Wednesday 22 February 2012

జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 24 Feb 2010, IST  
ప్రతి సంవత్సరం ఈ నెల 28న 'జాతీయ సైన్స్‌ దినోత్సవం' జరుగుతుంది. నోబెల్‌ బహుమతి గ్రహీత సర్‌ సి.వి.రామన్‌ కనిపెట్టిన రామన్‌ ఎఫెక్ట్‌కు గుర్తింపుగా ఈరోజున జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని జరపాలని 1986లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే రోజున రామన్‌ తన విశిష్ట 'రామన్‌ ఎఫెక్ట్‌'ను కనుగొన్నారు. ''కొత్త విషయాలను కనిపెట్టి దేశాభివృద్ధికి తోడ్పడిన శాస్త్రజ్ఞులకు ఈరోజున దేశం కృతజ్ఞతలతో, గౌరవాభివందనలను తెలుపుతుంది. ఈ రోజున జరిగే విద్యాకార్యక్రమాలు బాలల్ని 'విజ్ఞానశాస్త్రం' వైపు ఆకర్షించి, వృత్తిగా స్వీకరించేందుకు ప్రోత్సహిస్తుంది. శాస్త్రజ్ఞులందరూ నాణ్యమైన పరిశోధనలతో దేశాభివృద్ధికి పునరంకితం కావడానికి, వీరి పరిశోధనలతో దేశం గర్వపడడానికి ఈ రోజు అవకాశం కల్పిస్తుంది. ''దేశప్రగతికి, జాతి పురోభివృద్ధికి శాస్త్రవిజ్ఞానం అత్యవసరమని ఈ రోజు ఉత్సవాలు దేశప్రజలకు సందేశాన్నిస్తాయి'' అని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ సూచించారు.

విజ్ఞానశాస్త్ర ఫలాలు ముఖ్యంగా నూతన సాంకేతికాల రూపంలో అందుబాటులోకి వస్తున్న సాంకేతిక ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలవారికీ, ముఖ్యంగా అణగారిన వర్గాలకూ, పేదలకూ అందాలని మన విజ్ఞాన వీచిక కోరుకుంటుంది. అలానే జనవిజ్ఞాన వేదిక లాంటి ఇతర సంస్థలూ కోరుకుంటున్నాయి. అయితే ఇప్పటి ప్రపంచీకరణలో అదనపు సౌకర్యాల పేరుతో ఆధునిక సాంకేతికాల ద్వారా బహుళజాతి కంపెనీలు మన దేశ వనరులను ప్రజలను, శ్రామికులను దోచుకుంటూ మన ఆర్థిక, సాంఘిక వ్యవస్థలపై పట్టును సాధించుకుంటున్నాయి. ఒకవైపు ఈ సాంకేతికాలు అదనపు ప్రయోజనాలను కలిగిస్తున్నట్లు కనిపిస్తున్పప్పటికీ, అవి కలిగించబోయే నష్టాలను వెంటనే అంచనాకు రాలేకపోతున్నాం. ఉదాహరణకు.. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, పట్టణ మురికివాడల్లో నాణ్యమైన తాగునీటి లభ్యత ఒక సమస్యగా ఉంది. దీనివల్ల అనేకమందికి జబ్బులు వస్తున్నాయి.

ఎంతోమంది అంటురోగాల బారిన కూడా పడుతున్నారు. వెంటనే వైద్యం అందనివారు చనిపోతున్నారు కూడా. వీరికి నాణ్యమైన, సురక్షితమైన నీటి సరఫరా చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. దీనికోసం క్లోరినేషన్‌ చేసి వడపోసి సురక్షితమైన నీటిని సరఫరా చేస్తే సరిపోతుంది. ఇది చౌకైనది కూడా. ప్రత్యామ్నాయంగా కాచి, చల్లార్చి, వడబోసిన నీటిని అలవాటు చేయిస్తే కూడా సమస్య పరిష్కారమవుతుంది. ఇది అన్నికాలాల్లో సురక్షితమైన, విశ్వసనీయమైన పద్ధతి కూడా. దీనికి బదులుగా ప్రభుత్వం ఏం చెపుతుందంటే.. ఈ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడానికి 20లీటర్ల మినరల్‌వాటర్‌ను రెండు రూపాయలకే సరఫరా చేస్తానని చెప్తుంది. ఒక పథకాన్ని కూడా రూపొందించింది. దీని అసలు ఉద్దేశం సురక్షితమైన నీటిని సరఫరా చేసే ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కాకుండా ప్రకృతి వనరైన నీటిని అమ్మి కొనే వస్తువుగా మార్చడం. తద్వారా కార్పొరేట్‌ రంగాలకు ప్రకృతివనరులను కట్టబెట్టి, వారికి శాశ్వత లాభాలను సమకూర్చిపెట్టడం. ఇటువంటి కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలను, దీనిలో ఉన్నటువంటి సాంకేతికాలను ప్రజలకు వివరిస్తూ సైన్స్‌ దినోత్సవ సందర్భంలో ప్రజలను చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని గమనంలో ఉంచుకొని విజ్ఞానవీచిక వరుసగా గత రెండు వారాలు (11,18 తేదీల్లో)గా సాంకేతిక విజ్ఞానం మంచిచెడ్డలను పాఠకుల దృష్టికి తీసుకువచ్చింది. ఈ సందర్భంలో మినరల్‌ వాటర్‌ గురించీ ఈ శీర్షిక కిందే రెండుసార్లు (మే, 14, జులై 31) వివరాలు ఇచ్చాం. ఈ విజ్ఞానం జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా అందరిలోకి వెళ్లాలని విజ్ఞానవీచిక కోరుకుంటుంది.

గత ఐదేళ్లులో చేసిన కృషి ఆధారంగా విజ్ఞానశాస్త్రాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసిన వ్యక్తికి లేదా సంస్థకు, ప్రచార మాద్యమానికి (పేపరు, రేడియో, టీవీ, చిత్రాలు), బాలల్లో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేసిన వారికి వేరువేరుగా ఈ సందర్భంలో జాతీయ పురస్కారాలు ఇస్తారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వైపు బాలల్ని ఆకర్షించేందుకు ఈ రోజున వివిధ పరిశోధనా సంస్థలు బాలల్ని ఆహ్వానించి తమ పరిశోధనల్ని చూపెడతాయి. సైన్స్‌ ప్రదర్శనలు, పోటీలు, ఇతర కార్యక్రమాలు బాలల్లో శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథంపై అవగాహనను పెంచుతుంది. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శాస్త్రీయ దృక్పథం విస్తరిస్తున్నమేర ఈ ఉత్సవాల లక్ష్యాలు నెరవేరినట్లుగా భావించాలి.
ముగింపు
విజ్ఞానశాస్త్రం విస్తరిస్తున్నకొలదీ, అదనపు సాంకేతికాలు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉపయోగించుకున్న మేర అదనపు సౌకర్యాలను, అవకాశాలను కలిగించవచ్చు. కానీ, ఏ కొత్త సాంకేతికాన్నైనా వినియోగించుకునే ముందు దాని మంచి, చెడ్డలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కేవలం ప్రచార సమాచారం మీద ఆధారపడకుండా, స్నేహితులు, శ్రేయోభిలాషులు, జనవిజ్ఞాన వేదిక లాంటి స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని కొత్త సాంకేతికాలను ఆహ్వానించి, నిత్యజీవితంలో ఇముడ్చుకోవాలి. దీనికి బదులుగా కేవలం కంపెనీల ప్రచారం మీద ఆధారపడి, నిర్ణయం తీసుకుంటే, పలు సందర్భాలలో విలువైన వనరులను, కాలాన్ని నష్టపోవాల్సి రావచ్చు. లేదా కంపెనీల మీద, ఇతర సంస్థల మీద ఆధారపడాల్సి రావచ్చు. తద్వారా అదనపు ఖర్చుల, స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని కోల్పోవాల్సి రావచ్చు. ముఖ్యంగా, కొత్తకొత్తగా మార్కెట్‌లోకి వచ్చే ఆహారపదార్థాలు, ఇతర విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రపంచీకరణ కాలంలో నష్టపోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అందువల్ల నిత్య జీవితంలో కొత్తగా ఇముడ్చుకునే సాంకేతికాలు అంతిమంగా భారం కాకూడదని అనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

No comments:

Post a Comment