Wednesday 7 March 2012

చావు తేదీని చెప్పి.. విఫలమైన జ్యోతిష్యుడు


  • విశ్వాసాలు.. వాస్తవాలు...68
అది మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ గ్రామం. తేది అక్టోబరు 19, 2005 తెల్లవారేటప్పటికే ఆ గ్రామంలోకి స్టార్‌ న్యూస్‌, సహారా, ఆజ్‌తక్‌ ఛానళ్ల ప్రతినిధులు ఫొటోగ్రాఫర్లతో సహా చేరారు. ఎందుకో తెలుసా? ఆ గ్రామానికి చెందిన కుంజీలాల్‌ అనే జ్యోతిష్యుడు ఆ రోజు మధ్యాహ్నాం 3-5 గంటల మధ్య తాను చనిపోతున్నట్లు ప్రకటించాడు. ఆయన మరణాన్ని, జ్యోతిష్యం యొక్క గొప్పతనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయటానికి ఆ టీవి ఛానళ్లు వచ్చాయి. అంతేకాదు, ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా చర్చా కార్యక్రమాన్ని కూడా ఆ ఛానళ్లు ఏర్పాటు చేశాయి. చర్చ కోసం ప్రతి ఛానల్‌ ముగ్గురు జ్యోతిష్యులను, ఒక హేతువాదిని పిలవడం జరిగింది. క్రమంగా ఈ కార్యక్రమ వాతావరణం వేడెక్కింది. ఒకపక్క బేతుల్‌ గ్రామంలో కుంజీలాల్‌ను, ఆ గ్రామంలో కొంతమంది చేస్తున్న నృత్య కార్యక్రమాన్నీ, రెండోపక్క స్టూడియోలో జరుగుతున్న చర్చా కార్యక్రమాన్ని ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఆ 'జాతక' ఛానల్‌ కార్యక్రమంలో జ్యోతిష్యులు ముగ్గురైనప్పటికీ హేతువాది ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ''జ్యోతిష్యాన్ని విమర్శించవలసిన పని హేతువాదికేం ఉంది?'' అంటూ వితండవాదనకు దిగారు. అంతకంటే విశేషమేమంటే ''ఈ దేశంలో మూఢవిశ్వాసాలు బహుళంగా ఉన్నప్పటికీ, జ్యోతిష్యం శాస్త్రమే''నంటూ ఆజ్‌తక్‌ యాంకర్‌ తీర్పు చెప్పారు. సమయం 3 గంటలు అయింది. నాలుగు, ఐదు, ఐదు దాటింది. కుంజీలాల్‌ గుండ్రాయిలా, మామూలుగా ఉన్నాడు. అంతేకాదు, 'మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం నేను మరణించడం లేదు' అంటూ ప్రకటించాడు. దీనర్థం ఏమిటి? పైనున్న గ్రహాలు అతను మరణించవలసిందేనని శాసిస్తున్నా, భూమి మీద ఉన్న వ్యక్తులు, మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం ఎవరైనా బతకదల్చుకుంటే, బతుకుతారన్న మాట! గ్రహాలకు ఏమీ ప్రత్యేక శక్తి లేదన్న మాట! జ్యోతిష్యం శాస్త్రం కాదన్న మాట! అయినా ఆ ఛానళ్లు ''జ్యోతిష్యం శాస్త్రమే'' నంటూ ముగింపు వాక్యాలు పలకడం ఎందుకు జరిగిందో పాఠకులు, వీక్షకులూ ఆలోచించవలసిన విషయం..!
కొసమెరుపు : జ్యోతిష్యం శాస్త్రమేనంటూ తీర్పు చెప్పిన ఛానళ్లన్నీ 2005, సెప్టెంబర్‌ 29న దేశ వ్యాప్తంగా లక్షలాది కార్మికులు తమ ఉద్యోగ భద్రత కోసం చేసిన సార్వత్రిక సమ్మెను, ఆ రోజంతా ఎడాపెడా తిట్టిపోశాయి. సమ్మె సంస్కృతికీ, కార్మికుల న్యాయమైన డిమాండ్లకూ వ్యతిరేకంగా పౌరులకు 'బోధనలు' చేశాయి.
ఇదీ ఆ ఛానళ్ల నిజరూపం! ఆయా ఛానళ్ల అధిపతుల (వర్గ) తత్వం!
కె.ఎల్‌.కాంతారావు,జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment