Wednesday 4 July 2012

పర్వతాలు.. ప్రభావా లు



                       భూ వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో 'పర్వతాలు' కీలకపాత్ర పోషస్తున్నాయి. మన దేశ ఉత్తర సరిహద్దుగా ఉంటున్న హిమాలయ పర్వతశ్రేణి మన దేశ వాతావరణాన్ని నిర్ధారించడంలో కీలకపాత్ర వహిస్తోంది. ఇక పర్వతాలకన్నా చిన్నగా ఉండే పెద్ద, చిన్న గుట్టలు ఒక నిర్దిష్ట పద్ధతిలో వాతావరణాన్ని మార్చుతూ తమదైన ప్రత్యేకతలతో క్షేత్ర వాతావరణాన్ని, రూపొందిన నేలల స్వభావాన్ని, ఉత్పత్తి వాతావరణాన్ని, సాంఘిక ఆర్థిక కార్యక్రమాల్ని నిర్ధారిస్తున్నాయి. మొత్తంమీద, ఇవి సకలజీవుల్ని, మన జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే, ఇవి సముద్రగర్భంలో కూడా ఉన్నాయి. ఇలా ఉంటూ సముద్రగర్భంలో జీవించే జలచరాలను, సముద్రయానాన్ని పలురూపాల్లో ప్రభావితం చేస్తున్నాయి. భూమి మీద మనకు కనిపిస్తూ ప్రభావితం చేసే వాటినే మనం పర్వతాలు, గుట్టలుగా గుర్తిస్తున్నాం. ఇవి ప్రశాంత వాతావరణాన్ని అందిస్తూ.. తాత్వికచింతనకూ తోడ్పడుతున్నాయి. మొత్తం మీద ఇవి ప్రకృతిని పరిరక్షిస్తూ మన జీవితాలను సుసంపన్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ముఖ్య పార్శ్వాల్ని సంక్షిప్తంగా తెలుపుతూ ఈ వారం మీ ముందుకొచ్చింది 'విజ్ఞాన వీచిక'.
భూతలం మీద ఎత్తుగా ఉంటూ, కొనదేలి ముందుకొచ్చిన రాళ్లు, మట్టి సమూ హంతో ప్రత్యేకంగా కనపడేవే పర్వతాలు, పెద్ద, చిన్న గుట్టలు. ఇవి స్థానిక వాతావర ణాన్ని పలువిధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. సకలజీవరాశుల జీవనశైలిని నిర్ధారిస్తు న్నాయి. ఇవి ప్రకృతిపరంగానే ఏర్పడ్డాయి. వ్యవహారికంగా, భూతలం మీద కనపడే వాటినే పర్వతాలుగా పరిగణిస్తున్నాం. వీటిని గురించే ఈ వ్యాసంలో వివరిస్తున్నాం. సముద్రగర్భంలో ఉండేవాటిని ఈ సందర్భంలో ప్రస్తావించడం లేదు.
''పర్వతాలకు'' అందరూ అంగీకరిస్తున్న నిర్వచనం ఏమీలేదు. ఎత్తు, పరిమాణం, వాలు, వాలు తీవ్రత, శిఖరాలు, వాటి మధ్య దూరాల ఆధారంగా వీటిని గుర్తిస్తు న్నాం. కొన్ని సందర్భాల్లో స్థానిక ప్రజల వ్యవహారిక గుర్తింపు కూడా ముందుకొస్తుంది. ఉదా: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో దగ్గరున్న మౌంట్‌డేవిడ్సన్‌ పర్వత నిర్వచనానికి సరిపోదు. అయినా, దీన్ని స్థానికులు పర్వతంగానే భావిస్తున్నారు. అందువల్ల ఇది పర్వతంగానే పిలువబడుతుంది.
గుర్తింపు..
* విస్తృతపునాదిపై కనీసం 2500 మీటర్ల (8202 అడుగులు) ఎత్తుగల శిఖరం.
* పునాదిపై 1500-2500 మీటర్ల (4921-8,202 అడుగులు) ఎత్తుతో రెండు డిగ్రీలకన్నా అధికంగా వాలు కలిగిన శిఖరాలు.
* పునాదిపై 1000-1500 మీటర్ల (3281-4921 అడుగులు) ఎత్తుతో ఐదు డిగ్రీలకన్నా అధిక వాలు కలిగిన శిఖరాలు.
* స్థానిక శిఖరాలు 7000 మీటర్ల వ్యాసార్థం (22.966 అడుగులు) గల పునాదిపై 300 మీటర్ల (984 అడుగులు) ఎత్తుగల శిఖరాలు.
ఈ నిర్వచనాల ఆధారంగా ఆసియా ఖండంలో 64%, యూరప్‌లో 25%, దక్షిణ అమెరికాలో 22%, ఆస్ట్రేలియాలో 17%, ఆఫ్రికాలో 3% మేర పర్వతాలు ఆక్రమించుకొని వున్నాయి. మొత్తం మీద, భూమిపై 24% పర్వతాలు విస్తరించి వున్నాయి. వీటిపై 10% మేర ప్రజలు నివసిస్తున్నారు. భూగోళంలో ప్రధాన నదులన్నీ ఈ పర్వత ప్రాంతాల నుండే జనించినవే. దాదాపు 50% ప్రజలు ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నారు.
వాతావరణం..
పైకి వెళుతున్న కొద్దీ ప్రతి 150 మీటర్లకూ ఒక డిగ్రీ సెంటీ గ్రేడ్‌ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ తగ్గుదల అధికంగానూ ఉండ వచ్చు. అందువల్ల, పర్వత శిఖరాలు ఎప్పుడూ చల్లని వాతావరణ పొరల్లో ఉంటాయి. పునాది వద్ద ఉష్ణమండల పరిస్థితులున్నప్ప టికీ ఉన్నత శిఖరం నిత్యం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ పర్వతలోయలు హిమనీ నదాలతో నిండి ఉంటాయి. హిమనీ నదంలోని మంచు కరుగుతూ నదులు, జలపాతాలుద్భవిస్తాయి.
పర్వతాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. మార్పుకు లోనవు తుంటాయి. వాతావరణ ప్రభావాల వల్ల తేలికగా విచ్ఛిన్నం కాగల పర్వత శిఖరభాగం బోడి (గుండ్రం)గా మారవచ్చు. విడిపోయిన రాళ్లూరప్పలు లోయ ప్రాంతాల్లో చేరవచ్చు. ప్రవహించే నీరు తోడై నప్పుడు ఈ రాళ్లు చిన్న చిన్న ముక్కలుగా మారవచ్చు. ఈ లోయ ప్రాంతాల్లో చెట్లూ, చేమలు పెరిగి దట్టమైన అడవులు ఏర్పడ తాయి. కొన్ని పర్వతాలు పెరుగుతుండవచ్చు. ఉదా: హిమాలయ పర్వతాలు. వీటి పర్వతశిఖరాలు ఎత్తుగా, మొనదేలి ఉంటాయి.
పర్వత ప్రాంతం సామాన్యంగా పరిసర భూ వాతావరణం కన్నా చల్లగా ఉంటుంది. భూమిపై పడిన సూర్యరశ్మి భూతలాన్ని వేడెక్కిస్తుంది. వేడెక్కిన భూమి ఉపరితలంపైనున్న గాలిని వేడెక్కిస్తుంది. ఇలా వేడెక్కిన గాలి పైనున్న పొరను వేడెక్కించలేదు. ఫలితంగా పర్వత శిఖర ప్రాంతంలో గాలి చల్లగా ఉంటుంది. ఇదే సందర్భంలో పైకి వెళుతున్న కొద్దీ గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతుంటుంది. 3,500 మీటర్లపైన ఊపిరి పీల్చుకోవడం భారంగా మారుతుంది.
మీకు తెలుసా..?
* హిమాలయాల్ని 'ప్రపంచ పైకప్పు'గా వర్ణిస్తారు. ధృవప్రాంతాల తర్వాత దానితో సరిసమానంగా ఇక్కడే మంచు ఉంటుంది. దాదాపు పది పెద్ద నదులు ఇక్కడ నుంచే ప్రవహిస్తుంటాయి.
* వందలాది సరస్సులు ఈ శ్రేణిలో ప్రకృతిపరంగా ఐదువేల మీటర్ల ఎత్తు లోపల ఏర్పడి ఉన్నాయి. ఈ పరిమితిలోనే వృక్షజాలాలు వుంటాయి.
* హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది.నేపాల్‌లో గత పదేళ్లలో 0.6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ప్రపంచంలో గత 100 సంవత్సరాల్లో 0.7 డిగ్రీలు మాత్రమే పెరిగింది.

No comments:

Post a Comment