Sunday 8 July 2012

విదేశీ భాషలతో కెరీర్‌కు కొత్తదారులు



            
               ప్రపంచీకరణ నేపథ్యంలో కొనే్నళ్ళుగా సాఫ్ట్‌వేర్ పరిశ్రమ కొనసాగిస్తున్న హవా అంతా ఇంతా కాదు. ఏ బ్రాంచిలో ఇంజనీరింగ్, పీజీ చేసినవారైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలవైపే మక్కువ కనబరుస్తున్నారంటే ఆ ఉద్యోగాలకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సాఫ్ట్‌వేర్ పరిశ్రమలతో పాటు కాల్‌సెంటర్లు కూడా అదే స్థాయిలో వెలుస్తూ యువతకు బోలెడు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే మరింత ఆకర్షణీయమైన జీతాలతో బహుళజాతి కాల్‌సెంటర్లు అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయి. దీంతో అమెరికన్, యుకె యాక్సెంట్ ( పద ఉచ్ఛారణ తీరు) అభ్యసించడానికి మన దేశానికి చెందిన యువత ప్రత్యేక తర్ఫీదు పొందాల్సి వచ్చేది. కానీ, కొనే్నళ్ళుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. కేవలం మాతృభాష, హిందీ, ఇంగ్లీషుతో సరిపెట్టకుండా ఏదో ఒక విదేశీ భాషను అభ్యసించడానికి యువత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే స్పెషలైజేషన్ కోర్సులను ఎంచుకుంటున్నవారు కొందరు ఉంటుండగా, అకడమిక్స్ పూర్తి చేసి ఇఫ్లూ (ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం, హైదరాబాద్) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ద్వారా ఇష్టమైన విదేశీ భాషను నేర్చుకుంటున్నవారు మరికొందరు ఉండడం విశేషం. విశ్వవిపణిలో భారతీయ కంపెనీలు క్రమేపీ తమ ఆధిపత్యం చలాయిస్తూ తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్న నేటి తరుణంలో మనదేశ భాషలతో పాటు విదేశీ భాషలు తెలిసిన నిపుణుల అవసరం ఎంతైనా ఉందని సంస్థలు గుర్తించాయి. బహుళజాతి కంపెనీలతో వ్యవహారాలు నడిపే సందర్భాల్లో విభిన్న భాషల్లో నిపుణులైన వారు తమ కంపెనీల్లో ఉంటే లాభదాయకమని భావించి పెద్ద స్థాయిలో నియామకాలు చేసుకుంటున్నాయి. అభ్యర్థులు దొరకని పక్షంలో కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్నవారిని తీసుకుని వారికి తర్ఫీదునివ్వడానికి కూడా సంస్థలు వెనుకాడడం లేదంటే మల్టీలాంగ్వేజ్ స్కిల్స్ కలిగిన వారికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. 2 లక్షల మంది ప్రొఫెషనల్స్ అవసరం గత దశాబ్ద కాలంగా గ్లోబల్ మార్కెట్‌లో వస్తు న్న మార్పులకు అనుగుణంగా మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థుల అవసరం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే, మానవవనరుల లేమి కారణంగా డిమాం డ్ మేర ఏ దేశంలోనూ విదేశీ భాషల్లో నైపుణ్యం సంపాదించిన అభ్యర్థులు తయారుకాలేకపోతున్నారు. బిపిఓ, ఐటి, కెపిఓల్లో రానున్న పదేళ్ళల్లో దాదాపు 2 లక్షల మంది విదేశీ భాషా పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు అవసరం ఉంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్‌పై ఆధారపడుతున్న వర్థమాన దేశాలకు ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. లాంగ్వేజ్-సెన్సిటివ్ పనులకు గాను దాదాపు 15 బిలియన్ల యుఎస్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలిగే విషయంలో పెద్ద కంపెనీలు సైతం మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మల్టీలాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థుల కొరత తీవ్రస్థాయిలో ఉండడమే. మనదేశం నుంచి విదేశాలకు వెళుతున్న వారు కూడా ఇటువంటి ఉద్యోగాల్లో కుదురుకోలేకపోతున్నారు. ఎక్కడ మొదలుపెట్టాలి..? విదేశీ భాషలను నేర్చుకోవడానికి పలు మార్గాలున్నాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో పలువురు విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఒక విదేశీ భాషను అభ్యసిస్తున్నారు. మరికొందరు 10+2 తర్వాత డిగ్రీలో చేరాక ఒక విదేశీ భాషను ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకుంటున్నారు. ఇవి కాక ఉస్మానియా, ఇఫ్లూ వంటి విశ్వవిద్యాలయాలు షార్ట్‌టర్మ్ సర్ట్ఫికెట్, డిప్లమో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. విదేశీ భాషల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారికి కూడా పిజి, పిహెచ్‌డిలు పలు భారతీయ విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఒక క్రీడలో నైపుణ్యం సాధించాలంటే చిన్ననాటి నుంచే ఎలా సాధన చేయాలో అదే విధంగా విదేశీ భాషను కూడా క్రమశిక్షణతో నేర్చుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా పాఠశాల కరిక్యులంలో ఒక భాగంగా విదేశీభాషను పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవడంతో చాలామంది హోం ట్యూషన్ బాట పడుతున్నట్లు సర్వేల్లో తెలిసింది. విదేశీ భాషల్లోనూ నైపుణ్యం సంపాదించాలంటే నిరంతరం ప్రాక్టీస్ చేయడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఉపయోగకరం..? ఇతర ప్రాంతాల సంస్కృతి, ఆచార వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారికి విదేశీ భాషలు నేర్చుకుంటే ఉపకరిస్తుంది. ఇలా చేయడం వల్ల తమ ఆసక్తి ఉన్న రంగంలో స్థిరపడడమే కాకుండా చక్కటి వేతనం కూడా సంపాదించే అవకాశం ఉంది. ఆంగ్లభాషలో పరిజ్ఞానంతో పాటు ఒక విదేశీ భాషను నేర్చుకోవడం వల్ల కెరీర్ కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చు ఎంత .? కేంద్రీయ విశ్వవిద్యాలయాలైన ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్‌లాల్ యూనివర్శిటీల్లో విదేశీ భాషల కోర్సుల ఫీజులు నామమాత్రంగానే ఉన్నాయి. ఇక ప్రైవేటు కేంద్రాల్లో అయితే భాషను బట్టి కోర్సులో చేరిన విద్యార్థులను బట్టి ఫీజులను నిర్ణయిస్తున్నారు. కొరియన్, జపనీస్, చైనీస్ భాషలు నేర్చుకోవడం ఖర్చుతో కూడుకోగా అరబిక్, పర్షియన్ భాషలను చాలా తక్కువ వ్యయంతో నేర్చుకునే అవకాశం ఉంది. ప్రైవేటు సంస్థల్లో ఐదేళ్ళ కోర్సుకు దాదాపు రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయితే, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విదేశీ భాషల కోర్సులు అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆకర్షణీయ ఉపకార వేతనాలను కూడా అందజేస్తోంది. ఢిల్లీ యూనివర్శిటీ, మ్యాక్స్ మ్యూలెర్ భవన్‌లు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. అయితే, ఇందుకు ప్రతిభే కొలమానంగా నిర్ణయిస్తున్నాయి. ఉద్యోగావకాశాలు ఎలా..? విదేశీభాషల్లో నైపుణ్యం సంపాదించిన వారికి పలు రంగాలు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా టూరిజం, ఎంబసీ, డిప్లొమాటిక్ సర్వీసులు, ఎంటర్‌టైన్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, మాస్ కమ్యూనికేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్, ఇంటర్‌ప్రిటేషన్, ట్రాన్స్‌లేషన్ తదితర రంగాల్లో భారీగా కొలువులు విదేశీ భాషా నిపుణుల కోసం వేచిచూస్తున్నాయి. ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చైనీస్, జపనీస్, స్పానిష్, కొరియన్, పోర్చుగీస్ తదితర భాషల్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆన్‌లైన్ కంటెంట్ రైటర్లు, టెక్నికల్ ట్రాన్స్‌లేటర్లు, డీకోడర్లకూ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలైన యుఎన్‌ఓ, ఎఫ్‌ఏఓ, ఆర్‌బిఐ తదితర సంస్థల్లో కూడా ఫారిన్ లాంగ్వేజ్ స్పెషలైజేషన్ ఉన్న వారి కోసం చూస్తున్నాయి. వేతనాల మాటేంటి..? ఆంగ్లభాషపై మంచి పట్లు ఉండి, విదేశీ భాషల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి దాదాపు రూ.50వేల వరకు నెలకు వేతనం అందించే బహుళజాతి సంస్థలు ఎన్నో ఉన్నాయి. భాషలు నేర్పించే శిక్షకులు కూడా దాదాపు రూ.30వేల వరకూ ఆడుతూ పాడుతూ సంపాదిస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తూ గంటకు రూ.4వేలు సంపాదించే శిక్షకులు కూడా ఉన్నారు. యాక్సెంచర్, ఈవాల్యుసెర్వ్, విప్రో, ఫీసెర్వ్, టిసిఎస్, టెక్ మహింద్రా, ఇన్ఫోసిస్, కులీజా, స్కాబార్డ్ వంటి బహుళజాతి కంపెనీలు భాషా నిపుణులకు పెద్దపీట వేస్తున్నాయి.

No comments:

Post a Comment