Wednesday 28 March 2012

‘ఫైవ్ స్టార్’ స్కూళ్లు అవసరమా?


పాతిక ఎకరాల సువిశాల ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక భవన సముదాయం.. భూకంపం వచ్చినా ప్రమాదం లేని గదులు, రోబోటిక్స్, కంప్యూటర్స్, లాంగ్వేజి ల్యాబ్‌లు.. ఫైర్ సేఫ్టీ, కేబుల్ టీవీ, ఎ.సి. సౌకర్యం, సిసి టీవీలతో నిరంతర నిఘా, ఎకోపార్క్, సైన్స్‌పార్క్, జిమ్, స్కేటింగ్ మైదానం, వాకింగ్ ట్రాక్, హైస్పీడ్ ఇంటర్నెట్, ఆడియో వీడియో గదులు.. ఈ జాబితా చదువుతుంటే ఇదేదో ఫైవ్‌స్టార్ హోటళ్లలో సమకూర్చే సదుపాయాల గురించి అనుకుంటే ‘తప్పు’లో కాలేసినట్లే. అంతం లేని ఈ చాంతాడు జాబితా ‘ఫైవ్‌స్టార్’ స్కూళ్లకు సంబంధించినది. రియల్ ఎస్టేట్ సంస్థలు, విలాసవంతమైన హోటళ్ల మాదిరి ఖరీదైన బ్రోచర్లను పంపిణీ చేస్తూ ఫైవ్‌స్టార్ స్కూళ్లు విద్యను ఇప్పటికే మార్కెట్ సరకుగా మార్చేశాయి. ‘ఈ హైటెక్ హంగులన్నీ మీ పిల్లల బంగారు భవిష్యత్‌కు కోసమే..’-అంటూ ఫైవ్‌స్టార్ పాఠశాలలు ఏటా అడ్మిషన్ల సీజన్‌లో భారీ హోర్డింగ్‌లు పెట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రచారానికి తగ్గట్టే ఇవి సంపన్న వర్గాలకే అందుబాటులో ఉంటున్నాయి. అయితే, ఇలాంటి పాఠశాలల్లో అడ్మిషన్ పొందితేనే తమ పిల్లలు బాగా రాణిస్తారని మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ అవస్థల పాలవుతున్నారు. ఎంత బాగా ఖర్చు చేస్తే పిల్లలు అంత బాగా చదువుతారనే భావనను వ్యాప్తి చేస్తున్న ఫైవ్‌స్టార్ పాఠశాలలు దండిగానే లాభాలను ఆర్జిస్తున్నాయి. హైటెక్ సౌకర్యాల గురించి గొప్పలు చెప్పే ఈ పాఠశాలల యాజమాన్యాలు విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, పిల్లల్లో ఆత్మవిశ్వాసం వంటి పదాల జోలికి వెళ్లకపోవడం మనకు విడ్డూరంగానే కనిపిస్తుంది. పిల్లల్ని సున్నితమైన బొమ్మలుగా, టెక్నాలజీకి బానిసలుగా మార్చడం తప్ప ఫైవ్‌స్టార్ స్కూళ్లలో సహజత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, మానవ సంబంధాలు, పిల్లల మానసిక సామర్థ్యం వంటివి కనిపించడం లేదన్న ఆరోపణలున్నాయి.
పాఠశాలల్లో పరిశుభ్రత, ప్రాథమిక సౌకర్యాలు అవసరమే అయినప్పటికీ లక్షలకు లక్షలకు వెచ్చించి హోటళ్లలో మాదిరి విలాసవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయనక్కర్లేదని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. అవసరం లేని ఆర్భాటాలు, హైటెక్ హంగులతో విద్యాబోధన మెరుగుపడుతుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఖరీదైన భవంతులు, కళ్లు చెదిరే హంగులు మంచి విద్యాప్రమాణాలకు భరోసా ఇస్తాయా? అన్న అనుమానాలు లేకపోలేదు.
గురుకుల పాఠశాలల సంస్కృతి పూర్వం భారతీయ సమాజంలో ఉండేది. గురుశిష్యుల మధ్య మంచి సంబంధాలు, క్రమశిక్షణ, వ్యక్తిగత శ్రద్ధ, పిల్లల్లో అన్యోన్యత, సమానభావం వంటివి అలనాడు కనిపించేవి. కాలగమనంలో విద్యావ్యవస్థలోనూ అనూహ్యమైన మార్పుల ఫలితంగా కార్పొరేట్
స్కూళ్లు తెరపైకి వచ్చాయి. అయితే, నేటికీ దేశంలో అధికశాతం విద్యాసంస్థలు ప్రభుత్వరంగంలోనే నడుస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకూ విద్యారంగాన్ని పాలకులు దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్నందున ప్రైవేటు సంస్థలకు గిరాకీ పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదివితే పరువు తక్కువ అన్న భావం నెలకొనేలా పరిస్థితులు మారిపోయాయి. తల తాకట్టు పెట్టయినా కానె్వంట్లు, టెక్నో స్కూళ్లు, కార్పొరేట్ కళాశాలల్లో పిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రులు తపన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫైవ్‌స్టార్ స్కూళ్లు ఆవిర్భవించాయి. తరగతి గదులను హోటళ్ల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఈ స్కూళ్లకే దక్కింది. ‘డబ్బుతోనే హోదా’ అనే భావాన్ని ఇవి పిల్లల్లో బలంగా నాటుతున్నాయి. గురువులపై, పెద్దలపై అంతగా గౌరవం లేకపోవడం, తామే అధికులమన్న భావం వంటివి ఇక్కడి పిల్లల్లో కనిపిస్తుంటాయన్న విమర్శలు లేకపోలేదు. సంస్కృతి, క్రమశిక్షణ, ప్రమాణాలు, వ్యక్తిత్వ నిర్మాణం వంటి విషయాలకు ఇవి ప్రాధాన్యం ఇవ్వకపోతే విద్యార్థులు మంచి పౌరులుగా రాణించలేరన్న విమర్శలున్నాయి. ‘ఎక్కువ ఫీజులు చెల్లిస్తేనే ఎక్కువ లాభం’ అన్న భావన తల్లిదండ్రుల్లో నాటుకు పోవడంతో ఈ స్కూళ్ల హవా కొనసాగుతోంది.
ఫైవ్‌స్టార్ హోటళ్ల సంస్కృతి ప్రభావం విద్యారంగంపై పడడం మంచి పరిణామం కాదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. విద్యా సంస్థల మధ్య పోటీ వాతావరణం పెచ్చుమీరడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రమాణాల విషయానికి పోకుండా ‘హైటెక్ హంగుల’పైనే ఆధారపడాలనుకోవడం వాంఛనీయం కాదంటున్నారు. విలాసవంతమైన వాతావరణంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దేశంలో అధికశాతం ఉన్న పేదవర్గాల విద్యార్థుల ఉన్నతికి ఈ సంస్థలు ఎలాంటి చొరవ చూపడం లేదని, తల్లిదండ్రులు కూడా ఈ పరిణామాలను పరిశీలించి తగిన పాఠశాలలను ఎన్నుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యారంగం ‘బతకడానికి’ కాదని, బతుకుల్ని మార్చడానికి అని గుర్తించాలని వారు అంటున్నారు.

No comments:

Post a Comment