కల్గించుతూ వారి సర్వతోముఖాభివృద్ధి కోసం తహతహలాడే నిజమైన సామాజిక సేవాతత్పరతగల స్వచ్ఛంద సంస్థ అది. మన భారత రాజ్యాంగంలోనే శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించడం, ప్రశ్నించే హేతు బద్ధ వైఖరిని అలవర్చుకోవడం, పర్యావరణ పరిరక్షణకు జీవవైవిధ్యం కొనసాగింపునకు తనవంతు కృషి చేయ డం, మానవతా దృష్టితో మెలగడం.. ప్రతి భారతీయ పౌరుని ప్రాథమిక బాధ్యతగా పేర్కొనబడి ఉంది.

             భారత సమాజాన్ని నడిపించే మన రాజ్యాంగంలోని ప్రధాన తాత్వికతల్లో 'మన రాజ్యం మత ప్రసక్తిలేని లౌకిక, సమసమాజ సార్వభౌమ్యం (Secular, Socialist, Soverign State) గా ప్రకటించుకొన్నాం. ఇలాంటి అత్యున్నత ఆదర్శాలతో మన సమాజాన్ని ఆదేశిస్తున్న భారత రాజ్యాంగ ఆదేశాల పరిధిలో ఆ ఆశయాల అనువర్తనానికి కృషి చేస్తున్న జన విజ్ఞానవేదికలో మీరూ భాగస్వాములై ఆ సంస్థ చేపట్టే కార్యకలాపాలను దగ్గరగా చూసినట్లయితే మీరీ అభిప్రాయం వెలిబుచ్చే వారే కాదు. దేశంలోనే సైన్సు ప్రచారానికి భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత జాతీయ పురస్కారాన్ని 2005 సంవత్సరానికిగాను రాష్ట్రపతిభవన్‌లో పొందిన హుందాగల సంస్థ హిందూమతానికి వ్యతిరేకికాదు. హిందూ దేవుళ్లకూ వ్యతిరేకం కాదు. ఇతర మతాలేటికీ వ్యతిరేకం కాదు.


                అలాగని ఏమతానికీ అనుకూలమూ కాదు. మీకు వంకాయకూర ఇష్టం, మరొకరికి బెండకాయ పులుసు ఇష్టం అనుకొందాం. వంకాయలకు వ్యతిరేకమా? బెండకాయలకు మీరు అనుకూలమా? అని ఎవరైనా జనవిజ్ఞానవేదిక వారిని ప్రశ్నిస్తే మేమిచ్చే సమాధానం ఒకటే. ఎవరెవరి రుచులు, ఆసక్తులు వారి వారి యిష్టం. మేము వంకాయలకు వ్యతిరేకం కాదు. బెండకాయలకూ వ్యతిరేకం కాదు' అంటాము. అలాగని వంకాయలు గొప్పవనీ, బెండ కాయలు గొప్పవనీ అదేపనిగా ఊదరగొట్టము. బెండకాయలు, వంకాయల కన్నా పెద్ద సమస్యలు ప్రజల తలకాయలు ఎదుర్కొంటున్నాయని గుర్తించి వంకాయల గొడవ, చింతకాయల గొడవల్ని పట్టించుకోము.
అయితే వంకాయల రుచిలో కళ్లు మైమరిచిన వాళ్లు రోడ్లమీదికొచ్చి 'వంకాయల్ని మించిన కాయల్లేవు. అందరూ వంకాయల్నే తినాలి, వంకాయల రూపాల్ని ప్రతి రోడ్డు కూడలి దగ్గరా ప్రతిష్టించాలి. వంకాయలు తప్ప మిగిలిన కాయల్ని తినేవాళ్లు దేశం నుంచి వెళ్లిపోవాలి' అంటూ సామాజిక స్థాయికి వాళ్ల వంకాయ గొడవల్ని పొడిగిస్తే అలాంటి వంకాయల వంకర పోకడల్ని ప్రశ్నించడం ప్రతి శాంతికాముకుడి ప్రధాన బాధ్యత. కాబట్టి ఇలాంటి వాదనలు, ప్రకటనలు, ఆచారాలు ఎదురైనప్పుడు సహజంగానే జనవిజ్ఞానవేదిక ప్రశ్నిస్తుంది. అలాగే బెండకాయల రుచిని మెండుగా భావించే వారి విషయంలోనూ అలానే ప్రవర్తిస్తాము.

               కానీ, అన్ని కాయల్ని సమానంగా భావించాల్సిన ప్రభుత్వం, అన్ని కాయల్లోనూ ఉన్న మంచి చెడులను గుర్తించి నడుచుకోవాల్సిన ప్రభుత్వం కేవలం వంకాయల వంకే ప్రతి కార్యకలాపాన్ని మలవడం వల్ల మిగతా కాయల్ని ఇష్టపడే వారి మనోభావాల్ని ఇబ్బంది పెట్టే అవాంఛనీయ పరిస్థితి వుందన్న భావంతో ఏకాయలకూ పరిమితం కావద్దని చెబుతాం. వారి వారి వ్యక్తిగత రుచుల్ని, జిహ్వ చాపల్యాల్ని బృహత్సామాజిక కార్యకలాపాల్లోకి చొప్పించవద్దని విన్నవిస్తున్నాము. తద్వారా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడవలసిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని అంటాము.
                హిందూమతమైనా, ముస్లిం మతమైనా, క్రైస్తవ మతమైనా, లేదా మరే మతమైనా యథేచ్ఛగా అవలంబించే ప్రాథమిక హక్కు ప్రతి పౌరునికీ భారత రాజ్యాంగం ఇచ్చింది. అంతేకాదు, ఏ మతమూ లేనివారూ భారతదేశపు సమాజానికి సమ్మతమే! మతానికి, దేవుళ్లకూ జనవిజ్ఞానవేదిక వ్యతిరేకం కాదు. మతం పేరుతో జరిగే మారణకాండకు మాత్రమే పూర్తిగా వ్యతిరేకం. మతం పేరుతో మనుషుల మధ్య అంతరాలను పెంచే ధోరణులకు వ్యతిరేకం. అలాంటి మత వైషమ్యాల్ని రెచ్చగొట్టే ఛాందసభావాలకు వ్యతిరేకం. ప్రజల మధ్య సామరాస్యాన్ని పెంచుతూ వారి వారి మత విశ్వాసాల్ని గౌరవిస్తూ జనవిజ్ఞాన వేదిక ముందుకెళుతోంది.
మతంమాటున మూఢవిశ్వాసాల్ని, అభూతకల్పనల్ని, ఛాందసత్వాన్ని, వెనుకబాటుతనాన్ని, నిరాశావాదాన్ని, నిష్క్రియాపరత్వాన్ని, వివక్షను, సోమరితనాన్ని, విద్రోహ పూరిత మనస్తత్వాల్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించే ఏ కార్యకలాపాలనైనా మనం వ్యతిరేకించాలి. ఫలాని తంత్రంతో చేసిన తాయెత్తును ధరిస్తే జబ్బులు నయ మవుతాయన్నా, స్వస్థత కూటముల పేరుతో గుడ్డివాళ్లకు కళ్లు వస్తాయన్నా, అశాస్త్రీయంగా మరేదయినా పద్ధతిలో అన్నీ బాగవుతాయన్నా, ఆ భావాలు ప్రజల్ని నిర్వీర్యం చేస్తాయి కాబట్టి వ్యతిరేకిస్తాము.
               మతాలను, మతభావాల్ని, వారి వారి దేవుళ్లనూ జనవిజ్ఞానవేదిక ప్రశ్నించదు. అలాగని జనవిజ్ఞాన వేదిక ఓ నాస్తిక సంస్థ కానేకాదు. నలభై వేల పైచిలుకకు సభ్యత్వంతో నిస్వార్థంగా పనిచేసే జనవిజ్ఞానవేదికలో అన్ని మతాలవాళ్లు, ఏ మతమూలేని వాళ్లు, సమున్నతాశయాలతో పనిచేస్తున్నారు. ఈ విలువలకు కట్టుబడేవారెవరైనా జనవిజ్ఞాన వేదికకు ఆహ్వానితులే.
              ప్రజలు జరుపుకొనే పండుగలు, సామాజిక బృందస్థాయిలో జరుపుకొనే వేడుకలను వారి వారి సంస్కృతిలో భాగంగా చూస్తాము కాబట్టి ఆయా సందర్భాలలో ప్రభుత్వం ఆయా వర్గాల ప్రజలకు పండుగ అడ్వాన్సుల రూపంలోనో, మరేదైనా పద్ధతిలోనో సహకారం అందిస్తే అది తప్పుకాదు. కానీ అన్ని మతాల ప్రజలకూ బాధ్యత వహిస్తూ, సర్వమతస్తులకూ ప్రతినిధిగా ఉండవలసిన ప్రభుత్వ కార్యకలాపాల్లో మతపరమైన హడావిడి ఉండకూడదనడం తప్పు కాదు. ప్రత్యేకించి ఓ మతపద్ధతులే అనుసరించడం మరింత అభ్యంతరకరం అనడం వేరొకరికి వంతపాడడం కానేకాదు.

No comments:

Post a Comment