Wednesday 14 March 2012


బల్లి శాస్త్రం.. విశ్లేషణ..

  • విశ్వాసాలు.. వాస్తవాలు...97
ఒకరోజు సుబ్బారావు మా ఇంటికి వచ్చాడు. కుశల ప్రశ్నలయిన తర్వాత చేతిలోని పుస్తకాలను పక్కనబెట్టి 'ఈ పంచాంగకర్తలకు తెలియని విషయం అంటూ ఏమీలేదు సుబ్బారావు! వారు బల్లి, పిల్లి, నల్లి ఏ జంతువైనా మన భవిష్యత్తును ఎంత బాగా చెబుతుందో కనుక్కున్నారు' అన్నాను.
నా మాటల్లోని ఎగతాళిని గ్రహించినా, గ్రహించనట్లు నటిస్తూ 'అవును లక్ష్మీకాంతం! వాళ్లు బల్లి పాటు ఫలితాలు, పిల్లి శకునాలు మన భవిష్యత్తులో జరగబోయేవి ఎలా చెబుతాయో చెప్పారు గదా?' అన్నాడు.
నా ముందున్న మూడు పంచాంగా లను అతని ముందుకు తోసి 'ఈ మూడు పంచాంగాలలో, నేను గుర్తులు పెట్టిన అంశాల్ని చదువు. వారు ఎంత పరస్పర విరుద్ధంగా రాశారు చూడు!' అన్నాను.
సుబ్బారావు తంగిరాల వారి పంచాంగాన్ని, బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగాన్నీ, అట్ట చినిగిపోయిన మరో పాత పంచాంగాన్నీ తీసుకొని వాటిని విశ్లేషించసాగాడు.
పాత పంచాంగంలో వీపుపై బల్లి బడితే స్త్రీలకు అపనింద అని ఒకచోట, వస్త్రలాభం అని మరోచోట ఉంది. చేతులపై బడితే పురుషులకు ధన నష్టమట; స్త్రీలకు సువర్ణప్రాప్తియట. అలాగే స్త్రీలకు స్తనంపై బడితే దుఃఖమనీ, రొమ్ముపై బడితే అత్యంత సుఖమనీ చెప్పబడింది. స్త్రీలకు స్తనం, రొమ్ము వేర్వేరు ప్రదేశాల్లో ఉంటాయేమో ఆ పంచాంగకర్తకే తెలియాలి.
అలాగే పాత పంచాంగంలో పురుషులకు ఎడమకన్ను అపజయమని రాస్తే, బుట్టే వీరభద్ర శుభమని రాశారు. 'నుదురు'పై బడితే బంధు గౌరవమని పాత పంచాంగకర్త రాస్తే, బంధు విరోధమని వీరభద్ర రాశారు. కుడి భుజం రాజభయమని పాత పంచాంగకర్త, కష్టం అని వీరభద్ర సెలవిచ్చారు. ఎడమ భుజం జయమని పాత పంచాంగకర్త, అగౌరవమని వీరభద్ర వివరించారు.
అంతేకాదు. చెవి దుర్వార్త అని తంగిరాలవారు సెలవిస్తే, కుడి చెవి ధన లాభం అని వీరభద్ర అంటున్నారు. పైపెదవి భూలాభం అని తంగిరాలవారు రాస్తే, కలహం అని వీరభద్ర చెబుతున్నారు. రొమ్ము, గుండె వేరు వేరు ప్రదేశాల్లో ఉంటాయని తంగిరాల వారు కూడా విభజించి రొమ్ముపైన జయమనీ, గుండెపైన పడితే భయమనీ నొక్కి వక్కాణిస్తున్నారు. వీరభద్ర కూడ వక్షమున సుఖమనీ, స్తనములందు అధిక దుఃఖమనీ తెలియజేస్తున్నారు. (స్తనములు వక్షము మీద ఉండవా? అని మా సుబ్బారావు కామెంట్‌!) గోళ్ళపైబడితే జంతుభయమని ఒకరూ, కలహం అని మరొకరూ, అలాగే మోకాలు వాహన లాభమని ఒకరూ, కష్టము అని మరొకరూ ఫలితాలు రాశారు.
అన్నీ చదివి సుబ్బారావు 'అసలు ఈ బల్లులకు మనకు వస్త్ర లాభమో, వాహన యోగమో, కలహమో కలుగుతాయని ఎలా తెలుసంటావ్‌? వాటికంత విజ్ఞానం కొన్ని వందల ఏళ్ల క్రితమే ఎలా వచ్చింది? వాటి స్కూళ్ళలో ఇవన్నీ బోధిస్తారా? అందులో కూడ ఒక స్కూలులో చెప్పినదానికి విరుద్ధంగా మరొక స్కూల్‌లో చెబుతారా? లేకపోతే బల్లులు చెప్పే భవిష్యత్తును సిద్ధాంతులు పరస్పర విరుద్ధంగా ఎందుకు చెబుతారు?' అన్నాడు నవ్వుతూ.
'అదే సుబ్బారావు! మన పెద్దలందరిలోనూ ఇలాంటి తార్కిక దృష్టి పెరగాలనే జనవిజ్ఞాన వేదిక వాళ్ళం కోరుకుంటున్నాం' అని సమాధానమిచ్చాను.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక. 

No comments:

Post a Comment