Wednesday 18 July 2012

దేవుని ఊహాశక్తి నుండే విశ్వం సమస్తం ఏర్పడినట్లు ఎందుకు అనుకోకూడదు?


         దైవకణాల గురించి మీరు గతవారం ఇచ్చిన సమాధానంలో పదార్థం-శక్తి ఒకే నాణేనికి రెండు పార్వ్వాల్లాంటివన్నట్లుగా చిత్రీకరించారు. పదార్థం-శక్తి వేర్వేరని నా ఉద్దేశ్యం. శక్తే మొదట్లో ఉండేదనీ - అదే పదార్థంగా రూపొందిందని బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతకర్తలు చెబుతున్నారు. ఆ శక్తే దైవశక్తి అనీ అదే మొదట దైవకణాలుగా రూపొందిందని నా భావన. దేవుని ఊహాశక్తి నుండే విశ్వం సమస్తం ఏర్పడినట్లు ఎందుకు అనుకోకూడదు? - మెటా ఫిసిసిస్ట్‌ (అనే అనామకపేరుతో నా వ్యాసంకన్నా పెద్ద స్పందన చేసిన ఓ పాఠకమిత్రుడు)

         శాస్త్రీయ చర్చకు మనం అనామకపేర్లు ఉంచుకోనవసరం లేదు. నిగూఢంగా ఉండాల్సిన అవసరం అసలే లేదు. దైవకణాల వ్యాసం గురించి, అంతకుముందు కూడా హేతువాద వైఖరికి సంబంధించిన సమాధానాలు ఇచ్చిన సందర్భాల్లో మీరు ప్రతిసారీ ఆకాశరామన్నలాగే స్పందించారు. అనామక పద్ధతిలో ప్రజాశక్తి 'నెట్‌ వర్షెన్‌'కు స్పందనను తెలియజేసే క్రమంలో మీరు చాలా అసహనానికి గురయ్యారు. నాపై వ్యక్తిగత దూషణలకు పాల్ప డ్డారు. జన విజ్ఞాన వేదిక మీద కొంత అసభ్య పదజాలాన్ని కూడా వాడారు. అయితే శాస్త్ర ప్రచారమే పరమావధిగా, సత్యాన్వేషణే దిక్సూచిగా, ప్రజా సైన్సు ఉద్యమం ద్వారా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడమే గమ్యంగా పయనిస్తున్న మేము మీ బోంట్ల తిట్లను, శాపనార్థాల్ని దీవెనులుగా భావిస్తాము. కాకుంటే మా బాధ్యత మరింత ఎక్కువగా ఉందనీ మీ వంటి మేథో ఛాందసుల్ని, ఛాందస మేధావుల్ని కూడా సమాధానపర్చాల్సిన బాధ్యత కూడా ఉందనీ మరోసారి గుర్తెరిగి సమాయత్తమవుతాము.
మీలాంటి వారు మీరొకరే కాదు. అంతోయింతో అనామకంగానయినా మెటాఫిసిసిస్ట్‌ మాటునయినా ఈపాటి మాటలతో చాటుగా బయటపడ్డ మీకు బాహాటంగా సమాధానమివ్వటమే పరిపాటి.
సైన్సు ఉద్దేశంలో మెటాఫిసిక్స్‌ అంటూ ఏదీ లేదు. అధి భౌతికవాదం (metaphysics) అనేది కొందరి అతి మేధావుల బుర్రల్లో చెలరేగే అతి, మిడిమిడి, పరిమితి భావాల సమ్మిశ్రమణం. ఏదోవిధంగా భావ వాదానికి, ఛాందసత్వానికి, అవాస్తవ జగత్తుకు వత్తాసు పలికే చిత్త చెత్త చిత్తరువు.


       మీ ప్రశ్నలో ఉన్న సార్వజనీనకత (generality) వర్తమాన భౌతికవాదనకు సవాలుగా ఉండడం వల్ల మీ సుదీర్ఘ స్పందనలో బయటపడ్డ సారాన్ని ఆ ప్రశ్నగా భావిస్తూ సంక్షిప్తంగా ఇక్కడ సమాధానమిస్తున్నాను. అయినా, మీ తిట్ల పరంపరకు తెర దించే రకం మీరు కాకున్నా మా పాఠకులకు విజ్ఞానం చేరవేసేందుకు మీరు కారకులైనందుకు ధన్యవాదాలు.
శక్తి (energy) అనేది నేటికీ విశ్వంలో ఉంది. పదార్థం (matter) అనేదీ ఉంది. ఈ రెండు వేర్వేరు విశ్వపుటంశాలు (cosmic entities) గా భావించడానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. కేవలం మహామేధావి ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అతి పిన్నవయస్సులోనే తన సాపేక్షతా సిద్ధాంతం (Theory of Relativity) ద్వారా శక్తి, పదార్థం ఒక్కటే అన్నాడు. మీరన్నట్లు ఒకే నాణేనికి రెండు పార్శాలు అని కూడా అనలేదు. అలా అన్నా కనీసం బొమ్మ, బొరుసు నిజంగానే వేర్వేరు పక్కల ఉన్నంతైనా స్వతంత్రను ఆపాదించి ఉండేవాళ్లం. అలాకాకుండా శక్తి, పదార్థం ఒకటేనన్నాడు. మీరన్న ఒకే నాణేనికి రెండు పార్శాల్లాగా, జతలాగా ఉండడాన్ని చలించే పదార్థాలకున్న కణ (particle) - తరంగ(wave) ద్వంద్వ స్వభావాని (duality) కి రూపకం(analogy) గా భావించగలం. కానీ పదార్థం - శక్తి అనే అంశానికి కాదు. పదార్థం - శక్తి ఒక్కటే అన్నాడు. దానికి తిరుగులేని ప్రాయోగిక సాక్ష్యాలు (empirical proofs) లభ్యమయ్యాక కూడా పదార్థం-శక్తి వేర్వేరు అంశాలు అనుకోవడం పరిమిత పరిజ్ఞానం. పరిమిత పరిజ్ఞానం అని ఎందుకంటున్నా నంటే సాధారణ రోజువారీ కార్యకలాపాలలో పదార్థం, శక్తి వేర్వేరు అంశాలుగానే ద్యోతకమవుతాయి. వాటి మధ్య తేడాలేని విషయం కేవలం లోతైన పరీక్షల్లోనే బోధపడుతుంది. 'శక్తి' అంటే సాధారణ పరిభాషలో పని (work) ని చేయగలది అని నిర్వచనం (definition) ఉంది.

పని అంటే ఏమిటి? వస్తువును జడం (inert) గా ఉంచే, లేదా అనుకున్న దిశలో వస్తు కదలికను అవరోధించే బలాన్నెదిరిస్తూ వస్తువు స్థానచలనం లేదా స్థానభ్రంశం (displacement) కలిగించగలిగితే అప్పుడు 'పని' జరిగిందని అంటాము. కాబట్టి 'పని' అన్నా 'శక్తి' అన్నా ఒకటే. శక్తికి భౌతికశాస్త్రంలో కొలమానాలు 'ఎర్గులు' లేదా జౌళ్లు. ఒక న్యూటన్‌ అవరోధ బలాన్ని అధిగమిస్తూ ఓ వస్తువును ఒక మీటరు మేరకు జరపగలిగితే అపుడు వినిమయమైన శక్తిని ఒక జౌలు అంటాము. అలాగే ఒక డైను (dyne) అవరోధబలాన్ని అధిగమిస్తూ ఒక వస్తువును ఒక సెం.మీ. మేరకు జరపగలిగితే అప్పుడు ఒక ఎర్గు (erg) పని జరిగిందని అర్థం. ఒక కోటి ఎర్గులు ఒక జౌలుకు సమానం లేదా 1J = 1X107 erg అని చెబుతాం. మరి సాధారణ పరిభాషలో పదార్థం (matter) అంటే అర్థం ఏమిటి? వస్తువు (object) నకు జడత్వా (inertia) న్ని సమకూర్చే అంతర్గత లక్షణమే పదార్థం. కదలని వస్తువును కదలకుండానే ఉంచే తత్వాన్ని, సమవేగం (uniform velocity) తో ప్రయాణిస్తున్న వస్తువును అదే విధమైన సమవేగ గమనం నుంచి తప్పించనితత్వాన్ని వస్తువుకున్న పాదార్థిక (mass) లక్షణం అంటారు.

దీనర్థం ఏమిటంటే కిలోగ్రాము ద్రవ్యరాశి ఉన్న వస్తువును కదిలించడం కన్నా 10 కిలోగ్రాముల ద్రవ్యరాశి ఉన్న వస్తువును కదిలించడం కష్టమన్నమాట. న్యూటన్‌ మొదటిసూత్రం ప్రకారం ఇలా జడత్వంలో ఉన్న పదార్థపు జడత్వాన్ని అధిగమిస్తూ కదలని వస్తువు (0 వేగం)ను కదిలించేది బలం. (force). లేదా సమవేగంతో ఉన్న వేగాన్ని మార్చేది కూడా బలం. అయితే వేగంలో కలిగే మార్పు (సున్న నుంచి సున్న కానిదవడం, సమవేగంలో మార్పు రావడం) ను త్వరణం (acceleration) అంటారు. అంటే మరోమాటలో చెప్పాలంటే వస్తువునకు త్వరణాన్ని ఆపాదించేది బలమన్న మాట. ద్రవ్యరాశికి జడత్వం ఉండడం వల్ల నిర్దిష్టబలంతో పెద్ద ద్రవ్యరాశికి తక్కువ త్వరణాన్ని, తక్కువ ద్రవ్యరాశికి ఎక్కువ త్వరణాన్ని ఇవ్వగలమని కూడా ఇక్కడ అర్థంచేసుకోవాలి.

అందుకే F అనే బలాన్ని F=ma గా సూచిస్తారు. (ఇక్కడ M అంటే ద్రవ్యరాశి, a అంటే త్వరణం అన్నమాట). F అనే అవరోధబలాన్ని అధిగమిస్తూ S దూరం మేరకు వస్తువును కదలిస్తే పని (W) జరిగినట్లు ముందే అనుకున్నాం. కాబట్టి నిర్ణీతశక్తితో అవరోధబలం ఎక్కువయితే తక్కువ దూరానికే వస్తువును కదలించగలమని, అవరోధబలం తక్కువయితే ఎక్కువదూరం కదలించగలమని కూడా భావించాలి కదా! కాబట్టి W=FS అని రాస్తాము. ఇక్కడ W అంటే పని, F అంటే బలం, ూ అంటే కదలిన దూరం. W నే (Energy) అని కూడా అంటాము.
ఇపుడు శక్తికి, పదార్థానికి సంబంధించిన మౌలిక శాస్త్రీయ అర్థాలను తెలుసుకున్నాం కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న ఏకత్వానికి సంబంధించిన అంశాన్ని E=mc2 అనే సూత్రంలో ఆ రెంటి ఐక్యత ఏ విధంగా సిద్ధిస్తుందన్న అంశాన్ని, శక్తి పదార్థానికి మధ్య జరిగే పరస్పర వినిమయా (mutual exchange) నికి సంబంధించిన సాక్ష్యాధారాల్ని, తద్వారా విశ్వావిర్భావంలో దైవకణాల (God particles) నబడే హిగ్స్‌ కణాల విశిష్టపాత్ర గురించి పై వారం ముచ్చటించుకుందాం.

No comments:

Post a Comment