Wednesday 6 June 2012

ప్రత్యేక దుస్తులు లేకుండా తిరగలేం!


  • - కొడవటిగంటి రోహిణీప్రసాద్ rohiniprasadk@gmail.com
కుజ గ్రహానికి వెళ్ళడం అంత సులువైన పనేమీకాదు గానీ ఒకవేళ మనుషులు అక్కడికి వెళ్ళినట్టయితే ఏం చెయ్యాలనేది శాస్తవ్రేత్తలు చాలా వివరాలతో సహా ఆలోచించి పెట్టుకున్నారు. అక్కడ మనకు పనికొచ్చేవీ, ఇబ్బంది పెట్టేవీ కూడా ఉంటాయి. ఆ విశేషాలు కొన్ని ఆసక్తికరం. అవేమిటో చూద్దాం.
కుజగ్రహం ఉపరితలానికి దిగువన గడ్డకట్టిన నీరు దొరకవచ్చుననేది అక్కడికెళ్ళిన వారికి లాభకరం కావచ్చు. ఈ విషయంలో చంద్ర మండలంకన్నా అది ఎంతో మెరుగైనదే. అలాగే గాలేలేని చంద్రుడిలా కాకుండా కుజుడి మీద పల్చని వాతావరణపు పొర ఒకటి ఉంటుంది. కుజుడు తనచుట్టూ తాను తిరిగేందుకు 24 గంటల 39నిమిషాలు పడుతుంది కనుక రోజుల కాలవ్యవధి దాదాపు మనవంటిదే. భూమి అక్షం వంగిన కోణం 23 డిగ్రీల 44’ కాగా కుజుడిది 25 డిగ్రీల 19’ కనక రుతువులన్నీ దాదాపు మనలాంటివే. భూమిలో పదోవంతు ద్రవ్యరాశిగల కుజుడి మీది మొత్తం పొడినేల భూమితో పోల్చదగినదే. మనవంటి ప్రాణులకు సహాయపడగలిగిన రసాయనాలు అక్కడి నేలలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ మనకు తోడ్పడే అంశాలు.
మనకు ఇబ్బంది కలిగించగల విషయాల్లో అక్కడి గురుత్వాకర్షణ తక్కువ కావడం ఒకటి. అది భూమితో పోలిస్తే 38% మాత్రమే కనక యాత్రికులు బరువుకోల్పోతే వచ్చే కష్టనష్టాలను అంచనావేసుకోవాలి. అక్కడి చలి విపరీతం. అది -63 నుంచి -140 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుందట. అక్కడ సరస్సులవంటి నీటివనరులేవీ ఉండవు. సూర్యుడి చుట్టూ కుజుడు తిరిగే కక్ష్య మనకన్నా దీర్ఘవృత్తం కనక దూరమైనప్పుడు చలి బాగా పెరుగుతుంది. అక్కడి వాతావరణపు ఒత్తిడి 66 మిల్లీ బార్లు మాత్రమే (మనకు 1 బార్). అందుచేత ప్రత్యేకమైన దుస్తులు లేకుండా తిరగడం సాధ్యంకాదు. అక్కడి గృహాలన్నిటిలోనూ కృత్రిమ పద్ధతుల్లో గాలి ఒత్తిడిని పెంచక తప్పదు. అక్కడ మనకన్నా 15రెట్లు ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్, కొంత కార్బన్ మోనాక్సైడ్ కూడా ఉంటాయి కనక అది పీల్చదగిన గాలి కాదు. వాతావరణపు పొర నిరోధించదు కనక భూమితో పోలిస్తే అక్కడి రేడియేషన్ ప్రభావం కూడా రెండున్నర రెట్లు ఎక్కువే. వీటన్నిటికీ ఉపాయాలు అవసరమవుతాయి. ఏది ఏమైనా మొత్తంమీద సౌర వ్యవస్థలోకల్లా భూమి తరవాత కుజుడి లాగా నివాసయోగ్యమైన ప్రదేశం మరొకటి లేదు. బుధ, శుక్ర గ్రహాలమీది ఉష్ణోగ్రత అతి భయంకరమైనది. గురువు, శని, యురేనస్, నెప్‌ట్యూన్ గ్రహాలన్నీ వాయువుల ముద్దలే కనక మనుషులు దిగగలిగిన నేల ఏమీ ఉండదు. (చిత్రం) కుజగ్రహం పైనా, భూగర్భంలోనూ నివాసాల ఊహాచిత్రం

No comments:

Post a Comment