Wednesday 13 June 2012

దిష్టి తగులుతుందా?


    
  • అశాస్త్రీయ ఆచారాలు11
           ఇటీవల మా స్నేహితుని మనువడి పుట్టినరోజు ఫంక్షన్‌కి వెళ్లొచ్చాం. వచ్చేటప్పటికే మా మనుమరాలు అమూల్య ఒళ్ళు కొంచెం వేడిగా ఉంది. ఒకటే ఏడుస్తోంది కూడానూ. ఎత్తుకున్నా ఏడుపు ఆపడం లేదు. వెంటనే మా అమ్మ 'ఒరేరు! చిన్నదానికి దిష్టి తగిలిందిరా!' అంది. మేము వారించేలోగానే లోపలికెెళ్ళి ఎండు మిరపకాయలు, ఉప్పు తెచ్చి పాప చుట్టూతా వాటిని తిప్పి మండేపొయ్యిలో వేసింది. అవి చిటపట మంటూ కాలిపోయాయి. ఘాటైన వాసనేమీ రాలేదు. అప్పుడు మా అమ్మ 'చూడరా లక్ష్మీకాంతం! ఘాటే రాలేదు. చిన్నదానికి ఎంత దిష్టి తగిలిందో..! నువ్వు దిష్టీ, గిష్టీ లేదంటావుగానీ, దిష్టి లేకపోతే మిరపకాయల కోరొచ్చి మనందరికీ దగ్గొచ్చేది' అంది.
అప్పుడు నేను మా అమ్మతో 'అమ్మా! ఇప్పుడు కొంచెం ఎక్కువ మిరపకాయలు, ఉప్పు తీసుకొని నాకు దిష్టి తీయి. తర్వాత వాటిలో సగం ఈ పొయ్యిలో వెయ్యి. ఏమవుతుందో చూడు' అన్నా. మా అమ్మ ఆ ప్రకారమే చేసింది. ఘాటు వాసన రాలేదు. 'అంటే నాకూ దిష్టి తగిలిందా?' అని అడిగాను.
మా అమ్మ మౌనం వహించింది. 'ఇప్పుడు మిగిలిన కాయలు ఈ కుంపట్లో వెయ్యి' అన్నా. ఆమె వేసింది. వెంటనే రూమంతా విపరీతమైన ఘాటు వాసన.. అందరికీ ఒకటే దగ్గు.
'ఇప్పుడు ఏమంటావమ్మా! నాకు దిష్టి తగిలిందా? తగల్లేదా?' అన్నాను. అమ్మ ఏమీ మాట్లాడలేదు.
అప్పుడు నేను దీని వెనకున్న సైన్సు సూత్రాన్ని వివరించా. 'నీవు మొదట ఉప్పూ, మిరపకాయలు భగ భగ మండే పొయ్యిలో వేశావు. అంత పెద్దమంటకు మిరపకాయలు ఒక్కసారిగా మండిపోయాయి. అందువలన వాటిలోని రసాయనపదార్థాలు ఒక్కసారి గా గాలిలో కలిసిపోయాయి. దీంతో పొగకాని, కోరు గాని రాలేదు. రెండవసారి నుసికట్టిన బొగ్గులపై వేశావు. అవి మండటానికి కావలసినంత ఆక్సిజన్‌ చాలక మెల్లగా వేడెక్కి, నింపాదిగా మండాయి. అప్పు డు పొగ, కొన్ని రసాయనాలు విడుదలయ్యాయి. వాటి వలన మనందరికీ దగ్గొచ్చింది. అంతేకానీ మొదటిసారి పొయ్యిలో వేసినప్పుడు దిష్టి తగిలిన సూచనగానీ, రెండవసారి కుంపట్లో వేసినపుడు తగలకపోవడానికి గానీ సూచన కాదు. అదంతా మంట తీవ్రతకు సంబం ధించిన విషయం. నీవు చిన్నదానికి దిష్టి తీసినపుడు ఆ మిరప కాయలు కుంపట్లో వేసినట్లయితే అప్పుడు కోరొచ్చి ఉండేది. అప్పుడు నువ్వు 'చిన్నదానికి జ్వరం వచ్చిందిరా! డాక్టరు దగ్గరకు తీసికెళ్లు' అనే దానివి.
'మన చిన్నది తెల్లగా, బొద్దుగా ముద్దొస్తోంది కదా! అందువల్ల ఫంక్షన్‌లో అందరూ ఎత్తుకొని, ముద్దు చేశారు. ఇలా చాలామంది చేయడంతో పసిపిల్ల లు ఇబ్బందిపడతారు. దీంతో పిల్లల ఒళ్లు వెచ్చ బడుతుంది. మనం దూరప్రయాణం చేస్తే ఎలా బడలికగా ఉంటుందో అలా అన్న మాట. వాళ్ళకు కొంత విశ్రాంతి ఇస్తే మామూలు స్థితికి వస్తారు. నేనిప్పుడు చిన్నితల్లిని కాసేపు చల్లగాలిలో తిప్పుతాను. నిద్రపోయి, తెల్లవారేటప్పటికి మామూలై ఆడుకొంటుంది' అన్నా. అన్నట్లే కొంతసేపు తిప్పిన తర్వాత పాప నిద్రపోయింది.
మా అమ్మ 'అదిసరే లక్ష్మీకాంతం! కొన్నికళ్ళు దిష్టి కళ్ళంటారు కదరా? దీంతో పిల్లలకు అన్నం సహించదు. మరి దానికేమంటావు?'
'దిష్టి కళ్ళు అనేవేవీ ఉండవమ్మా! మన కళ్ళలోంచి కొన్ని ప్రత్యేకకిరణాలేవీ ఇతరులపై పడవు. ఏ వస్తువు మీదైనా వెలుతురు కిరణాలు పడ్డప్పుడు, ఆ వస్తువు కాంతి మన కళ్ళల్లోకి పడుతుంది. ఇక కళ్ళల్లోంచి దిష్టి అనేది ఇతరుల మీద పడటం ఎలా సంభవం? మీరేం చేస్తుంటారంటే పిల్లలకు జ్వరం వచ్చినా, ఆకలి తగ్గినా అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, మందుల గురిం చి ఆలోచించకుండా ఆ రోజు పసిబిడ్డను ఎవరు చూ శారు? ఎవరి కళ్ళుపడ్డాయో అని అనవసర, అశాస్త్రీయ ఆలోచనలు చేస్తారు. మిరపకాయల, బుంగ దిష్టిల్లాం టివి తీస్తారు. దిష్టి లేదని అర్థంచేసుకోమ్మా!' అన్నాను.
రెండురోజుల క్రితం బంధువుల పెళ్ళికి వెళ్ళాము. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ పాపని ఎత్తుకుని, బంధువుల పలకరింపులవగానే, చల్లగాలిలో ఆడించా. ఇంటికి వచ్చిన తర్వాతా పాప ఉల్లాసంగా ఆడుకున్నది.
ఆ తర్వాత మా అమ్మ దిష్టి సంగతి ఎప్పుడూ ప్రస్తావించలేదు.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment