Wednesday 23 May 2012

అందరికీ ఆరోగ్యం ఎలా?


అందరికీ కావలసింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్ధతతో, ఉల్లాసంగా పనిచేయగలుగుతాం. అభివృద్ధికి దోహదపడతాం. ఆరోగ్యం మందులతో వచ్చేది కాదు. అనారోగ్యంగా మారిన తర్వాత మాత్రమే వైద్య చికిత్స అవసరమవుతుంది. అప్పుడే వైద్యులు కావాలి. అందువల్ల ఏ సమాజమైనా తన పౌరులను ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంచడానికే ప్రాధాన్యత ఇస్తుంది తప్ప అనారోగ్యులయ్యాక మందులతో చికత్స చేయడానికి ప్రాధాన్యత ఇవ్వదు. అందువల్ల ఆరోగ్యాభివృద్ధికి 'సామాజిక ఆరోగ్య చిహ్నాలు (సోషల్‌ పారామీటర్స్‌)' ముఖ్యం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండీ 'అందరికీ ఆరోగ్యం' సమస్యగానే కొనసాగుతుంది. పేదరికం, భౌతిక పర్యావరణ పరిస్థితులు అనారోగ్యానికి ప్రధానకారణం. స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు జీవన ప్రమాణాలను పెంచినప్పటికీ 'అందరికీ ఆరోగ్యం' ఎండమావిగానే మిగిలిపోయింది. సంస్కరణల తర్వాత ఆరోగ్యంగా ఉంచడమంటే 'అందరికీ వైద్య సేవలను ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో అందించే కార్యక్రమం'గా మార్చబడింది. దీనికి ఇతర ప్రభుత్వ విధానాలు తోడై 'అందరికీ ఆరోగ్యం' అసంభవంగా మార్చి వేసింది. వైద్యం రోజురోజుకూ ప్రజలకు దూరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిపుణుల కమిటీని 'డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి' నేతృత్వంలో ఏర్పరిచింది. ఈ కమిటీ 'అందరికీ వైద్యమే కాకుండా, అందరికీ ఆరోగ్యం అవసరమని వక్కాణించింది. దీన్ని ఎలా సుసాధ్యం చేయవచ్చో తెలుపుతూ పలు సూచనలు చేసింది. వీటిని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
అందరికీ ఆరోగ్యం 2000 సంవత్సరం నాటికి సాధించాలని 1978లోనే 'ఆల్మా అటా' సూచించింది. దీనిలో మన దేశం కూడా భాగస్వామి. తదనుగుణంగా 1983లోనే 'జాతీయ ఆరోగ్య విధానం' రూపొందింది. 2002 నాటికి ప్రజారోగ్య విషయంలో కొంత పురోగతి సాధించినా, చేయవలసింది చాలా మిగిలే ఉంది.
'అందరికీ ఆరోగ్యం' 2000 సంవత్సరంలో కూడా కలగానే మిగిలిపోయింది. ఆ తరువాత దశాబ్ధకాలానికి, అంటే 2010 నాటికి, 'అందరికీ ఆరోగ్యం' నుంచి ఒకడుగు వెనక్కి వేసి 'అందరికీ వైద్యసేవలు' అందించే సాధనంగా ప్రజారోగ్యం మార్చబడింది. 'వైద్యం' భరించలేనిదిగా, పేదరికం పెంచేదిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో 'అందరికీ వైద్యం' అందించే విధి విధానాలను సూచించవలసిందిగా ప్రణాళికా సంఘం 'ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని (హై లెవల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూపు)' నియమించింది. దీనికి ప్రముఖ హృద్రోగ నిపుణులు, 'పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా' వ్యవస్థాపక అధ్యక్షులు డా|| శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఈ బృందం ప్రజారోగ్యంలో వివిధ దేశాల అనుభవాలను, మన దేశంలో వివిధ రాష్ట్రాల అనుభవాలను, నిపుణుల అభిప్రాయాలను పరిశీలించింది. 2011 నవంబరులో తన సూచనలను ప్రణాళికా సంఘానికి అందించింది. ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ప్రైవేటీకరణ వైపు శరవేగంగా పయనిస్తున్న మన ఆరోగ్యవ్యవస్థను ఈ నివేదిక ఒక్క కుదుపు కుదిపింది. జబ్బున పడిన మన దేశ ఆరోగ్యవ్యవస్థను, ప్రపంచబ్యాంకు శిక్షణ పొందిన నిపుణులు సూచించిన 'ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు', 'రాజీవ్‌ ఆరోగ్యశ్రీ' వంటి ఇన్సూరెన్సు పథకాలలోని లొసుగులను, బలహీనతలను ఈ నివేదిక ఎత్తి చూపింది. ప్రజల ఆర్థిక స్థోమతతో నిమిత్తం లేకుండా, వారిపై ఆర్థికభారం మోపకుండా, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వమే అందరికీ ఆరోగ్యాన్ని, వైద్య సేవల్ని అందించాలని ఈ కమిటీ సూచించింది. ఈ నివేదికలోని కొన్ని ముఖ్య సూచనలు.
1. నిధుల కేటాయింపు..
ఆరోగ్యరంగంలో నిధుల కేటాయింపు 3 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని జరగాలి.ఇవి:
* అందరికీ అవసరమైన ఆరోగ్యసేవలు అందించడానికి తగినన్ని నిధుల కేటాయింపు.
* వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలవకుండా, పేదరికంలోకి దిగజారకుండా ప్రజలకు ఆర్థిక రక్షణ ఏర్పాటు.
* ప్రజలందరికీ వైద్యసేవల లభ్యతకు హామీ ఇస్తూనే, దీర్ఘకాలం ఆరోగ్యఖర్చులు విపరీతంగా పెరిగిపోకుండా అదుపులో ఉండేలా తగిన ఆర్థిక విధానాలను రూపొందించాలి.
పై లక్ష్యాల సాధన కోసం ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చును 2017 నాటికి జాతీయ స్థూల ఉత్పత్తిలో 2.5 శాతానికి, 2022 నాటికి 3.0 శాతానికి పెంచాలి. ప్రస్తుతం ఇది 1.2 శాతంగానే ఉంది. దీనివల్ల వైద్య ఖర్చుల కోసం ప్రజలు తమ జేబులో నుంచి ఖర్చు చేయవలసిన మొత్తం గణనీయంగా తగ్గుతుంది.
రాజీవ్‌ ఆరోగ్యశ్రీలాంటి స్కీములు దీర్ఘకాలంలో సత్ఫలితాలను సాధించలేవు. అవి వైద్య ఖర్చులను విపరీతంగా పెంచి, ప్రభుత్వ ఖజానాపై అనవసర భారాలను మోపుతాయి. వైద్యవ్యవస్థల నిర్వహణకు కావలసిన నిధులను ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేసిన ఆదాయం నుంచే కేటాయించాలి. బ్రిటన్‌లో ఈ విధానం సత్ఫలితాలను ఇస్తుంది.
''ప్రజలకు అవసరమైన వైద్యసేవల పట్టిక''ను రూపొందించి, అందులో ఉన్న సేవలన్నింటినీ పేద, ధనిక వివక్ష లేకుండా అందరికీ పూర్తిగా, ఉచితంగా అందించాలి. ఆరోగ్యాన్ని చట్టబద్ధమైన హక్కుగా గుర్తించి 'జాతీయ ఆరోగ్య హక్కు కార్డు'ను పౌరులందరికీ అందించాలి. దానిద్వారా ఎవరైనా తమకు కావలసిన ఆసుపత్రిలో చికిత్స పొందే అవకాశం కల్పించాలి. ప్రజల వద్ద నుంచి యూజర్‌ఛార్జీలను వసూలు చేయరాదు. ఇవి వసూలు చేసిన చోట వైద్యసేవలు మెరగవలేదని దీర్ఘకాలిక అనుభవాలు తెలుపుతున్నాయి. కేంద్రం నిధులను విడుదల చేసిన సందర్భంలో ఆ నిధులను తమ స్థానిక అవసరాలకు అనువుగా ఖర్చు చేసుకొనే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలి. వైద్యంపై ప్రభుత్వం చేసే వ్యయంలో 'ప్రాథమిక ఆరోగ్య రక్షణ'కు 70% కేటాయించాలి. వ్యాధి నివారణ, సత్వర వ్యాధి నిర్ధారణ - చికిత్సల ద్వారా ప్రాథమిక స్థాయిలో వ్యాధులను అరికడితే, ఖరీదైన వైద్య సేవల అవసరం క్రమేపీ తగ్గుతుంది. వివిధ పథకాల ద్వారా వివిధ మంత్రిత్వశాఖల ఆధీనంలో ఉన్న అన్నిరకాల వైద్య సేవలను 'జాతీయ ఆరోగ్య హక్కు కార్డు' ద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధీనంలోనికి బదలాయించాలి. దీనిద్వారా నిధుల కేటాయింపు, వ్యయాలను హేతుబద్ధంగా నియంత్రించవచ్చు.
2. ఔషధాలు.. టీకాలు..
'అవసరమైన మందుల జాబితా'ను హేతుబద్ధం చేసి, ఆ జాబితాలో ఉన్న మందులను ప్రజలందరికీ ఉచితంగా అందేలా చూడాలి. ఇపుడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు కలిపి జి.డి.పి.లో 0.1% నిధులను వెచ్చిస్తున్నది. దీనిని 0.5 శాతానికి పెంచినట్లైతే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలందరికీ అవరమైన మందులను ఉచితంగా ఇవ్వవచ్చు. మందుల రేట్లను ప్రైవేటు కంపెనీల ఇష్టానికి వదిలేయకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలి. ఔషధాల నాణ్యతను పర్యవేక్షించే యంత్రాంగాన్ని పటిష్టం చేసి, నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించే కంపెనీలపై కఠినచర్యలు తీసుకోవాలి. ప్రభుత్వరంగ మందుల మరియు టీకాల తయారీసంస్థలను పునరుద్ధరించి, బలోపేతం చేయాలి. అప్పుడు మాత్రమే మన దేశ అవసరాలకు అనుగుణంగా ఎల్లవేళలా మందులు, టీకాలను గ్యారంటీ చేయవచ్చు. అంతర్జాతీయ పేటెంట్‌ చట్టాలు మన ప్రజలకు ఔషధాలు, టీకాలు అందించడానికి అడ్డురాకుండా ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవాలి.
3. వైద్యులు, ఇతర సిబ్బంది..
మన దేశం అవసరాలకు తగినంత వైద్య సిబ్బంది (డాక్టర్లు, నర్సులు, అసిస్టెంట్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు మొదలైనవారు.) లేరు. ఉన్న సిబ్బంది కూడా అసమానంగా పంపిణీ చేయబడి ఉన్నారు. మరికొన్ని రాష్ట్రాలు అవసరానికి మించి వైద్యులను ఉత్పత్తి చేస్తుంటే, కొన్ని రాష్ట్రాలలో వీరి కొరత తీవ్రంగా ఉంది.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది ప్రజలకు 23 మంది వైద్య సిబ్బంది (కేవలం డాక్టర్లే కాదు) కావాలి.
* ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు ఎంబిబిఎస్‌ వైద్యులు, ఒక ఆయుష్‌ వైద్యుడు, ఒక దంత వైద్యుడు ఉండాలి. అక్కడ వైద్యులు పనిచేయడానికి అనువైన పరిస్థితులు కల్పించాలి. పరిపాలనా విధుల నుండి వైద్యులను తప్పించి, అందుకు అవసరమైన సిబ్బందిని వేరే నియమించాలి.
* గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ వాడల్లో వైద్యసేవలు అందించడానికి పూర్తిగా వైద్యులపై ఆధారపడడం అశాస్త్రీయం. అందుకు అవసరమైన ఇతర సిబ్బందిని శిక్షణ ఇచ్చి, నియమించి వారిని వైద్యుల పర్యవేక్షణలో పనిచేయించాలి.
* ఆరోగ్య ఉప కేంద్రాలలో (ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకంటే దిగువస్థాయిలో ఉంటాయి. ప్రతి ఐదు వేల జనాభాకు ఒక ఉపకేంద్రం ఉండాలి.) వైద్యసేవలు అందించడానికి 'బ్యాచిలర్‌ ఆఫ్‌ రూరల్‌ హెల్త్‌ కేర్‌' అనే మూడేళ్ల కోర్సును ప్రవేశపెట్టి, నియమించాలి.
* గ్రామాలలో ఇపుడు ప్రతి వెయ్యి జనాభాకు ఒక స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్త (ఆశా) ఉండాలి. కానీ, ప్రతి వెయ్యిమందికీ ఇద్దరు ఆశాలను నియమించి, వారికి ఫస్ట్‌ ఎయిడ్‌, ఆరోగ్య విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం వంటి అంశాలలో శిక్షణ ఇచ్చి, అంగన్‌వాడీలతో సమన్వయం చేసి విధులను కేటాయించాలి. వీరికి తగిన వేతనం నిర్ణయించి, సక్రమంగా చెల్లించాలి.
* పట్టణాలలో ప్రతి వెయ్యిమందికి ఒక పట్టణ ఆరోగ్యకార్యకర్తను నియమించాలి.
* నర్సింగ్‌ సిబ్బంది సంఖ్యను మన దేశ వైద్య అవసరాలకు అనువుగా పెంచాలి. సాధారణ నర్సింగ్‌ సేవలకు సరిపడా నర్సులను నియమించడం ద్వారా వైద్యులను క్లిష్లమైన వైద్య ప్రక్రియలపై కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. దేశంలో ప్రస్తుతం దాదాపు 9 లక్షల మంది నర్సులు ఉన్నారని అంచనా. వీరి సంఖ్యను 2017 నాటికి 17 లక్షలకు, 2022 నాటికి 27 లక్షలకు పెంచాలి.
* దేశ ఆరోగ్య అవసరాలకు అనువుగా వైద్య విద్యా బోధనను సంస్కరించాలి. కొత్త వైద్య కళాశాలలు అవసరమైన ప్రాంతాలలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను టీచింగ్‌ ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేయాలి. వైద్య విద్యలో వ్యాపారధోరణిని నియంత్రించాలి.
* వైద్య సిబ్బంది తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకొనేలా నిరంతర వైద్యవిద్యను అందించాలి. సిబ్బంది పదోన్నతులలో దీనినీ పరిగణించాలి.
4. ఆరోగ్య సేవల విధి విధానాలు..
* గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు వివిధ స్థాయిలలో ప్రజలకు ఉచితంగా అందించే అవసర వైద్యసేవల జాబితా రూపొందించి 'జాతీయ ఆరోగ్య హక్కు కార్డు' ద్వారా ఆ సేవలు అందుకొనే హక్కును ప్రజలందరికీ కల్పించాలి.
* ఈ జాబితాలో లేని ఐచ్ఛిక సేవలను (ఉదా: కాస్మెటిక్‌ సర్జరీ, ఊబకాయం తగ్గించుకొనే బేరియాట్రిక్‌ సర్జరీ మొదలైనవి) ప్రజలు డబ్బు చెల్లించి పొందవలసి ఉంటుంది.
* ప్రజలందరికీ చికిత్స అందించడం కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో సాధ్యం కాదు, కనుక అవసరమైన సందర్భాలలో, ప్రభుత్వ సేవలకు అనుబంధంగా ప్రైవేటురంగం నుంచి సేవలను 'కాంట్రాక్ట్‌ ఇన్‌ పద్ధతి' ద్వారా వినియోగించుకోవచ్చు. అయితే ప్రైవేటు రంగం పాత్ర ప్రభుత్వరంగ వైద్య సేవలకు అనుబంధంగా ఉండాలే తప్ప సమాంతర వ్యవస్థగా ఉండరాదు. ఈ సందర్భాలలో చేసుకొనే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పి.పి.పి.) ఒప్పందాలన్నీ పారదర్శకంగా, సమాచార హక్కు చట్టానికి లోబడి ఉండాలి.
* సార్వత్రిక ఆరోగ్య రక్షణ కోసం వైద్య సేవలు అందించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తగిన ప్రమాణాలు పాటించేలా అక్రిడిటేషన్‌ బోర్డు పర్యవేక్షించాలి.
* సార్వత్రిక ఆరోగ్య రక్షణ సేవలు ప్రధానంగా వైద్యంపై కేంద్రీకరించాలి.
* గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేద ప్రజలందరికి కావలసిన చికిత్సలు లభించేలా పటిష్టమైన పాలనా చర్యలు చేపట్టాలి.
5. ప్రజారోగ్యంలో ప్రజల భాగస్వామ్యం..
* ఆరోగ్య సేవల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో అన్నిస్థాయిలలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యతను పెంచుతుంది. ఆరోగ్య అసమానతలను తగ్గిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేస్తుంది.
* ప్రజారోగ్య మండళ్లను ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయి నుండి వీటిని మండలాలు, పట్టణాలు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ఏర్పాటు చేయాలి. వీటిలో ఎన్‌జివోలు, ప్రజాసంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు, వైద్య సిబ్బందికి ప్రాతినిధ్యం కల్పించాలి.
* ఈ మండళ్లు తమ పరిధిలోని ఆరోగ్య కార్యక్రమాల రూపకల్పనను, సేవల లభ్యతను, ప్రమాణాల పర్యవేక్షణను, నిధుల వినియోగాన్ని, ఆరోగ్య సూచీలలో మెరుగుదల వంటి అంశాలను పర్యవేక్షించాలి.
* ఈ మండళ్లు సమర్థవంతంగా పనిచేయడానికి కావలసిన నిధులను ప్రభుత్వమే కేటాయించాలి.
* ఈ మండళ్లు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో వార్షిక ఆరోగ్య అసెంబ్లీలను నిర్వహించి అన్ని ఆరోగ్య సంబంధ అంశాలను చర్చించి, ప్రభుత్వానికి తగిన సూచనలు అందించాలి.
* స్థానిక సంస్థల ప్రతినిధులు ఈ మండళ్లలో భాగస్వాములుగా ఉండాలి. స్థానిక సంస్థలకు ఇవి జవాబుదారీగా ఉండాలి.
* ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తగిన యంత్రాంగాన్ని నియమించాలి.
6. యాజమాన్య, వ్యవస్థాగత సంస్కరణలు..
* సార్వత్రిక ఆరోగ్య రక్షణ సేవలు సమర్థవంతంగా అందించేలా ప్రభుత్వ అసుపత్రులను సంసిద్ధం చేయడానికి అవసరమైన యాజమాన్య, వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలి.
* జాతీయ మరియు రాష్ట్రాల స్థాయిలో 'పబ్లిక్‌ హెల్త్‌ సర్వీస్‌ కాడర్‌'ను ప్రవేశపెట్టాలి. ప్రజారోగ్యానికి సంబంధించిన బహుళరంగ నైపుణ్యంతో ఆరోగ్య రక్షణ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయించేందుకు ఈ తరహా సిబ్బంది అవసరం.
* తగిన శిక్షణ పొందిన హాస్పిటల్‌ మేనేజర్స్‌ను ఆసుపత్రులలో నియమించి, పరిపాలనా బాధ్యతలను వారికి అప్పజెప్పాలి.
*ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బందికి సహేతుకమైన వేతనాలను, ఇతర అలవెన్సులను అందిస్తూ, వారికి తగిన పారితోషకాలు, పదోన్నతులు కల్పించాలి. బాగా పనిచేసేవారిని గుర్తించి, ప్రోత్సహించాలి. విధులను నిర్లక్ష్యం చేసే వారిపై పాలనాపరమైన చర్యలు తీసుకోవాలి.
'ప్రజారోగ్యం'.. నిర్వచనం..,
''ఆర్థిక, సామాజిక, లింగ, కుల, మత వివక్ష / విచక్షణ లేకుండా దేశంలోని పౌరులందరికీ నాణ్యమైన, వారి అవసరాలకు తగిన విధంగా, వారికి జవాబుదారీగా ఉండే సమగ్రమైన ఆరోగ్య సేవలకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. విస్తృతస్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 'ప్రజారోగ్య సంబంధమైన సేవలకు హామీ ఇస్తుంది. ఈ సేవలన్నింటినీ ప్రభుత్వమే స్వయంగా అందించకపోయినా, అవి అందరికీ అందేలా హామీ ఇచ్చి అమలుచేస్తుంది.'' అని ప్రజారోగ్యం, వైద్యం ఎలా వుండాలో దిశా నిర్దేశంగా కమిటీ నిర్వచించింది.
సార్వత్రిక ఆరోగ్య రక్షణ అంటే..
* ఆరోగ్య సేవలలో సమన్యాయం.
* వైద్య ఖర్చుల నుంచి ప్రజలందరికీ రక్షణ.
* ఆరోగ్యవంతమైన ప్రజలు.
* 40 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు.
* పారదర్శకమైన, సమర్థవంతంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వ వైద్యవ్యవస్థ.
* ప్రజల ఉత్పాదక సామర్థ్యంలో పెరుగుదల.
* పేదరికం తగ్గుదల.

No comments:

Post a Comment