Wednesday 18 July 2012

కష్టసుఖాలకు కారణాలేంటి? (3)


  • అశాస్త్రీయ ఆచారాలు14
          ''పిిల్లలూ! ఇలాంటివి ఇంకా అనేకాంశాలు 'తాళ పత్ర నిధి'' అనే గ్రంథంలోనూ, 'గృహవాస్తు'లోనూ ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మనం తలంటుకొనే రోజుకీ, మన ఇంట్లో తేనెతుట్టె ప్రదేశానికీ, అరటిచెట్టు ఉండే దిశకీ, అలాగే భోజనం చేసే వైపుకీ, జుట్టు కత్తి రించుకొనే తిథికీ, బల్లిపాటుకూ మనకు వచ్చే కష్టసుఖా లకీ సంబంధం ఉందని ఎలా నిరూపించగలం? ఇన్ని వందల సంవత్సరాల నుండి ఎవరైనా నిరూపించారా? మన సుఖాలకి అసలు కారణం 'ఆత్మవిశ్వాసంతో కూడిన తీవ్రమైన కృషి' అని సామాజిక శాస్త్రవేత్త లందరూ స్పష్టం చేశారు. విజయం సాధించిన మహా నుభావులందరూ నిరూపించారు. ఇవి లోపించినపుడు కష్టాలు వస్తాయి. వాస్తవమిది కాగా ఆవరణలోని అరటిచెట్టుకీ, నిద్రలేవగానే కనిపించే వ్యక్తికీ, కసువు పారవేసే ప్రదేశానికీ సంబంధం ఉందని నమ్మడం మన అమాయకత్వం, మనలోని అశాస్త్రీయ ఆలోచనా విధానం. తేనెపట్టు పట్టిన ఇంట్లో నివాసం ఉండీ, మధ్యలో నుండి గెలపొడుచుకు వచ్చిన అరటిచెట్టును పెంచీ, తనకే కష్టమూ, నష్టమూ జరగలేదనీ, జరగదనీ నూరేళ్ళక్రితమే నిరూపించారు కందుకూరి వీరేశలింగం గారు. కాబట్టి మన జయాపజయాలకీ, లాభనష్టాలకీ ఎంగిలినీళ్ళు ఆ మూల పారబోయడమో, తీసివేసిన గోళ్ళు ఇంట్లో ఉండటమోలాంటి నిరూపణ చెయ్యలేని అంశాలు కారణమని నమ్మకండి. మన కృషి, పట్టుదలలే కారణమని నమ్మండి. ఇవన్నీ మూఢనమ్మకాలు. వాటిని వదలండి.
మన పెద్దలు చెప్పినట్లు 'కృషితో నాస్తి దుర్భిక్షం'; అంటే కృషితో వ్యక్తిగత దరిద్రాన్నే కాదు సామాజికంగా కరువును కూడా లేకుండా చేయవచ్చు'' అని ముగించాను.
ఒక్క నిమిషం నిశ్శబ్ధం. తర్వాత సాయిలక్ష్మి లేచి ఇలా అడిగింది. 'మరి ఈ మూఢనమ్మకాలు మన సమాజంలోకి ఎలా ప్రవేశించాయి మాస్టారూ?''
''మంచి ప్రశ్న వేశావమ్మా! దీనికి సమాధానం వచ్చే క్లాసులో చెబుతాను'' అన్నాను.

కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment