Wednesday 22 February 2012

వాస్తుపై వాదోపవాదాలు

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 24 Feb 2010, IST  
  • విశ్వాసాలు.. వాస్తవాలు... 17
వాస్తువాది గౌరు తిరుపతిరెడ్డి తన 'గౌరువాస్తు' అనే మాసపత్రిక ఆగస్టు 2005 సంచికలో ఇలా సవాల్‌ విసిరారు.
''మేము వాస్తుకు విరుద్ధంగా ఒక ప్లాన్‌ ఇస్తాం. ఈ ప్లాన్‌ ప్రకారం హైదరాబాద్‌ నుండి ప్రొద్దుటూరుకు వెళ్ళే మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా 20కి.మీ. దూరంలోపు గ్రామాలలో మాత్రమే ఇంటిని నిర్మించాలి. ఇలాంటి ఇంట్లో ఐదేళ్లు కాపురం ఉండాలి. ఈ ఐదేళ్లలో ఆ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవించగల్గితే గౌరువాస్తు ప్రకటిస్తున్న రెండు లక్షల రూపాయలు ఆ ఇంట్లో నివసించిన కుటుంబం తీసుకోవచ్చు. అలా జీవించలేకపోతే వారు డిపాజిట్‌ చేసిన రెండు లక్షల రూపాయలు కోల్పోవలసి వస్తుంది. ''ఆ ప్లానులో ఆయన సూచించిన వాస్తుదోషాలేమిటంటే (1) పశ్చిమ నైరుతిలో గేటు (2) నైరుతిలో నుయ్యి (3) దక్షిణ-పశ్చిమాలలో భూమిలో నీరు నిలువ ఉంచడం. ఈ మూడు దోషాలు మరణాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలాగే మరికొన్ని వాస్తుదోషాలుగా పేర్కొనబడిన ఇంటిని సూచించారు. వాటి కారణంగా పురుషుల జీవితాలకు ఘోరకలి అనీ, సుదతుల సుఖాలను నలగదంచుతుందనీ, అంతులేని అరిష్టాలొస్తాయనీ అస్పష్ట ఫలితాలు సూచించారు. దానికి నేనిచ్చిన సమాధానాన్ని, దానికి గౌరుగారి సమాధానాన్ని 'గౌరువాస్తు' అక్టోబరు 5లో ప్రచురించారు. నేను నా సమాధానంలో ఇలా పేర్కొన్నాను.

''మీ సవాల్‌లో మీరు సూచించిన వాస్తుదోషం ఉన్న ఇంట్లో ఐదు సంవత్సరాలు 'ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవించగలిగితే'' రెండులక్షల రూపాయలు ఇస్తామన్నారు. వాస్తును సైన్సుగా మీరు పరిగణిస్తున్నారు. కాబట్టి, మీ సవాలు మరింత శాస్త్రబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ వాస్తు దోషం కారణంగా ఏకాలంలో ఎటువంటి దుష్ఫలితం వస్తుంది అనే విషయాన్ని మీరు స్పష్టంగా పేర్కొనాలి. అంతేకాని 'ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా' అని అస్పష్టంగా ప్రకటిస్తే ఎలా? ఐదు సంవత్సరాలపాటు ఆ ఇంట్లో ఎవ్వరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు రాకుండా ఉంటాయా? దానిని కూడ మీరు మీ ఒడిదుడుకుల జాబితాలో చేర్చవచ్చుగదా? అందువలన, వాస్తు దుష్ఫలితాలను స్పష్టంగా ప్రకటించండి. అంతేకాదు. 'వాస్తుదోషం' ఉన్న ఇళ్ళవాళ్లు పట్టణాల నుండి, నగరాల నుండి మీ వద్దకు వందల సంఖ్యలో వస్తుంటారు. అలాంటి వారికి నివారణా పద్ధతులు చెప్పకుండా మా జనవిజ్ఞాన వేదిక సభ్యులకు కనీసపు అద్దెకీయమనండి. పైన నేను పేర్కొన్నట్లు 'ఆ ఇళ్ళలోని వాస్తు దుష్ఫలితాన్ని' మీరు స్పష్టంగా పేర్కొనండి. మీ సవాలును ఎదుర్కొనడానికి మా కార్యకర్తలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అంతేకాని హైదరాబాద్‌-ప్రొద్దుటూరు మెయిన్‌రోడ్డుకు 20 కి.మీ. దూరంగా ఉండే గ్రామంలో ఏ ఉద్యోగస్థుడైనా, వ్యవసాయదారుడైనా ఐదు సంవత్సరాలు ఎలా ఉండగలడు? ఏం పెట్టుకొని తినగలడు? కాబట్టి మీరు మరింత వాస్తవిక దృక్పథంతో విషయాన్ని పరిశీలించి సవాలును విసిరితే, ఆ సవాలును స్వీకరించడానికి జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.''
నా సమాధానానికి గౌరు తిరుపతిరెడ్డి ప్రతి సమాధానం ఏమిచ్చారో వచ్చే వారం ఇదే శీర్షికలో చదవండి...
- కె.ఎల్‌.కాంతారావు, (జనవిజ్ఞానవేదిక)

No comments:

Post a Comment