Wednesday 11 April 2012

ధరిత్రి వాతవరణ మార్పులు.. స్థిరీకరణ

భూగోళ వాతావరణమార్పులు దీనిపై నివసిస్తున్న జీవాల మనుగడని, కార్యక్రమాల్ని, పరిణామ క్రమాల్ని నిర్ధారిస్తున్నాయి. ఈ మార్పులు మానవ మనుగడ, సంస్కృతి, అభివృద్ధిపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. భూగోళ వాతావరణంలో వచ్చిన తీవ్ర, ఆకస్మిక మార్పులు ఆయా సమయాల్లో ఉన్న జీవరాశుల్ని అంతరింపజేశాయి. తన జీవితకాలంలో ఎంతో శక్తివంతమైన డైనోసార్స్‌ వంటి జంతువులు ఈ మార్పుల వల్లే అంతరించిపోయాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. అంటే, నేడు భూమిపై మనం చూస్తున్న జీవరాశులు ఎన్నో మార్పులకులోనై పునరుద్ధరింపబడి జీవిస్తున్నాయి. ఇక భూగోళ వాతావరణంలో ప్రస్తుతం వచ్చిన, వస్తున్న చిన్నపాటి మార్పులు కూడా అన్ని జీవాల మనుగడకు, అభివృద్ధికి సవాల్‌గా నిలుస్తున్నాయి. ఈ మార్పుల్లో భూగోళ వాతావరణం క్రమంగా వేడెక్కడం ఒక ముఖ్యభాగం. ఇది సాధించిన అభివృద్ధిని వమ్ము చేసేదిగా ఉంది. ఈ నేపథ్యంలో భూగోళ వాతావరణమార్పుల్ని నివారించి, స్థిరీకరించాల్సిన ప్రాముఖ్యతను అందరిచే గుర్తింపజేసే లక్ష్యంతో 'అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవాన్ని' ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 22న జరపాలని ఐక్య రాజ్యసమితి 2009లో నిర్ణయించింది. 2012 భూగోళ దినోత్సవాన్ని ''సుస్థిర భవిష్యత్తు కోసం, లెక్కించగల పరిణామ లక్ష్యాల్ని సాధించేందుకు అన్ని గళాల్నీ ఏకం చేసేలా కార్యక్రమాలు రూపొం దించింది. ఈ నేపథ్యంలో, భూగోళ వాతావరణమార్పులు, స్థిరీకరణలో ఇమిడిన ప్రధానాంశాలను క్లుప్తంగా తెలుపుతూ మొదటిభాగంగా ఈ వారం మీ ముందుకు వచ్చింది 'విజ్ఞానవీచిక'.
ధరిత్రీ దినోత్సవ ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలంటే భూగోళ, మానవ పరిణామక్రమాల్ని అర్థంచేసుకోవాలి. భూగోళ పరిణామక్రమం కొనసాగుతున్నప్పటికీ ఫృథ్వీపై వివిధ జీవరాశుల ఆవిర్భావం, పరిణామక్రమం కూడా కొనసాగింది.
భూగోళ ఆవిర్భావం.. పరిణామం..
భూగోళం దాదాపు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. అప్పుడు ఇది కేవలం కరిగిపోయిన 'రాయి ముద్ద'గా ఉండేది. ఆ సమయంలో దాని ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 4000 డిగ్రీల సెంటీగ్రేడ్‌. చల్లారి, పైన గట్టిపొర ఏర్పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందని అంచనా వేశారు.
విశ్వంలో ఎన్నో గ్రహాల చుట్టూ ఎటువంటి వాతావరణం ఇప్పటికీ లేదు. ఈ విధంగానే, భూగోళం ప్రారంభమైనప్పుడూ దానిపై ఏ ప్రత్యేక వాతావరణమూ లేదు. కానీ, అగ్నిపర్వతాల పేలుడుతో వెలువడిన వాయువుల వల్ల 'ప్రాథమిక వాతావరణం' ఏర్పడింది. అయితే, దానిలో ఆక్సిజన్‌ లేదు. మొదట జీవం (బ్లూ గ్రీన్‌ ఆల్గే) దాదాపు 350 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది ఆక్సిజన్‌ అవసరం లేకుండా జీవించింది. మొక్కలు ఆవిర్భవించిన తర్వాతనే ఆక్సిజన్‌ ప్రధానంగా విడుదలై వాతావరణంలో చేరింది. దాదాపు 100 కోట్ల సంవత్సరాల క్రితమే ప్రాథమిక జంతువులు ఆవిర్భవించాయి. అయితే, 55 కోట్ల సంవత్సరాల క్రితం భూగోళంపై జీవాలు ఒకేసారి వేగంగా ఏర్పడి, విస్తరించినట్లు కూడా ఈ సాక్ష్యాలు తెలుపుతున్నాయి. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఆవిర్భవించాయి. కానీ, 13.5 కోట్ల సంవత్సరాల తర్వాత (ఇప్పటికి ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం) అవి పూర్తిగా అంతరించాయి. అయితే, ఆదిమానవుడు దాదాపు 20 లక్షల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించాడు.
మానవ పరిణామక్రమం..
మానవుడు కోతి నుండి పరిణామం చెంది చక్కగా నిలుచునే వరకూ వేగంగా మార్పులు జరిగాయి. వాతావరణ పరిస్థితులనుబట్టి పొడుగ్గానో, పొట్టిగానో, లావుగానో, సన్నగానో లేదా నలుపుగానో, తెలుపుగానో ఉండేవాడు. కానీ, ఆకృతుల్లో మనుషులంతా ఒకేలా ఉండేవారు. పరిసరాలకు అనుగుణంగా జీవనశైలిని రూపొందించుకునే ప్రక్రియలో వివిధ సంస్కృతులూ వచ్చాయి.
దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం చెట్లను ఎలా పెంచుకోవాలో? కొన్ని జంతువుల్ని సాధు జంతువులుగా ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నారు. దీనితో మానవులు స్థిర నివాసాలు (ఇప్పటి గ్రామాలు, ఆ తర్వాత పట్టణాలు) ఏర్పర్చుకున్నారు. మానవ సంబంధాలూ ఏర్పడ్డాయి. వివిధ వాతావరణ పరిస్థితులు భిన్న సంస్కృతులకు దోహదపడ్డాయి. ఉత్పత్తి క్రమంలో వచ్చిన మార్పులు ఆ తర్వాత ఏర్పడిన సమాజ చరిత్రకు దోహదపడ్డాయి.
గుంపులతో ప్రారంభమైన మానవాభివృద్ధి చరిత్ర చిన్న, చిన్న సమూహ నివాస ప్రాంతాలుగా, రాజ్యాలుగా, బానిస సమాజంగా, భూస్వామ్య సమాజంగా, పెట్టుబడిదారీ సమాజంగా, సోషలిస్టు సమాజంగా పరిణామం చెందాయి. ఈ పరిణామక్రమం అన్ని ప్రాంతాల్లో ఒకేలా సరళరేఖలా కాకుండా ఎగుడు, దిగుడులతో కూడుకొన్నది. ఇది వేరే విషయం. మానవ విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ 18, 19వ శతాబ్ధాలలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఇది వేగవంతమైన మార్పులకు దారి తీసింది ఈ కాలంలోనే. సైన్స్‌ వేగంగా అభివృద్ధి చెందింది. తద్వారా ఆధునిక విజ్ఞానం ఏర్పడింది. ఇదే సమయంలో యుద్ధ తంత్రాలూ పెరిగాయి. విజ్ఞానం ఒకవైపు మానవ సౌకర్యాల అభివృద్ధికీ దోహదపడుతూనే మరోవైపు భూగోళ అస్థిరత్వానికీ దోహదపడుతుంది. అంటే, పెద్దఎత్తున జరిగే యుద్ధాలకూ కారణమవుతుంది. ఆకస్మిక మార్పుల వల్ల భూగోళం మీద ఉన్న జీవాలు 5, 6 సార్లు పూర్తిగా లేదా పాక్షికంగా అంతరించిపోయాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
రాగల ఈ దుష్పరిణామాల్ని నివారించడానికి, భూగోళాన్ని, దాని వాతావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తింప చేయడానికి ధరిత్రీ దినోత్సవం ప్రతి సంవత్సరం జరపాలని నిర్ణయించారు. ఇది అమెరికాలో 1970లో ప్రారంభమైంది. 1970 ఏప్రిల్‌ 22ను 'ఆధునిక పర్యావరణ ఉద్యమ పుట్టుక'కు చిహ్నంగా తీసుకున్నారు. అంతకంటే ముందే 1962లో 'రాచెల్‌ కార్సన్‌' అనే శాస్త్రజ్ఞుడు సైలెంట్‌ స్ప్రింగ్‌ అనే పేరుతో వివిధ రసాయనాలు కాలుష్యాన్ని, పర్యావరణానికి ఎలా నష్టాల్ని కలిగిస్తాయో తెలిపారు. ఇది పర్యావరణ పరిశోధనలకు, ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది.
వాతావరణ మార్పులు..
భూగోళ వాతావరణంలో మార్పులు మొత్తంగాగానీ, కొన్ని ప్రాంతాలకుగానీ పరిమితమై ఉండవచ్చు. ఈ మార్పులు కొన్ని లక్షల సంవత్సరాల నుండి లేక కొన్ని శతాబ్దాలు లేదా దశాబ్దాల కాలంగా కొనసాగవచ్చు. ఈ మార్పులు సహజ లేదా మానవ కార్యకలాపాల వల్ల జరగవచ్చు.
ప్రకృతి పరిణామాలు, మానవుడి జీవనశైలి వల్ల కార్బన్‌ డై ఆక్సైడ్‌, మీథేన్‌, నైట్రేట్‌ ఆక్సైడ్‌లు విడుదల అవుతున్నాయి. ఇవి వాతావరణంలో క్రమంగా చేరి, కొనసాగుతున్నాయి. భూగోళం మీద సూర్యరశ్మి పడినప్పుడు కొంతభాగం తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతుంది. ఇలా పరావర్తనం చెందిన సూర్యరశ్మి వాతావరణాన్ని విడిపోకుండా ఈ వాయువులు అడ్డుకుంటున్నాయి. వేడెక్కుతాయి. ఈ వేడిని తిరిగి భూమి వైపు పరావర్తనం చెందిస్తున్నాయి. వాతావరణాన్నీ వేడెక్కిస్తు న్నాయి. ఇలా వేడెక్కడం వల్ల భూగోళం మీద చలి తగ్గి, ఉష్ణోగ్రత పెరిగి, ఎన్నో కొత్త జీవాలు, ముఖ్యంగా చెట్లు ఆవిర్భావించాయి. దీనివల్ల భూగోళం మీద మంచు కరిగిపో యింది. ఇలా వేడెక్కిన భూగోళం సగటు వాతావరణ ఉష్ణోగ్రత ఇప్పటికన్నా కనీసం 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ తక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. అంటే, ఇప్పుడు భూగోళం మీద ఉన్న జీవాల్లో ఎక్కువభాగం ప్రకృతిలో సహజంగా కొనసాగిన గ్రీన్‌ హౌస్‌ వాయువుల ప్రభావంవల్ల ఆవిర్భించాయని చెప్పవచ్చు. అయితే, మానవ కార్యకలాపాల వల్లా ఈ వాయువుల విడుదల ఎక్కువైంది. ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం తర్వాత, కేవలం 1970-2004 మధ్యకాలంలో వాతావరణంలో ఈ వాయువు లు 70 శాతం పెరిగాయి. ఈ వాయువులే కాక, వివిధ అవసరాల కోసం మానవులు ఉత్పత్తి చేస్తున్న క్లోరోఫ్లోరో కార్బన్‌లు, హైడ్రో క్లోరో కార్బన్‌లు, ఫర్‌ఫ్లూరో కార్బన్‌లు, సల్ఫర్‌ హెక్సా ఫ్లోరైడ్‌లు కూడా వాతావరణాన్ని వేడెక్కేలా చేస్తున్నాయి. ఇలా సగటు ఉష్ణోగ్రత పెరగటాన్ని 'భూగోళ వాతావరణం వేడెక్కడం' (గ్లోబల్‌ వార్మింగ్‌) గా వ్యవహరిస్తున్నాం.
ఇలా వేడెక్కడం వల్ల భూగోళంలో ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా, మన దేశంలో వర్షాల రాకపోకల్లో ఎన్నో మార్పుల్ని చూస్తున్నాం. వీటిలో అనిశ్చిత కూడా పెరుగుతుంది. ఈ మార్పుల ప్రభావం దీర్ఘకాలం (వందేళ్ల వరకూ) కొనసాగుతాయి. అందువల్ల, భూగోళం వేడెక్కకుండా తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలి. వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల సాంద్రత పెరుగుతున్న కొద్దీ వేడెక్కడమూ పెరుగుతుంది. ఇప్పటి స్థితే కొనసాగితే 21వ శతాబ్ధంలో సగటు ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల..
ఈ వాయువుల విడుదల, భూగోళ వాతావరణమార్పులు ఉత్పత్తిలో వినియోగించే శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం మీద, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల మీద, దౌత్య సంబంధాల (యుద్ధాలు, మౌలిక వనరుల దుర్వినియోగం) మీద, రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది. విశ్వజనావళికి ఆధారంగా ఉన్నది ఒక్కటే భూగోళం. దీని వాతావరణాన్నే అందరూ పంచుకోవాలి. 1992లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయిలో జరిగిన వాతావరణ మార్పులపై జరిగిన సమావేశంలో (క్యోటో ఒప్పందం) గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను పరిమితం చేయడానికి అన్నిదేశాలూ వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించబడింది. ప్రారంభ చర్యగా కనీసం 2000 సంవత్సరానికి గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను 1990 స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించారు. కానీ, ఇది అమలు కాలేదు. 1990-2005 మధ్యకాలంలో అభివృద్ధి చెందిన 40 దేశాలలో 26 దేశాల కార్బన్‌ డై ఆక్సైడ్‌, గ్రీన్‌ హౌస్‌ వాయువుల విడుదల పెరిగింది. కానీ, ఇదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు వాయువుల విడుదల 39 శాతం తగ్గింది. అంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ జీవనశైలిని, ఆర్థిక కార్యక్రమాలను, సాంకేతికాలను మార్చుకుని, గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను పరిమితం చేసినప్పుడే భూగోళ వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను లక్ష్యానికి అనుగుణంగా పరిమితమవుతుంది. అంతే తప్ప ఒక్క అభివృద్ధి చెందుతున్న దేశాలే ఈ వాయువుల విడుదలని కట్టడి చేసి, భూగోళం వేడెక్కడాన్ని అడ్డుకోలేవు. దురదృష్టంగా అత్యధిక కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాయువుల్ని విడుదల చేస్తున్న అమెరికా పై ఒప్పందం మీద సంతకం చేయలేదు. కానీ, భారతదేశంలాంటి అభివృద్ధి చెందిన దేశాలు గ్రీన్‌ హౌస్‌ వాయువుల విడుదలను పరిమితం చేయడానికి ఎంతో ఖర్చుతో కూడిన సాంకేతికాలను చేపడ్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల మాత్రం కాలుష్యం బాగా కలిగించే పరిశ్రమలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలిస్తూ లేదా కార్బన్‌ క్రెడిట్‌లను కొనుగోలు చేస్తూ అసలు బాధ్యత నుండి తప్పించుకుంటున్నాయి.
అభివృద్ధి చెందిన దేశాలు గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించే సాంకేతికాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వడం ద్వారా రాగల లాభాల అంచనాపైనే కేంద్రీకరిస్తున్నాయే తప్ప, తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యతను నెరవేర్చడం లేదు.
ఒక అంచనా ప్రకారం గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల, రిస్క్‌ను తగ్గించడానికి మొత్తం ప్రపంచ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం ఖర్చయితే, ఈ ఖర్చు చేయకుండా మానివేస్తే వచ్చే దుష్ప్రరిణామాల్ని ఎదుర్కోడానికి 20 రెట్లు అధికంగా ఖర్చవుతుందట.
దుష్ప్రరిణామాలు..
వేడెక్కుతున్న వాతావరణం వ్యవసాయోత్పత్తిని దెబ్బతీస్తుంది. చలి దేశాలలో ఒకటి నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వేడి పెరిగితే పంట దిగుబడులు పెరుగుతాయని అంచనా. కానీ, మనలాంటి ఉష్ణ ప్రాంతాల్లో 1-2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత పెరిగినా ప్రధాన ఆహారపంటల (వరి, గోధుమ) దిగుబడి తగ్గిపోతుంది. 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత పెరిగితే అన్ని దేశాల్లో వ్యవసాయోత్పత్తి తగ్గుతుందట. ఈ దుష్ప్రరిణామాలు పేద దేశాల ప్రజలపై తీవ్రంగా ఉంటాయి. ఈ దేశాలలో కూడా పేదలే ఇంకా తీవ్రంగా నష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని భరించే శక్తి కూడా వారికి తక్కువ. కానీ, ధనిక దేశాలు తమ అంగ, అర్ధ బలాలతో తమ భారాల్ని అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఏదో రూపంలో నెడ్తున్నాయి. ఇప్పటి వాతావరణమార్పుల ధోరణి ఇలాగే కొనసాగితే మన ప్రధాన నదులైన గంగా, సింధూ, బ్రహ్మపుత్ర 2030 నాటికి పూర్తిగా అంతరించిపోతాయట!
వాతావరణంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్ని ఇప్పటికే మనం అనుభవి స్తున్నాం. వ్యవసాయోత్పత్తిపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. 2020 నాటికి మన దేశంలో 7.5 నుండి 25 కోట్ల మంది ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందట!
పెరుగుతున్న భూగోళ ఉష్ణోగ్రతలు సముద్రపు నీటిమట్టాలను పెంచుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ధృవప్రాంతాల్లో మంచును కరిగిస్తాయి. దీంతో సముద్ర మట్టాలు పెరుగుతాయి. 1993 నుండి ప్రతి ఏడాది సముద్ర మట్టం 3 మి.లీ. పెరుగుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. భూగోళ వాతావరణ ఉష్ణోగ్రత 3-4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగితే 33 కోట్ల ప్రజలు తాత్కాలికంగా లేక శాశ్వతంగా వరద పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుందట. ఇది తుపానులు తరచుగా రావడానికి కూడా దోహదపడుతుంది.
మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ రాష్ట్ర ప్రజలు పెరుగుతున్న సముద్రమట్టం దుష్ఫలితాలను ఎదుర్కొంటారు. అదేవిధంగా, పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా, తదితర రాష్ట్రాల ప్రజలు తుపాను ప్రమాదాల్ని మరింతగా ఎదుర్కోవాల్సి వస్తుంది.
మన జీవవైవిధ్యం ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో దెబ్బతింటుంది. గంగా, సింధూ మైదానంలో వ్యవసాయోత్పత్తి దెబ్బతింటుంది. మన ఆరోగ్యాల మీద కూడా దీని దుష్ప్రభావాలు ఉంటాయి.
ఏంచేయాలి?
ఈ సందర్భంగా పర్యావరణం ప్రాధాన్యతను తెలియజేయడానికి కార్యక్రమాల్ని చేపట్టాలి. మన చుట్టూ ఉన్న వారికి పర్యావరణ ప్రాధాన్యత గురించి చైతన్యం కలిగించాలి. ప్రధానంగా వాతావరణంలో వచ్చే మార్పుల్ని విడమరిచి చెప్పాలి. హరిత సాంకేతిక అంశాలను చెప్పి, వారిచే ఆచరింపజేయాలి. ఈ సంవత్సర ధరిత్రీ దినోత్స వంలో భాగంగా 'సుస్థిర భవిష్యత్తు' అనే ప్రధానాంశంతో విశ్వమానవాళిని సమీ కరిస్తున్నారు. భూగోళాన్ని పరిరక్షించే బాధ్యతలో భాగస్వామ్యం కావాలనే కాంక్షను ప్రతి ఒక్కరిలో కలిగించాలి. ఇందుకు చెట్లను నాటించాలి. వ్యర్థాల్ని తగ్గించాలి. పునర్వి నియోగించగల వస్తువుల్నే వాడాలి. రసాయనాలకు బదులుగా సేంద్రీయ ఉత్పత్తులనే వాడాలి. విద్యుత్‌ వినియోగంలో పొదుపు పాటించాలి. 'ఫ్లోర్‌సెంట్‌ బల్బుల్ని' వాడాలి. చేతి సంచుల్ని పునరుద్ధరించాలి. కాలుష్యాన్ని నివారించాలి. పునరుపయోగించగల ఇంధనం (శక్తి) అందరికీ అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాలి. దీనికోసం బడ్జెట్‌ పెంచేందుకు కృషి చేయాలి. ఇంధన వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ అది అవసరం మేర అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి.
ఎవరు బాధ్యులు?
ప్రపంచంలో విడుదలయ్యే మొత్తం గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో (1985-2008 మధ్య కాలం) అగ్రస్థానంలో ఉన్న పది దేశాల భాగస్వామ్యం ఇలా ఉంది (శాతంలో): అమెరికా-28.5; చైనా-9.3; రష్యా-7.95; జర్మనీ-6.78; బ్రిటన్‌-5.73; జపాన్‌-3.88; ఫ్రాన్స్‌-2.73; భారత్‌-2.52; కెనడా-2.17; ఉక్రెయిన్‌-2.33.
2009లో ఈ వాయువుల తలసరి వార్షిక విడుదల (టన్నుల్లో) ఇలా (శాతంలో) ఉంది: అమెరికా-16.9; రష్యా-10.8; ద.కొరియా-10.6; జర్మనీ-9.2; జపాన్‌-8.6; చైనా-5.13; బ్రిటన్‌-7.5; భారత్‌-1.37.
వినియోగించే ఇంధనం ఆధారంగా కాక, ఉపయోగిస్తున్న వస్తువుల తయారీలో విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయువుల మొత్తాల్ని ఆధారంగా తీసుకుంటే 2004లో లక్సెంబర్గ్‌ సగటు విడుదల అత్యధికంగా 34.7 టన్నులుగా ఉంది. అమెరికాలో-22.0; సింగపూర్‌లో-20.2; ఆస్ట్రేలియాలో-16.7; కెనడాలో-16.6 టన్నులుగా ఉంది.
మన దేశంలో అనుసంధాన కార్యక్రమాలు..
మన దేశంలో 40వ వార్షికోత్సవం (2010) నుండి ధరిత్రీ దినోత్సవ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టబడ్డాయి. 2011లో 170 పట్టణాల్లో 29 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. వేలాదిమంది ప్రజలు పాల్గొని, కార్బన్‌ వాయువుల విడుదలను తగ్గిస్తూ సుస్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి దీక్షాబద్ధులయ్యారు. తద్వారా ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో భారతీయులు కూడా భాగస్వాములు కావడానికి వీలైంది. 2012లో దాదాపు 10 లక్షల మందిని కదిలించడానికి కార్యక్రమాలు రూపొందాయి. దీనిలో చెట్లు నాటడం, హరిత సాంకేతికాల వినియోగాన్ని ప్రచారం చేయడం, సామూహిక కార్యక్రమాలు నిర్వహించడం అనేవి ప్రధానంగా తీసుకున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని, వారిద్వారా విద్యార్థుల్ని భవిష్యత్తరాల ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. మహిళలకు హరిత సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక అంశాలపై అవగాహన కలిగించే కృషి ఈ సంవత్సరం కొనసాగనుంది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment